క్రైమ్/లీగల్

తగ్గిన నేరాలు.. పెరిగిన ఆర్థిక, సైబర్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: రాష్ట్రంలో నేరాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చుకుంటే.. 2018లో 3.49 శాతం తగ్గాయి. అదేవిధంగా మహిళా సంబంధ నేరాలు కూడా గత ఏడాది కంటే ఈ సంవత్సరం 4.23శాతం తగ్గింది. దీంతోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా 11.76 శాతం తగ్గాయి. మొత్తం మీద ప్రధానమైన నేరాలు అదుపులోకి వచ్చినా.. ఆర్థికపరమైన, సైబర్ నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆర్ధికపరమైన నేరాలు 29శాతం, సైబర్ నేరాలు 26శాతం పెరగడం గమనార్హం.
విపరీతంగా పెరిగిన టెక్నాలజీ వినియోగంతోపాటు, ప్రజల్లో అవగాహనలోపమే ఇందుకు కారణమని రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో 2018 రాష్టస్ధ్రాయి క్రైం రివ్యూకు సంబంధించి వార్షిక సమీక్షను డీజీపీ ప్రకటించారు. ఆర్థిక, సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి పటిష్ట చర్యలు తీసుకున్నందున రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అయితే వచ్చే సంవత్సరాన్ని ఎన్నికల ఏడాదిగా పరిగణిస్తూ సవాళ్ళను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసుశాఖ సంసిద్ధంగా ఉందన్నారు. ఇందుకుగాను తగిన చర్యలు తీసుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. 2019లో పోలీసువ్యవస్ధను మరింత పటిష్ట పరిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళున్నామన్నారు. ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజకీయపార్టీల కార్యకలాపాలు పెరగనున్నందున అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తామన్నారు.
ప్రధానంగా పెండింగ్ వారెంట్లు పూర్తిస్ధాయిలో అమలు చేస్తామని, అదేవిధంగా ఆయుధాలు, బాంబులను సీజ్ చేస్తామని చెప్పారు. బాంబుల తయారీ స్ధావరాలపై నిఘా వేసి సీజ్ చేయడంతోపాటు రాష్ట్రంలో విస్తృత తనిఖీలు చేపడతామన్నారు. గొడవలు, ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ఆరువేల సీసీ కెమెరాల సంఖ్య పెంచి మొత్తం 19వేల కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు 1400 అదనపు వాహనాలు ప్రవేశపెట్టడం ద్వారా నిరంతర గస్తీ ఉంటుందని చెప్పారు. ఇదిలావుండగా గత ఏడాది 19 వామపక్ష తీవ్రవాద సంఘటనలు జరుగ్గా ఈ ఏడాది 12 చోటు చేసుకున్నాయని, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్య ఘటనలు దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది 337 కేసుల్లో 897 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 5807 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలకుగాను 50డ్రోన్ కెమెరాలను డీజీపీ పంపిణీ చేశారు. వీటితోపాటు 40 సైబర్ ఫోరెన్సిక్ ఫీల్డ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల్లో ప్రాథమిక సాక్ష్యాధారాల సేకరణకు సైబర్ కిట్లు దోహదపడతాయని చెప్పారు. ఇప్పటికే విశాఖ, విజయవాడలో సైబర్ పోలీస్టేషన్లు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో వీటి సంఖ్య పెంచుతామన్నారు. అదేవిధంగా కర్నూలు, తిరుపతి, రాజమండ్రిలో ఎనాలసిస్ ల్యాబ్‌లు ప్రారంభిస్తామని చెప్పారు. డ్రోన్లు, కిట్లు 13జిల్లాల యూనిట్లుకు పంపిణీ చేసి క్షేత్రస్ధాయిలో గస్తీ, నేరాల నియంత్రణతోపాటు, సాక్ష్యాధారాల సేకరణకు వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడి అదనపు డీజీ అమిత్‌గార్గ్, ఐజి సంజయ్, లా అండ్ ఆర్డర్ ఐజి రవిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.