క్రైమ్/లీగల్

ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తొలి నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. వేలల్లో విద్యార్థులు తాము ఆశించిన మార్కులకు భిన్నంగా ఇంటర్మీడియట్ ఫలితాలు ఉండటంతో గగ్గోలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఉత్తీర్ణులవుతామని భావించిన సబ్జెక్టులు ఫెయిల్ కాగా, అనుమానం ఉన్న సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు రావడం చూస్తుంటే ఏదో జరిగిందనే అనుమానాలను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలపై 10 రోజుల పాటు రకరకాల ఊహాగానాలకు తావిచ్చిన బోర్డు అధికారులు చివరికి 18వ తేదీ ఉదయం ఫలితాలు ఇస్తామని ప్రకటించారు. ముందు రోజు ఉదయం కాదని, సాయంత్రం ఇస్తామని సమయాన్ని మార్చారు. ఫలితాల విడుదల ప్రక్రియను ఐదు నిమిషాల్లో తూతూ మంత్రంగా ముగించారు. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి పరీక్షలు బాగా రాయలేదని ముందే ఆత్మహత్యకు పాల్పడగా, ఆ విద్యార్థి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఘట్‌కేసర్ అవుషాపూర్ నివాసి నవ్యశ్రీ ఫలితాల్లో మంచి ప్రతిభ చూపలేననే భయంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఆమె అనుమానం వ్యక్తం చేసిన ఇంగ్లీషులో 64, సంస్కృతంలో 82, మాథ్స్ పేపర్-1లో 27 మార్కులు సాధించింది. హన్మకొండ మోడం భానుకిరణ్ అనూహ్య ఫలితాలతో రైలు కింద పడి మరణించాడు. నిజామాబాద్ బోధన్ ఎడవల్లికి చెందిన వెనె్నల ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మారేడుపల్లికి చెందిన లాస్య సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్‌రావు నగర్‌లో ఒకరు, కాగజ్‌నగర్‌లో మరొకరు, నిజామాబాద్ జిల్లాలోనే ఇంకొకరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రధానంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మాథ్స్ -2 పేపర్లలో విద్యార్ధులకు ఊహించని శరాఘాతం ఎదురైంది. పేపర్ల కఠినత్వ స్థాయి చాలా భిన్నంగా ఉందని ముందే ఆంధ్రభూమి వార్తాకథనాన్ని అందించింది. ఫలితాలు కూడా అదే మాదిరి రావడం గమనార్హం. ప్రతి ఏటా ఉత్తీర్ణతా శాతం పెరుగుతూ వస్తుండగా, ఈ ఏడాది అకస్మాత్తుగా ఉత్తీర్ణతా శాతం తగ్గడం వెనుక మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లే కారణమని విద్యార్థులు వాపోతున్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభం నుండి ఇంటర్మీడియట్ బోర్డు అనేక ప్రయోగాలను చేసింది. ప్రధానంగా అడ్మిషన్లు, పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల డాటా సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సాఫ్ట్‌వేర్ దెబ్బకు కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించినా, అది బ్యాంకర్ల నుండి అప్‌డేట్ కాకపోవడంతో కొన్ని కాలేజీలు రెండోమారు ఫీజును చెల్లించాయి. అక్కడి నుండి మొదలైన సమస్యలు పరీక్షలు, అనంతరం ఫలితాలపై కూడా ప్రభావితం చేశాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. 2018లో ఫస్ట్‌ఇయర్ 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా, ఈ ఏడాది 60.5 శాతంగా నమోదైంది. సెకండియర్‌లో గత ఏడాది 67.06 శాతం రాగా, ఈ ఏడాది 64.8 శాతం వచ్చింది. వోకేషనల్ ఫలితాల్లో గత ఏడాది ఫస్టియర్‌లో 58.55 శాతం రాగా ఈ ఏడాది 53.2 శాతం వచ్చింది. సెకండియర్‌లో గత ఏడాది 69.56 శాతం రాగా, ఈ ఏడాది 67.7 శాతం మాత్రమే వచ్చింది. సెకండియర్ పరీక్షలకు జనరల్ రెగ్యులర్ అభ్యర్ధులు 3,82,534 మంది, ప్రైవేటు అభ్యర్ధులు 68,960 మంది, వోకేషనల్‌లో రెగ్యులర్ అభ్యర్ధులు 35,734 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు అభ్యర్ధులు 3,121 మంది పరీక్ష రాశారు. వీరిలో జనరల్ రెగ్యులర్‌లో 1,49,574 మందికి ఏ-గ్రేడ్ దక్కింది. 65,388 మందికి బీ-గ్రేడ్, 25,013 మందికి సీ-గ్రేడ్, 7,780 మందికి డీ-గ్రేడ్ దక్కింది. 2,47,755 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 70.8 శాతం, బాలురు 58.2 శాతం పాసయ్యారు.
అతీగతీ లేని రీవెరిఫికేషన్ పోర్టల్
రీవెరిఫికేషన్ పోర్టల్ 19వ తేదీ నుండి పనిచేస్తుందని బోర్డు అధికారులు ప్రకటించినా, ఇంకా దానికి లింక్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి 25వ తేదీ వరకూ గడువు ఇచ్చిన బోర్డు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో శుక్రవారం నాడు విద్యార్థులు కాలేజీలకు వెళ్లగా ఇంకా పరీక్షల అప్లికేషన్లు రాలేదని చెప్పడంతో వెనుదిరిగారు.
ఆందోళన వద్దు: బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో పారదర్శకత, బాధ్యతతో తప్పులు లేకుండా నిర్వహిస్తోందని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమాచారం కావాలన్నా హెల్ప్‌డెస్క్ 040- 24600110ను సంప్రదించాలని, కొంత మంది ఫలితాల్లో ఎఎఫ్ అని పేర్కొనడంపై అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. ఎఎఫ్ అంటే ఆబ్సంట్ అండ్ ఫెయిల్ అని, పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరైనా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బ్లాంక్ బార్ కోడ్ వివరాలు బోర్డుకు సమర్పించకపోవడంతో మార్కులు మెమోలో ప్రతిఫలించలేదని, వాటిని సరిచేస్తామని అన్నారు.
అవకతవకలపై విచారణ: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్‌లు డిమాండ్ చేశారు. అధికారులు, కమిషనర్ బాధ్యతారాహిత్యం కారణంగా ఫలితాల్లో అవకతవకలు జరిగి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని వారు చెప్పారు. పరీక్షల నిర్వహణపై అవగాహన లేని ప్రైవేటు ఏజన్సీకి అప్పజెప్పడం వల్లనే విద్యార్థులు నష్టపోయారని, మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఫలితాల్లో నష్టపోయారని అన్నారు.