క్రైమ్/లీగల్

బైక్ అదుపు తప్పి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని ముంజులూరు గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన వల్లభ శ్యాం కుమార్ చంద్ (19) మచిలీపట్నం నుండి బంటుమిల్లి వైపు ద్విచక్ర వాహనంపై శుక్రవారం వెళుతుండగా ముంజులూరు గ్రామంలోని కంచడం అడ్డ రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపు తప్పి పంట కాలువలోకి పల్టీ కొట్టింది. దీంతో కాలువలో ఉన్న సిమెంట్ పంటి నేరుగా చంద్ కంఠంలోకి దూసువెళ్లింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ కె శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 21: స్థానిక హుస్సేన్‌పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బందరు తాలుకా ఎస్‌ఐ రంగనాధ్ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం-గుడివాడ రోడ్డులో హుస్సేన్‌పాలెం వద్ద ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పెడన పట్టణం దక్షిణ తెలుగుపాలెంకు చెందిన తుమ్మా నాగరాజు (32), గంజావారిపాలెంకు చెందిన పేరే విజయ వర్ధన్ (26) ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురు వస్తున్న ప్రొక్లైన్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా గాయపడ్డ విజయ వర్ధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగనాధ్ తెలిపారు.

చోరీకి వచ్చి కారుతో ఉడాయించిన దుండగులు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 21: స్థానిక పాత హౌసింగ్ బోర్డు కాలనీలో తాళాలు వేసిన ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి బంగారు అభరణాలను తస్కరించి ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారుతో ఉడాయించారు. ఇంటి యజమాని డెక్కా విజయ కుమార్ ఈ నెల 17వ తేదీన ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే శుక్రవారం తెల్లవారు జామున ఇంటి తలుపులు పగలకొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని విజయ కుమార్‌కు అందచేశారు. విజయ కుమార్ బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా దుస్తులు, ఎల్‌సీడీ టీవీ, ల్యాబ్‌టాప్, కేజీ వెండి అభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటితో పాటు ఇంటి ఆవరణలో పార్క్ చేసిన ఏపీ 16డీఎన్ 1222 కారు కూడా మాయం కావటం విశేషం. చోరీ విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ మహ్మద్ బాషా ఘటనా స్థలికి వెళ్లి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ

మచిలీపట్నం, సెప్టెంబర్ 21: జిల్లాలో ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్ పరిధిలో మొత్తం 12 సీఐలు బదిలీ అవ్వగా జిల్లాకు సంబంధించి ముగ్గురు బదిలీ అయ్యారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎస్‌వివిఎస్ మూర్తిని రాజమహేంద్రవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే మైలవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న పి రామచంద్రరావును ఏలూరు రేంజ్‌కు బదిలీ చేస్తూ వీఆర్‌లో పెట్టారు. ఏలూరు రేంజ్‌లో విఆర్‌లో ఉన్న సిహెచ్ సూరిబాబును మైలవరంకు బదిలీ చేశారు. తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కెవివిఎన్ సత్యనారాయణను కూడా ఏలూరు రేంజ్‌కు బదిలీ చేస్తూ వీఆర్‌లో పెట్టడం విశేషం. వీఆర్‌లో ఉన్న ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్‌ను తిరువూరు సీఐగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నందిగామ సీఐగా పని చేస్తున్న ఎఎన్‌ఎన్ మూర్తి ఇటీవల వీఆర్‌లో పెట్టగా ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న మరో సీఐ కె సతీష్‌ను నియమించారు.

అసమ్మతి ఎంపీటీసీలతో ఎమ్మెల్యే భేటీ

బంటుమిల్లి, సెప్టెంబర్ 21: బంటుమిల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు పాలడుగుల వనవలమ్మపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసిన అధికార తెలుగుదేశం పార్టీలోని ఎంపీటీసీలతో శుక్రవారం ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీలతో సమావేశమైన కాగిత పరిస్థితులను చర్చించారు. ఎంపీపీ వనవలమ్మ కుమారుడు, మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు పాలడుగుల వెంకటేశ్వరరావుపై వారు పలు ఆరోపణలు చేశారు. దీనిపై విస్తృతంగా చర్చించిన అనంతరం కాగిత వెంకట్రావ్ ఎంపీపీ వనవలమ్మను సోమవారం రాజీనామా చేయాలని ఆదేశించారు.