క్రైమ్/లీగల్

సాక్షులను బెదిరించినట్టు ఆధారాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సమయంలో చిదంబరంను ముఖాముఖిగా ఎదుర్కోవడానికి తిరస్కరించిన సాక్షులను చిదంబరం కాని ఆయన తరపున మరెవరయినా కాని అడ్డుకున్నట్టు కాని, బెదిరించినట్టు కాని ఆధారాలు లేవని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన 74 ఏళ్ల చిదంబరంకు ఈ కేసులో బెయిలు మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం అతను తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది.
‘ఒక సాక్షి తాను, అప్పీలుదారు ఒకే రాష్ట్రానికి చెందిన వారమయినందున దర్యాప్తులో ముఖాముఖిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న దానికి అప్పీలుదారు (చిదంబరం) కాని అతని తరపున మరెవరయినా కాని బాధ్యులు కారు. ఎందుకంటే కస్టడీలో ఉన్న అప్పీలుదారును ముఖాముఖిగా ఎదుర్కొనేందుకు తిరస్కరించిన సదరు సాక్షిని అప్పీలుదారు కాని అతని తరపున మరెవరయినా కాని నిరోధించినట్టు కాని బెదిరించినట్టు కాని ఎలాంటి ఆధారాలు లేవు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో చిదంబరంకు బెయిలును తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు నవంబర్ 15వ తేదీన ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, హృషికేశ్ రాయ్ సభ్యులుగా గల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈడీ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిలు మంజూరుకు చేసిన అభ్యంతరాలను కూడా ప్రస్తావించింది. చిదంబరం దేశం విడిచి పారిపోయే ప్రమాదం లేకపోవడంతో పాటు ఆధారాలను తారుమారు చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయనే వాదనను పరిగణనలోకి తీసుకోలేదని, ఎందుకంటే ఇందుకు ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం తన 37 పేజీల తీర్పులో పేర్కొంది. అప్పీలుదారు ప్రస్తుతం ఎలాంటి రాజకీయ అధికారంలో లేరని అందువల్ల అతను సాక్షులను ప్రభావితం చేస్తారనే వాదనలో పసలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే అప్పీలుదారు దేశం విడిచి పారిపోయే ప్రమాదం లేనందున తదుపరి ఎలాంటి దర్యాప్తుకు అయినా అతను అందుబాటులో ఉంటాడని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్టోబర్ 14న చిదంబరానికి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పలు మార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు చివరకు సానుకూలంగా స్పందించి కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ ముందస్తు అనుమతి లేకుండా దేశాన్ని వీడి వెళ్ళరాదని ఆదేశించింది. సాక్షులను భయపెట్టి, ప్రభావితం చేసే పనులకు దూరంగా ఉండాలని సూచించింది. నవంబర్ 15న చిదంబరానికి బెయిల్ ఇవ్వరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. బెయిల్ మంజూరు చేస్తూ, సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా చిదంబరాన్ని సూచించింది. 20 లక్షల వ్యక్తిగత పూచీపై బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, హృషికేష్ రాయ్ కూడా సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ పేర్కొంది.
అవినీతికి కాంగ్రెస్ ఊతం: బీజేపీ
చిదంబరానికి బెయిల్ లభించిందన్న వెంటనే కాంగ్రెస్ వర్గాలు సంబరాలు జరుపుకోవడానికి బీజేపీ తప్పుబట్టింది. అవినీతికి ఊతమిస్తున్న కారణంగానే కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటున్నదని ఒక ప్రకటనలో మండిపడింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించింది. వివిధ నేరాల్లో ముద్దాయిలుగా ఉండి బెయిల్ పొందిన ఎంతో మంది కాంగ్రెస్ నేతల జాబితాలో చిదంబరం కూడా చేరారని ఎద్దెవా చేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా, ఇతర నాయకులు మోతీలాల్ వోరా, భూపేందర్ హూడా, శశిథరూర్ వంటి ఎంతో మంది నాయకులు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారని చిదంబరం కూడా ఆ జాబితాలో చేరారని వ్యాఖ్యానించింది.
వాస్తవాలు తెలిసాయి: కాంగ్రెస్
కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరంపై మోపిన కేసులకు సంబంధించిన వాస్తవాలు ఇప్పుడు అందరికీ తెలిసాయని కాంగ్రెస్ తన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. బలమైన అంశాలుగానీ, సాక్షాధారాలు గానీ లేకుండా చిదంబరం 105 రోజులు కస్టడీలో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఆయనపై మోపినవన్నీ నాన్-బెయిల్‌బుల్ కేసులేవీ కావని తెలిపింది. ఆయన చేసిన న్యాయ పోరాటం విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ వివరించింది.
‘న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం మాకు ఉంది. చిదంబరంపై మోపిన కేసులు చాలా సాధారణమైనవి. ఇందులో చెప్పుకోదగ్గ నేరారోపణలు ఏవీ లేవు. బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించడం సంతోషకరం. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు’.
- అభిషేక్ సింఘ్వి

‘కుట్ర పూరితంగానే చిదంబరాన్ని బీజేపీ సర్కారు అరెస్టు చేయించింది. ఏదో ఒక రకంగా కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న రీతిలో మోదీ సర్కారు వ్యవహారిస్తున్నది. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో చిదంబరంపై మోపిన కేసుల్లో వేటికీ సాక్షాధారాలు లేవు’.
- రాహుల్ గాంధీ
*చిత్రాలు.. . సుప్రీంకోర్టు వ కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం
*కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరానికి బెయిల్ మంజూరైన తర్వాత సుప్రీం కోర్టు ముందు
విలేఖరులతో మాట్లాడుతున్న ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ నాయకుడు అభిషేక్ సింఘ్వి