క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో లేబర్ కోర్టు అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపాటి గాంధీని ఆదివారం తెల్లవారు జామున వారాసిగూడలోని ఆయన నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో సోదా నిర్వహించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆస్తుల వివరాల డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లభించడంతో గాంధీని లోతుగా విచారించిన తర్వాత తెల్లవారు జామున అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత అనూహ్యంగా స్పృహతప్పి పడిపోవడంతో నిందిత అధికారిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎసిబి అధికారులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో ఏసీబీ అధికారులు ఇబ్బందిపడ్డారు. అరెస్టు అయిన తర్వాత గాంధీ అక్కడకు చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ తన భార్యకు, తల్లికి వాళ్ల తరఫున తెచ్చుకున్న బంగారు
నగలను కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. తనకు ఉన్న ఆస్తుల అన్నీ కష్టార్జితమేనని, అయితే తమ బంధువుల్లో కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారం మేరకు ఎసిబి అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కాగా గాంధీ హాస్పిటల్‌లో వైద్య చికిత్సలు అందించిన తర్వాత ఆరోగ్యం బాగుందని వైద్యులు నిర్ధారించడంతో నిందిత అధికారిని ఆదివారం రాత్రి న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరు పర్చారు. నిందితుడు గాంధీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం సేకరించిన తర్వాత ఆ వివరాలతో ఏసీబీ అధికారులు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అనుమతి పొందిన అనంతరం సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో ఆయన నివాసం, నాంపల్లి, డీడీ కాలనీ, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రెండుచోట్ల, ఏలూరు, రాజమండ్రి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎసిబి అధికారుల సోదాల్లో భారీగానే స్ధిరాస్తులు బయటపడ్డాయి. బంజారాహిల్స్, డీడీ కాలనీలో ఖరీదైన ఫ్లాట్, వారాసిగూడలో ఇల్లు, మరో మూడంతస్తుల భవనం, పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో 9 ఎకరాల వ్యవసాయభూమి, కరగపాడులో మరో 8 ఎకరాలు, నివాసంలో కిలో బంగారం, లాకర్‌లో మరో కిలో బంగారం, నాలుగు కిలోల వెండి, 9 లక్షల బ్యాంకు నగదు నిల్వ, ఖరీదైన మూడు కార్లు, ఇతర గృహోపకరణాలను గుర్తించినట్లు ఎసిబి వర్గాల సమాచారం. ఎసిబి డిప్యూటీ డైరక్టర్ మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు.