క్రైమ్/లీగల్

ఏ ప్రాతిపదికన ‘ఎర్రమంజిల్’ కూల్చివేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఏ ప్రాతిపదికపై ఎర్రమంజిల్ భవనాలను కూలుస్తారని రాష్ట్ర హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని నిలదీసింది. పురాతన భవనాల జాబితాను రహస్యంగా ఉంచడం, ఇష్టానుసారం వాటి నిర్మాణాలను కూలదోసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎర్రమంజిల్ భవనం స్థానంలో శాసనసభ, శాసనమండలి, స్పీకర్ కార్యాలయం, మండలి చైర్మన్ కార్యాలయం నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని అదనపు ఏజీ జే రామచంద్రరావు పేర్కొన్నారు. పురాతన భవనాలను ఏ చట్టం ప్రకారం కూలుస్తారని ప్రశ్నించింది. దీనికి అదనపు ఏజీ బదులిస్తూ అది ప్రభుత్వ ఆస్తి అని, క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అర్బన్ ఏరియా డెవలప్‌మెంట్ చట్టంలోని హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ రెగ్యులేషన్స్ నిబంధనలను ఉల్లంఘించి పురావస్తు భవనాన్ని కూలదోయాలని ఎలా అనుకుంటారని
న్యాయమూర్తులు ప్రశ్నించారు. 2015లోనే జీవో 183 ద్వారా ఎర్రమంజిల్ భవనాన్ని పురావస్తు భవనాల జాబితా నుండి తొలగించడమైందని ఏఏజీ వివరించారు. జనరల్ కాజెస్ చట్టంలోని సెక్షన్ -6 చూడాలని ప్రధాన న్యాయమూర్తి అదనపు ఏజీకి సూచించారు. హెరిటేజ్ లిస్టులో ఉన్న 137 భవనాలు, ఇతర 15 కట్టడాలకు ఎలాంటి ముప్పు లేకుండాచూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. పురావస్తు భవనాలకు సంబంధించి ఏమైనా మార్పులుచేర్పులు చేయాలంటే ప్రభుత్వం హెచ్‌ఎండీఏ అనుమతి పొందాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఇటు ప్రభుత్వం తరఫున, అటు పిటీషనర్ల తరఫున హాజరైన న్యాయవాదుల్లో ఎవరూ సెక్షన్ 6 గురించి మాట్లాడకపోవడం విచారకరమని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎర్రమంజిల్ భవనానికి సంబంధించి ఏడు పిటిషన్లు దాఖలయ్యాయని, ఏ ఒక్కరూ జనరల్ క్లాజెస్ యాక్టు గురించి మాట్లాడకపోవడం విడ్డూరమని అన్నారు. సెక్షన్ -6 అనేది పిటిషనర్లకు చైనా వాల్ లాంటిదని, దీనితో ప్రభుత్వాన్ని నిలువరించవచ్చని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా వాటిని సైతం కోర్టు ముందుకు తీసుకురావల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులకు, ఏఏజీకి ఉందని ఫ్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేసే అంశంపై హైకోర్టులో బుధవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఎర్రమంజిల్‌లో ప్రస్తుతం ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం వారసులు నిర్మించిన పురాతన కట్డడాలను కూల్చివేయడానికి వీలు లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ భవనాలు చారిత్రక పరిరక్షణ కట్టడాల పరిధిలోకే వస్తాయని పిటిషనర్లు వాదించారు. ఎలాంటి అవుసరం లేకపోయినా కొత్తగా అసెంబ్లీ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీంతో ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుందని వారు వాదించారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడం లేదని, భద్రతా పరంగా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే నిపుణుల సూచనలతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవని అన్నారు. నిబంధనల ప్రకారమే నూతన అసెంబ్లీ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలు కావని, చారిత్రక జాబితా నుండి ప్రభుత్వం వాటిని తొలగిందని అదనపు ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఒక సారి పరిరక్షణ కట్టడాల పరిధిలో ఉన్న భవనాలను తర్వాత ఏ ప్రాతిపదికపై తొలగించారని హైకోర్టు ప్రశ్నించింది. చారిత్రక భవనాలను కాపాడాలని నిబంధనలు చెబుతున్నాయి కదా? అని పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని పేర్కొంది. దీనిపై మరో మారు వాదనలు వింటామని పేర్కొన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.