క్రైమ్/లీగల్

రైల్వే ట్రిబ్యునళ్ల విచారణలో 33 వేల కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), డిసెంబర్ 7: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే ట్రిబ్యునళ్లలో 33 వేల కేసులు విచారణలో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్ల సంఖ్యను పెంచి విచారణ కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ చైర్మన్ జస్టిస్ కె కన్నన్ వెల్లడించారు. శుక్రవారం గుంటూరు రైల్వేస్టేషన్, అరండల్‌పేట ప్రాంతంలో రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ అమరావతి బెంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జస్టిస్ కన్నన్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా గుంటూరులో స్థాపించిన ట్రిబ్యునల్ 22వదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కలిపి సికింద్రాబాద్‌లో బెంచ్ ఉండగా ప్రభుత్వాల విజ్ఞప్తితో పాటు కక్షిదారుల సౌకర్యం కోసం గుంటూరులో బెంచ్ ఏర్పాటు చేసినట్లు కన్నన్ వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 90 శాతం వివిధ సంఘటనలకు సంబంధించిన బాధితుల కేసులని, మిగిలిన 10 శాతం రవాణా వ్యవహారాలకు సంబంధించినవని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లకు సంబంధించిన కేసులను ప్రత్యేకించి విచారిస్తారన్నారు. 75 లక్షల బడ్జెట్‌తో బెంచ్ కార్యాలయాన్ని ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిర్మించామన్నారు. ఉమ్మడిగా ఉన్న సికింద్రాబాద్ బెంచ్ నుండి అమరావతి బెంచ్ పరిధిలోకి 1670 కేసులను బదిలీ చేశామని, తద్వారా ఈ ప్రాంత కక్షిదారులైన ప్రయాణికులకు సరుకు రవాణాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన విచారించి న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. తొలుత బెంచ్‌కు ప్రారంభోత్సవం చేసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో గుంటూరుకు ప్రత్యేకస్థానం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ మెంబర్ శేఖరం, గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ విజి భూమా, సికింద్రాబాద్ ట్రిబ్యునల్ టెక్నికల్ మెంబర్స్ గణేశ్వరరావు, ఎం సర్జనరావు, ఢిల్లీ ట్రిబ్యునల్ బెంచ్ రిజిష్ట్రార్ కెపి యాదవ్, ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ పాల్గొన్నారు.
చిత్రం..రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ అమరావతి బెంచ్‌ను గుంటూరులో ప్రారంభిస్తున్న
జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ కన్నన్, రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్