క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ట్రెజరీ అకౌంటెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 18: అవినీతి నిరోధక శాఖ (ఎ.సి.బి) అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. విశాఖ జిల్లా పాడేరు సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బి.వి.ఎం.కొండలరావు 93,200 రూపాయల లంచం తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నాం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పాడేరులోని పంచాయతీరాజ్ శాఖ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో డివిజనల్ అకౌంట్స్ అధికారిగా పనిచేసిన ఎస్.రమేష్ మార్చి 7వతేదీన ఏసీబీకి పట్టుబడగా, మూడున్నర నెలల వ్యవధిలోనే మరో అవినీతి ఉద్యోగి వీరికి చిక్కాడు. వివరాల ప్రకారం పాడేరు మండలంలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు 2000వ సంవత్సరంలో అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయులుగా విధుల్లోకి చేరారు. 2000 నుంచి 2007వ సంవత్సరం వరకు అన్‌ట్రైన్డ్ టీచర్లుగా పనిచేసిన వీరికి ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేసింది. మండలంలోని 38 మంది ఉపాధ్యాయుల నోషనల్ ఇంక్రిమెంట్ల ఏరియర్ బిల్లులను చెల్లించేందుకు స్థానిక సబ్‌ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బి.వి.ఎం.కొండలరావు లంచం డిమాండ్ చేశారు. ఏరియర్ బిల్లుల మొత్తంలో పది శాతం సొమ్మును తనకు ముట్టచెప్పాలని, లేకుంటే బిల్లులను మంజూరు చేసేది లేదని కొండలరావు తేల్చి చెప్పారు. దీంతో ఇంత మొత్తాన్ని ముట్టచెప్పలేక ఉపాధ్యాయులు వౌనం దాల్చగా, ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రం ముందుకు వచ్చి తమ బిల్లులను మంజూరు చేయాలని, ఇందుకోసం ఎనిమిది శాతం మొత్తాన్ని ముడుపుగా చెల్లించేందుకు అంగీకరించి ఈ ఐదుగురు ఉపాధ్యాయులకు చెందిన సుమారు పదకొండు లక్షల రూపాయల నోషనల్ ఇంక్రిమెంట్ల ఏరియర్ బిల్లుల మంజూరుకు 93,200 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కాగా తమ బిల్లులను మంజూరు చేసేందుకు అధిక మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసిన కొండలరావుపై ఉపాధ్యాయులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నాం ఉపాధ్యాయుల నుంచి కొండలరావు డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కె.రంగారావు విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన కొండలరావు నుంచి 93,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, ఆయనను అరెస్ట్ చేసి బుధవారం విశాఖపట్నంలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్టు చెప్పారు. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్లు గణేష్, రమణమూర్తి, అప్పారావు పాల్గొన్నారు.
చిత్రం...ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అకౌంటెంట్ కొండలరావు