క్రైమ్/లీగల్

కిలాడీ లేడీ.. కోటి స్వాహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 21: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి పరారైన ఓ కిలాడీ లేడి ఉదంతం కడప నగరంలో వెలుగుచూసింది. జిల్లావ్యాప్తంగా ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుండి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. సుమారు రూ. కోటి వరకు వసూలుచేసిన ఈ కిలాడీ లేడీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బు కోసం డిమాండ్ చేయగా పలువురికి ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. అంతేగాక మరికొంత మందిని రాజకీయనేతల ద్వారా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బాధితులు ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగర శివార్లలోని సింగపూర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ఓ మహిళ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని జిల్లా వ్యాప్తంగా అనేక మంది వద్ద డబ్బు వసూలు చేసింది. విజయవాడ కేంద్రంగా ఉన్న ఎస్‌ఐఇఆర్‌ఆర్‌ఏ (సియర్రా) సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ పేరుతో నగరంలో ఓ కార్యాలయం ఏర్పాటుచేసింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో పరిచయాలున్నట్లు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంది. ఈమె భర్త రిమ్స్ ఫిజియోథెరపిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రచారం, ప్రదర్శిస్తున్న పలుకుబడిని చూసి అనేక మంది ఈమె ఉచ్చులో పడ్డారు. రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఒక్కో ఉద్యోగానికి రేటు ఖరారుచేసుకుని, అడ్వాన్స్‌గా రూ.50 వేల నుండి రూ. లక్ష వరకు చెల్లించుకున్నారు. డబ్బు వసూలు కోసం ఈమె తెలుగుదేశం పార్టీలోని ప్రస్తుత మాజీ కార్పొరేటర్లు, ఎంపీ, మంత్రుల పీఏలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రూ.కోటి పైనే ఆ మహిళ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎన్నికలకు ముందు జనవరి నుండి మార్చి వరకు జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేస్తామని చెబుతున్నప్పటికీ, ఈ మహిళ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలుకుతూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు, కలెక్టర్ తదితర అధికారులను కలవడం పరిపాటిగా మారడంతో బాధితులు ఆమెపై నమ్మకంతో మరికొంతకాలం ఎదురుచూశారు.
ఒత్తిడి చేసినవారికి ఐపీ నోటీసులు
అయితే ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని తెలిసివచ్చాక తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఆ మహిళపై ఒత్తిడి తీసుకువచ్చారు. పలుకుబడి ఉన్నవారికి సర్దిచెప్పుకుంటూ వచ్చిన ఆమె సామాన్యులకు కోర్టు ద్వారా ఐపీ నోటీసులు పంపించింది. ఈ ఐపీ నోటీసులు పంపేందుకు కూడా, రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్న ఓ అడ్వకేట్‌ను ఎంచుకుంది. నోటీసులు అందుకున్న వారంతా లబోదిబోమంటున్నారు. కలమల్ల గ్రామానికి చెందిన కొందరు బాధితులు ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్‌లో ఈమెపై ఫిర్యాదు చేశారు.
ఈమె చేతిలో మోసపోయిన బాధితులు అశ్వని, మురళీకృష్ణ, సుధాకర్, నాగసురేంద్ర, రాజశేఖర్, సురేష్, వౌలాలమ్మ తదితరులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని, డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది చోటామోటా నేతలతో బాధితులను బెదిరిస్తున్నట్లు సమాచారం.