క్రైమ్/లీగల్

నగదు బదిలీ నిర్వాహకులకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, జూలై 21: ఎంతో అప్రమత్తంగా వ్యవహరించే మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రం నిర్వాహకులనే ఓ మోసకారి బురిడీ కొట్టించాడు. అచ్చంగా సినీ ఫక్కీలో వారిని మోసగించి 89 వేల రూపాయలతో ఉడాయించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్ల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకోగా, బాధితుడు ఆదివారం పలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. నవీపేట మండల కేంద్రంలో చందు అనే వ్యక్తి మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ కేంద్రం ద్వారా విదేశీ కరెన్సీని తీసుకుని భారత కరెన్సీలో మార్పిడి చేస్తూ డబ్బులు ఇవ్వడం, నగదు బదలాయింపు తదితర సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రంలో ఆపరేటర్ రేఖ ఉన్నారు. తనవద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 4800 ధరమ్స్ ఉన్నాయని ఆగంతకులు తెలుపుతూ, నల్లని పర్సులో వాటిని ఉంచి రేఖకు అందించాడు. వాటిని పరిశీలించిన ఆపరేటర్ రేఖ అవి అసలైన యూఏఈ ధరమ్‌లేనని నిర్ధారించుకుంది. వాటికి భారత కరెన్సీలో విలువ కట్టి ఎంత మొత్తంలో డబ్బులు వస్తాయన్నది తెలియజేసింది. అయితే ధరమ్‌లకు తక్కువగా వెల కడుతున్నారని పేర్కొంటూ, సదరు వ్యక్తి తన పర్సును వాపస్ తీసుకుని ఆపరేటర్ రేఖతో బేరసారాలు జరిపారు. చివరకు 4800 ధరమ్‌లకు 89 వేల రూపాయల భారత కరెన్సీని చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్టు నటిస్తూ, సదరు మోసకారి రేఖకు ధరమ్‌లు ఉన్న పర్సు కాకుండా అదే తరహాలో ఉన్న మరో జిరాక్స్ కరెన్సీలు ఉన్న పర్సును అందించాడు. అందులో పై భాగంలో రెండుమూడు ఒరిజినల్ కరెన్సీ నోట్లు పెట్టాడు. వాటి కింద మిగతా జిరాక్స్ తీసిన కాగితాలను కరెన్సీ సైజులో కత్తిరించి పెట్టాడు. అంతకుముందే ఆ పర్సులోని ఒరిజినల్ ధరమ్స్‌తో కూడిన కరెన్సీని చూడడం వల్ల ఆపరేటర్ పెద్దగా అనుమానించకుండా పర్సుతో సహా వాటిని డ్రాలో భద్రపర్చుకుని, ఆగంతకుడికి 89వేల రూపాయలను ముట్టజెప్పింది. డబ్బులు అందినదే తడవుగా ఆ యువకుడు అక్కడి నుండి ఉడాయించాడు. అనంతరం కొంతసేపటి తరువాత పర్సులోని కరెన్సీ నోట్లను పరిశీలించిన ఆపరేటర్ రేఖకు జిరాక్స్ కాగితాలు కనిపించడంతో హతాశురాలైంది. తాను మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే యజమాని చందుకు సమాచారం అందించగా, ఆయన మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రానికి చేరుకుని సీ.సీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆగంతకుడి ప్రతి కదలిక సీ.సీ ఫుటేజీలలో నిక్షిప్తమై ఉండగా, వాటి ఆధారంగా ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉండగా, ఇదే తరహాలో సదరు నిందితుడు కొద్దిరోజుల క్రితమే జిల్లా కేంద్రంలో సైతం ఓ మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్‌లో మోసానికి పాల్పడి డబ్బులతో ఉడాయించినట్టు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని నవీపేట పోలీసులు తెలిపారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
చిత్రాలు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఆపరేటర్‌తో బేరసారాలు జరుపుతున్న మోసకారి యువకుడి ఆనవాళ్లు,
* కలర్ జిరాక్స్ కరెన్నీ నోట్లు