క్రైమ్/లీగల్

అధిక వడ్డీ గాలం.. అసలుకే మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తమ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి వేలకోట్ల రూపాయలు వసూలు చేసిన ‘హీరాగోల్డ్’ గుట్టు బట్టబయలైంది. ఇటీవల కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటనతో హీరాగోల్డ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయిది. తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హీరాగోల్డ్ కంపెనీ విస్తరించి, వేలకోట్ల రూపాయలు వసూలు చేయడం.. వాటిని మరోమార్గంలో సొంత ఖాతాల్లోకి జమ చేయడం.. భారీగా ఆస్తులను కూడబెట్టుకోవడంతో ఆ కంపెనీ మోసాలు వెలుగు చూశాయి. దీంతో హీరాగోల్డ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని, ఆమెను హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వివరించారు.
తిరుపతి పట్టణానికి చెందిన నౌహీరా షేక్ అనే మహిళ హీరాగోల్డ్ మనీ స్కీమ్‌ను (గొలుసుకట్టు పథకం) ప్రారంభించింది. ఈ కంపెనీకి అనుబంధంగా మరో 15 కంపెనీలు స్థాపించి, ఆయా కంపెనీల్లో వివిధ పేర్లతో మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ కంపెనీల్లో కనీసం రూ.50,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 25 నుంచి 36 శాతం వరకు వడ్డీ జమచేస్తామని డిపాజిట్‌దార్లను నమ్మించారు. వేలాది మంది హీరాగోల్డ్ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. ఈ కంపెనీల్లో అత్యధికంగా మోసపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిపాజిట్ దారులేనని అంజనీ కుమార్ చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, దుబాయ్ నుంచి కూడా డబ్బులు జమచేశారు. దేశవ్యాప్తంగా 160 బ్యాంక్‌ల్లో హీరాగోల్డ్ కంపెనీ ఖాతాలున్నాయని, అత్యంత విలువైన 43 ఆస్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. గడువు ముగిసినా డిపాజిట్‌దారులకు తిరిగి డబ్బు చెల్లించడంలో కాలయాపన చేస్తుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డిపాజిట్‌దారుల నుంచి వేలాది కోట్లు వసూళు చేశారని, అయితే కచ్చితంగా ఎంత మొత్తం వసూలు చేశారన్నది దర్యాప్తులో వెల్లడవుతుందని చెప్పారు. బంజారాహిల్స్ పోలీసులు నౌహీరా షేక్‌ను అరెస్టు చేశారని చెప్పారు. బ్యాంక్‌ల్లో జమ చేసిన మొత్తాన్ని ఎలా విత్‌డ్రా చేశారన్నది క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. మనీ స్కీమ్ పథకాల పేరుతో సామాన్యులను మోసం చేస్తున్నారని.. ఇలాంటి వ్యక్తులు, కంపెనీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హీరాగోల్డ్ బాధితులకు పోలీసులు అండగా ఉంటారని, తమకు జరిగిన అన్యాయాలను పోలీసులకు సమాచారం అందిస్తే డబ్బులు తిరిగి ఇప్పించడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. అదనపు డీసీపీ జోగయ్య, ఏసీపీ రామ్‌కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మీడియా సమావేశంలో సీనియర్ ఐపీఎస్ అధికారి క్రైమ్ అదనపు కమిషనర్ శిఖాగోయెల్ పాల్గొన్నారు.
చిత్రం..హీరాగోల్డ్ మోసాలను వెల్లడిస్తున్న అంజనీకుమార్