క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, డిసెంబర్ 24:అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. అందుకు సంబంధించి డీఎస్పీ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోడుమూరు మండల పరిధిలోని అనుగొండ గ్రామానికి చెందిన నీలిసికారి రాజు(30), కోసిగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన బోస్లే లస్సి అలియాస్ పాండు(40), కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ ప్రాంతానికి చెందిన నీలిసికారి శాలు అలియాస్ షారుక్‌ఖాన్(20), నీలిసికారి లలీ(26), నీలిసికారి జెమిని అలియాస్ నాయుడు(23), నీలిసికారి రాయిరెడ్డి(20) ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారన్నారు. వారందరూ ఎవరికీ అనుమానం రాకుండా సంగాల గ్రామ శివారులో షెడ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. కాగా నల్గొండ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ పవన్ అమకతాడు టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నాడు. అతడి ద్విచక్ర వాహనం గత అక్టోబర్ 18వ తేదీ చోరీకి గురైంది. దీంతో ఆయన సమీప ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో నవంబర్ 2వ తేదీ క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ విజయభాస్కర్ సిబ్బందితో మండల పరిధిలోని గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఎరుకలచెరువు క్రాస్ రోడ్డు వద్ద 3 ద్విచక్ర వాహనాలపై ఆరుగురు యువకులు అనుమానాస్పందంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ పవన్‌కు చెందిన ద్విచక్ర వాహనం వారి వద్ద దొరికింది. దీంతో పోలీసులు మరింత లోతుగా వారి శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగుచూశాయి. ఈ ముఠా సభ్యులంతా బంధువులు, దాయాదులు కావడంతో గత కొంత కాలంగా గ్రూపుగా ఏర్పడి కర్నూలు, ఓర్వకల్లు, డోన్, గుత్తి, క్రిష్ణగిరి, అమకతాడు టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు దొంగలిస్తూ ఉండేవారన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి పక్కన వాహనాలను నిలిపి నిద్రపోతున్న డ్రైవర్లు, క్లీనర్ల వద్ద సెల్‌ఫోన్లతో పాటు నగదు కూడా దొంగలించే వారని తెలిపారు. వారి నుంచి మొత్తం 22 ద్విచక్ర వాహనాలు, 60 సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై సుమారు 25 కేసులు ఉన్నాయని, గతంలో జరిగిన 2 మర్డర్ కేసుల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. డోన్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో క్రిష్ణగిరి ఎస్‌ఐ విజయభాస్కర్, దేవనకొండ ఎస్‌ఐ పీరయ్య, ప్యాపిలి ఎస్‌ఐ మారుతీశంకర్, డోన్ రూరల్ ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసును ఛేదించారు. అత్యంత చాకచక్యంగా కేసును ఛేదించిన బృందంతో పాటు సిబ్బందికి డీఎస్పీ ఖాదర్‌బాషా రివార్డులు ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. కాగా గ్రామ శివారుల్లో కొత్త వ్యక్తులు నివాసం ఉంటూ అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.