క్రైమ్/లీగల్

నగల దోపిడీ కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, డిసెంబర్ 24: పక్కా ప్రణాళిక ప్రకారం పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఓ వృద్ధురాలిని మాయమాటలతో నమ్మించి బంగారు నగలు దోచుకున్న ఇద్దరు కిలాడీలను చేబ్రోలు సీఐ డి నరేష్‌కుమార్ సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నరేష్‌కుమార్ విలేఖర్లకు వివరించారు. పొన్నూరు మండలం, ఇటికంపాడుకు చెందిన దారా గంగాభవాని అనే వృద్ధురాలు తెనాలిలోని తన చిన్న కుమార్తెయైన విశాలాక్షి వద్ద ఉంటుంది. అయితే ఆ ఇంటిపై అద్దెకు ఉంటున్న తోడేటి విమల మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ నాలుగు నెలలుగా కనీసం అద్దెకూడా కట్టడం లేదు. వృద్ధురాలు గంగాభవాని వద్ద బంగారు నగలు అధికంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా వీటిని కాజేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా షేక్ షర్మిల అనే తన స్నేహితురాలితో కలిసి వ్యూహం రచించింది. ఇందుకు షర్మిల సోదరుడు షేక్ కరిముల్లా సహకారం కూడా తీసుకున్నారు. పథకంలో భాగంగా షర్మిల వృద్ధురాలికి ఈనెల 20న ఫోన్‌చేసి నీకు ఆరు నెలలుగా పెన్షన్ రావడం లేదు. సాయంత్రంలోగా పొన్నూరు మున్సిపాలిటీ ఆఫీసుకు వస్తే పెన్షన్ వస్తుందని ఫోన్‌లో నమ్మబలికింది. అంతేగాక పొన్నూరు నుంచి తాను ఒక మనిషిని తెనాలి బస్టాండ్‌కు పంపిస్తానని, అతనితో కలిసి నువ్వు రావాలని మాటమాటలు చెప్పింది. వీటిని గుడ్డిగా నమ్మిన వృద్ధురాలు గంగాభవాని తన కుమార్తెకు పొన్నూరు వెళ్తున్నట్లు చెప్పి తోడుగా విమలను రావాలని కోరింది. తను అనుకున్న విధంగా పథకం ఫలించిందని మనసులో ఆనందించిన విమల వృద్ధురాలికి తోడుగా ఆటోలో తెనాలి బస్టాండ్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఎఎస్‌ఎన్ కళాశాల బంకు వద్ద ఆగి సిమ్‌కార్డు కొనుక్కురమ్మని విమలను వృద్ధురాలు కోరగా ఆటోదిగిన విమల వెంటనే షర్మిలకు ఫోన్‌చేసి తమ వద్దకు రావాలని తెలిపింది. వెంటనే షర్మిల రంగంలోకి దిగి ఆటో వద్దకు వచ్చి వృద్ధురాలితో తన పేరు గాయత్రి అని, పొన్నూరు నుంచి వచ్చానని చెప్పి పరిచయం చేసుకుంది. ఇలా డ్రామా నడుపుతూ అదే ఆటోలో పొన్నూరు మున్సిపాలిటీకి వృద్ధురాలిని చేర్చారు. సాయంత్రం పొద్దుపోయే వరకు మున్సిపాలిటీ వద్దే కాలం గడిపి, షర్మిల సోదరుడు కరిముల్లాతో మాట్లాడి అతను చెప్పిన పథకం ప్రకారం అదే ఆటోలో వృద్ధురాలిని నారాకోడూరుకు తీసుకువచ్చారు. నారాకోడూరు నుండి మినీబైపాస్ రోడ్డులో పెన్షన్ ఇచ్చే అధికారులు ఉన్నారని మళ్లీ నమ్మించారు. చిక్కుడు తోటల వద్దకు తీసుకువెళ్లగానే మోటారు బైకుపై వచ్చిన కరిముల్లా వృద్ధురాలిని కత్తితో బెదిరించి, ఆమె వద్దనున్న బంగారు గొలుసు, గాజు, ఉంగరం, వెండి ఉంగరం, ఆమె వద్ద గల బ్యాగ్‌ల్లోని చంద్రహారం, 30 వేల రూపాయలు దోచుకున్నారు. అలాగే కరిముల్లా తన మోటారు బైకుపై విమల, షర్మిలను ఎక్కించుకుని ఉడాయించారు. అనంతరం వృద్ధురాలు గంగాభవాని తాను మోసపోయానని గ్రహించి ఈ విషయాన్ని తన బంధువులకు తెలియజేసింది. ఈ విషయాన్ని చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 24న తోడేటి విమల, షేక్ షర్మిలను తెనాలిలోని జేపీ నగర్‌లో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మొత్తం కుతంత్రాన్ని బయటపెట్టారు. దీంతో వారు తాకట్టుపెట్టిన బంగారు గొలుసు, గాజుతో పాటు 10 వేల రూపాయలు రికవరీ చేశారు. మరో నిందితుడు కరిముల్లా పరారీలో ఉన్నట్లు సీఐ నరేష్‌కుమార్ తెలిపారు.