క్రైమ్/లీగల్

‘దిశ’పై స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్‌కు హైకోర్టు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / మహబూబ్‌నగర్: శంషాబాద్ వద్ద అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ కేసులో ప్రత్యేక త్వరితగతిన విచారించే న్యాయస్థానం ( ఫాస్ట్‌ట్రాక్ కోర్టు) ఏర్పాటైంది. ఈ కోర్టు నిర్వహణకు వౌలిక సదుపాయాలతో పాటు స్పెషల్ పీపీ నియామకాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను హైకోర్టు ఆమోదించింది. కేసు తీవ్రత దృష్ట్యా, నిందితులను త్వరగా విచారించి, కఠిన శిక్ష విధించేందుకు వీలుగా కేసును త్వరితగతిన విచారించే విధంగా కోర్టును ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హైకోర్టు ఆమోదించింది. దాంతో ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ న్యాయస్థానానికి మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు (ఎఫ్‌టీసీ) ఏర్పాటు కావడంతో అనుదినం ఈ కేసునే విచారించి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెబుతున్నారు. దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు ఎస్‌టీసీ ఏర్పాటుకు న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రతిపాదనను హైకోర్టు ఆమోదించడంతో సత్వరమే న్యాయస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గతంలో వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేయడంతో 56 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును వెల్లడించారు. అదే తరహాలో ఈ కేసులోనూ సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఏ. సంతోష్‌రెడ్డి జీవో 639 విడుదల చేశారు.
11 వరకూ రిమాండ్
‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుండి 11వ తేదీ వరకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. పోలీసులు గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుండి నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లు దృష్ట్యా వారిని వేరే చోటుకు తరలించి విచారించాలా? లేక జైలులోనే విచారించాలా? అనే అంశంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఏ విషయం నిర్ణయించిన తర్వాత దానికి అనుగుణంగా నిందితులను తరలిస్తారు.