క్రైమ్/లీగల్

చిదంబరం అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఇరవై నాలుగు గంటల పాటు అదృశ్యమైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని బుధవారం రాత్రి పొద్దు పోయాక పోలీసులు అత్యంత నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు. జోర్‌బాగ్ ప్రాంతంలోని ఆయన విలాసవంతమైన ఇంట్లోకి దొడ్డిదారిన కొందరు, గోడ దూకి మరి కొందరు సీబీఐ అధికారులు ప్రవేశించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన చిదంబరానికి బుధవారం కూడా చుక్కెదురైంది. ఆయనకు తక్షణం ఉపశమనం కలిగించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆకస్మికంగా ప్రత్యక్షమైన చిదంబరం అక్కడే మీడియానుద్ధేశించి మాట్లాడారు. ఐఎన్‌ఎక్స్ కేసులో తాను నిర్దోషినని చెప్పుకొచ్చారు. ఆ సమావేశాన్ని ముగించుకుని చిదంబరం ఇంటికి వెళ్ళిపోయిన గంట తర్వాత సీబీఐ అధికారులు అక్కడికి చేరుకుని ఆయన్ను అరెస్టు చేసి సమీపంలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళారు. ‘చిదంబరాన్ని అరెస్టు చేశాం..’ అని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనకు స్టే ఇవ్వాలని చిదంబరం చేసిన అభ్యర్థనపై శుక్రవారమే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడం, మంగళవారం ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకునేందుకు ఇటు సీబీఐ, అటు ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు అయ్యింది. బుధవారం చిదంబరం కనిపించడం లేదంటూ ఈ రెండు దర్యాప్తు సంస్థలూ లుక్ అవుట్ నోటీసు జారీ చేశాయి. ఆ విధంగా ఆయన దేశం వదిలి వెళ్ళిపోకుండా అన్ని మార్గాలనూ మూసేశాయి. అయితే రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షం కావడంతో అరెస్టు అనివార్యమన్న
ఊహగానాలు మొదలయ్యాయి. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీల్యాండరింగ్, ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను చిదంబరం ఎదుర్కొంటున్నారు. తన పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించిందని చట్టాన్ని గౌరవించి అప్పటి వరకూ ఆగాలని దర్యాప్తు ఏజెన్సీ అధికారాలను చిదంబరం కోరారు. ఈ కేసులో తనను, తన కుటుంబ సభ్యులను గట్టిగా సమర్థించుకున్నారు. తమపై ఏ రకమైన ఆరోపణలు రుజువు కాలేదని తెలిపారు. అలాగే ఇటు సీబీఐ గానీ, అటు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ గానీ ఎలాంటి ఛార్జీషీట్ తమపై దాఖలు చేయలేదన్నారు. అలాగే సీబీఐ రికార్డు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా తాను తప్పు చేసినట్లుగా ఎక్కడా లేదన్నారు. అయినప్పటికీ తాను తన కుమారుడు ఓ ఘోరం చేసినట్లుగా ప్రచారం జరిగిందని అన్నారు. ఈ రకమైన అబద్ధాలను, తప్పుడు ప్రచారాన్ని కొందరు దురుద్ధేశ్యపూర్వకంగా చేశారని ఆయన విమర్శించారు. అరెస్టు నుంచి తనకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించిందన్న ఆయన ‘చట్టం నుంచి నేను తప్పించుకుంటున్నానని ప్రచారం చేయడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది..’ అని వ్యాఖ్యానించారు. అలాగే తాను దర్యాప్తు ఏజెన్సీల నుంచి పారిపోవడం లేదని, న్యాయం కోసం ఇతర మార్గాలపై దృష్టి పెట్టానని, ఇందులో భాగంగా గత రాత్రి నుంచి తన లాయర్లతో మాట్లాడుతున్నానని చిదంబరం అన్నారు. తన బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడే వరకు దర్యాప్తు ఏజెన్సీలు తనను అరెస్టు చేయడానికి వీలులేదని చెప్పారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల సమక్షంలో ఓ లిఖితపూర్వక ప్రకటనను ఆయన చదివి వినిపించారు. విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ చిదంబరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సుప్రీం కోర్టు లాయర్లు అయిన కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్విలతో కలిసి చిదంబరం 10 నిమిషాల వ్యవథిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సీను చిదంబరం ఇంటికి మారింది. చిదంబరం ఇంటికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే దర్యాప్తు అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. అత్యంత నాటకీయ రీతిలో చిదంబరం అరెస్టు పరిణామాలన్నింటికీ ఆయన ఇల్లే వేదిక అయ్యింది. సీబీఐ అధికారులతో కూడిన ఓ బృందం ఆయన ఇంటి గోడలు ఎక్కి లోపలికి ప్రవేశిస్తే, మరో బృందం దొడ్డిదారిన ఇంట్లోకి ప్రవేశించింది. సీబీఐ బృందంతో పాటు చిదంబరం ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు ఎంతగా గేటు కొట్టినా ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. దాంతో కొందరు ఐదు అడుగుల ఎత్తు ఉన్న గోడను ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత ప్రధాన గేట్లు వాళ్ళే తీశారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. అలాగే శాంతి-భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు ఢిల్లీ పోలీసు అధికారులు కూడా అక్కడికి వచ్చారు. దాదాపు 24 మంది అధికారులు చిదంబరం ఇంటిని చుట్టు ముట్టారు. చిదంబరం ఇంట్లోకి ప్రవేశించే అలాగే బయటకు వెళ్ళే మార్గాలను మూసి వేశారు. అప్పటికే సిబల్, సింఘ్వితో కలిసి చిదంబరం మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్షణంలో లోపలికి ప్రవేశించిన అధికారులు చిదంబరంను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కేంద్రంపై విరుచుకు పడుతూనే ఉన్నారు. చిదంబరానికి పూర్తిగా సంఘీభావాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా కేంద్ర ధోరణిని తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపుతోనే చిదంబరాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. ఐఎన్‌ఎక్స్ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదని తాను చేసిన పనులను చిదంబరం మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించింది.
-
చిత్రం... చిదంబరాన్ని అరెస్టు చేసి ఇంటి నుంచి తీసుకెళ్తున్న పోలీసులు