క్రైమ్/లీగల్

జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ ముమ్మర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మిడివరం, జనవరి 19: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డిపై కోడి కత్తి దాడికి సంబంధించి ఎన్‌ఐఏ అధికారుల బృందం శనివారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో దర్యాప్తు నిర్వహించింది. జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టు రెస్టారెంటులో కుక్‌గా పనిచేస్తున్న ముమ్మిడివరం మండలం ఠాణేలంక పెదపేటకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు గత గత ఏడాది సెప్టెంబర్ 25న కోడికత్తితో దాడికి పాల్పడటం, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు అప్పగించడం, దానిపై వైసీపీ నేతలు జాతీయ దర్యాప్తు సంస్థకు ఆ కేసును అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ సీఐ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మరో ముగ్గురు సభ్యులు ముమ్మిడివరం చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. శుక్రవారం శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి కుటుంబ సభ్యుల నుండి వాగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. శనివారం మరో మారు శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉన్నట్లు భావించిన పలువురిని విచారించినట్లు తెలిసింది. శ్రీనివాసరావు దగ్గర లభించిన లేఖను రాసిన ఠాణేలంకకు చెందిన జనిపల్లి విజయదుర్గను వీఆర్వో ఆర్ భాస్కరావు సమక్షంలో శనివారం లోతుగా విచారించినట్లు తెలిసింది.
ఆమెను సుమారు మూడు గంటలకు పైగా విచారించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఆమె చేతిరాత, శ్రీనివాసరావు దగ్గర లభించిన లేఖలోని చేతి రాతను పోల్చేందుకు మళ్లీ ఒక ఉత్తరం రాయించినట్లు సమాచారం. అలాగే జగన్‌తో కలిసి శ్రీనివాసరావు ఉన్నట్లుగా ఫ్లెక్సీ వేయించిన, ఉత్తరాన్ని జిరాక్స్ తీయించిన జె శివసుబ్రహ్మణ్యంతో పాటు శ్రీనివాసరావు ప్రవర్తనపై గ్రామస్థులను కూడా విచారించినట్లు తెలిసింది. శ్రీనివాసరావు తల్లితండ్రులు తాతారావు, సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిర్వహించిన ఆర్ధిక లావాదేవీలపై కూడా విచారించినట్లు సమాచారం. ఇంటి నిర్మాణానికి తీసుకున్న రుణాలపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది.

చిత్రం..ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో శ్రీనివాసరావు కేసు వివరాలు ఇవ్వాల్సింగా కోరుతూ
లేఖ రాస్తున్న ఎన్‌ఐఏ సీఐ భాషా