క్రైమ్/లీగల్

వైద్యులకు భద్రత కల్పన పిటిషన్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా దాఖలైన పిటీషన్‌పై సుప్రీం కోర్టు కేసును వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు సమ్మె బాట పట్టగా, వారికి మద్దతుగా దేశ వ్యాప్తంగా వైద్యులు సోమవారం ఒక రోజు సమ్మె చేసి సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యుల రక్షణకు సంబంధించిన అంశంపై అంత అర్జంటుగా చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రతి డాక్టర్‌కూ పోలీసు రక్షణ కల్పించాల్సిందిగా తాము పోలీసులను ఆదేశించలేమని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ అంశంలో ప్రభుత్వానికి నోటీసు ఇవ్వలేమని, అయితే వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వైద్యులు సమ్మె విరమించినందున ఇప్పుడు అంత అత్యవసరంగా కేసు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని తెలిపింది. వైద్యులకు రక్షణ కల్పించడం అనేది చాలా ప్రధానమైన అంశమని అభిప్రాయపడింది. వైద్యులకు రక్షణ కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఇతర పనులు వదులుకుని వైద్యులకు రక్షణ ఉండాలని చెప్పలేమని, పైగా పోలీసుల లభ్యత ఎంత తదితర విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కోర్టు వివరించింది. ఇలాఉండగా దేశ వ్యాప్తంగా వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఇంప్లీడీ అవుతూ పిటీషన్ దాఖలు చేసింది.
బెంగాల్‌లో ఒక రోగి మరణించడంతో డాక్టర్ల తప్పిదం కారణంగానే మరణించినట్లు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఇద్దరు డాక్టర్లపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో తొలుత పశ్చిమ బెంగాల్‌లోని వైద్యులు ఆందోళనకు దిగి విధులు బహిష్కరించడంతో ఎక్కడికక్కడ సేవలు నిలిచి పోయాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత జోక్యం చేసుకుని సోమవారం డాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపి వైద్యులకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వైద్యులు సమ్మె విరమించారు. బెంగాల్‌లో డాక్టర్లు చేపట్టిన సమ్మెకు దేశ వ్యాప్తంగా డాక్టర్లు కూడా సంఘీభావంగా సమ్మెకు దిగడంతో మమతపై వత్తిడి పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మెపై తమకు నివేదిక పంపించాలనడంతో మరింత వత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.