క్రైమ్/లీగల్

రిజిస్ట్రేషన్‌కు రూ. 75 వేల లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, నవంబర్ 21: అవినీతి అధికారులపై ఒక పక్క ఏసీబీ దాడులు, మరోపక్క పెట్రోల్ దాడులు జరుగుతున్నా లంచం తీసుకోవడానికి మాత్రం కొందరు అధికారులు ఏమాత్రం వెరవడం లేదు. పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లాలో ఒక అధికారి, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
గురువారం మక్తల్ పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్‌పి ప్రతాప్, ఎస్సై ప్రవీణ్, లింగస్వామి10 మంది సిబ్బందితో వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దీన్, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ హరీష్ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే అతను సంగంబండ గ్రామానికి చెందిన అమీరొద్దీన్, సలీం, తాజు, మహ్మద్ అనే నలుగురు అన్నదమ్ములకు సంబంధించిన 18 ఎకరాల పొలాన్ని మక్తల్ శివారులో కొనుగోలు చేశారు. ఈ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దీన్‌ను సంప్రదించారు. తన భార్య పేరుమీద 6 ఎకరాలు, తమ్ముని పేరుపై 8 ఎకరాలు, తన పేరుపై నాలుగు ఎకరాలు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలని వెంకట్‌రెడ్డి కోరగా, అందుకు రూ.75 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దీన్ డిమాండ్ చేశారు. అంత ఖర్చు ఇచ్చుకోలేము సారు కొంత తగ్గించమని అడిగినా ససేమిరా అన్న సబ్‌రిజిస్ట్రార్ చివరికి తను చెప్పిన ప్రకారమే రూ.75 వేలకు ఈనెల 7వ తేదీన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇదే నెల 21న వచ్చి ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించి మీ డాకుమెంట్స్‌ను తీసుకెళ్లాలని సబ్‌రిజిస్ట్రార్ చెప్పారు.
రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వానికి డాక్యుమెంట్ రుసుం మొత్తం చెల్లిస్తే సరిపోతుంది, దానికి సబ్‌రిజిస్ట్రార్‌కు ఇంత డబ్బు లంచంగా ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనతో వెంకట్‌రెడ్డి చివరికి ఏసీబీ అధికారులను సంప్రదించి పూర్తిస్థాయి వివరాలను చెప్పారు. దీంతో వారు చేతి పూతపూసిన రెండువేల నోట్లను వెంకట్‌రెడ్డికి ఇచ్చి మక్తల్‌కు పంపించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బును వెంకట్‌రెడ్డి సబ్‌రిజిస్ట్రార్ అధికారికి ఇవ్వగా తనకు వద్దు తమ అసిస్టెంట్‌కు ఇవ్వమనగా ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ హరీష్‌కు రూ.75 వేలను వెంకట్‌రెడ్డి ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకుని వారి నుండి రూ.75 వేలను స్వాధీనం చేసుకుని సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దీన్‌ను, ప్రైవేట్ అసిస్టెంట్ హరీష్‌లను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్‌పీ ప్రతాప్ మీడియాకు తెలియచేశారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తునట్టు ఆయన చెప్పారు. కాగా, లంచం అడిగిన ఏశాఖ అధికారులైనా 1064కు ఫోన్‌చేసి తెలియచేయాలని ఆయన కోరారు. లంచగొండి అధికారిని పట్టించడానికి ముందుకొచ్చిన వెంకట్‌రెడ్డిని తాను ఎంతగానో అభినందిస్తున్నానని అన్నారు.
*చిత్రం... మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ అధికారి హబీబొద్దీన్, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ హరీష్