క్రైమ్/లీగల్

8మంది బుకీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8మంది బుకీలను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి వద్ద నుండి 3లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పుణె నగరానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. సదరు అపరిచితుడు ‘ఓంలైన్’ పేరుతో వాట్సప్‌లో ప్రత్యేకంగా గ్రూప్‌ను క్రియేట్ చేసి బుకీల సహాయంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేటతెల్లమైంది.
ఇప్పటికే దాదాపు 80మంది వరకు ఈ గ్రూపు ద్వారా ప్రతిరోజు ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడుతుండగా, లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీ.పీ కార్తికేయ పట్టుబడ్డ బుకీల వివరాలను వెల్లడించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రత్యేక బృందాలను నియమించి నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని త్రీటౌన్ పరిధిలో గల రాజీవ్‌నగర్ కాలనీలో నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో బుకీలు మకాం వేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎస్‌ఐ కృష్ణ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు.
ఈ సందర్భంగా వాట్సప్ గ్రూప్ ద్వారా వచ్చిన బెట్టింగ్ వివరాలను పుస్తకంలో నమోదు చేస్తూ నగదును లెక్కిస్తున్న స్థితిలో నాగరాజుతో పాటు గౌతంనగర్‌కు చెందిన ఎం.బాలకృష్ణ, దుబ్బ అరుంధతీనగర్‌కు చెందిన కే.రమేష్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబరు. పోలీసుల రాకను పసిగట్టి సాహెబ్ అనే మరో బుకీ అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాడు. వీరి వద్ద లభ్యమైన ఆధారాలను పరిశీలించగా, 33మంది బెట్టింగ్‌లు ఆడుతున్నట్టు తేలింది. ఇదిలాఉండగా, త్రీటౌన్ పరిధిలోనే హమాల్‌వాడీ ప్రాంతంలో నిర్మల్ హృదయ్ పాఠశాల ఎదురుగా గల ఎస్‌ఆర్ మొబైల్ షాపులోనూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ కృష్ణ టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి దాడి జరుపగా, మొబైల్ షాపు యజమాని నవాతె సంజీవ్‌తో పాటు నాందేవ్‌వాడకు చెందిన ఎస్.జ్యోతీశ్వర్, ఖానాపూర్ గ్రామంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన పంచల రమేష్, బి.యాదగిరి, మోరె రాంజీలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని సీ.పీ కార్తికేయ తెలిపారు. వీరు కూడా పుణె నివాసి ‘ఓంలైన్’ పేరుతో క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్ ఆధారంగానే బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైందని, 47మంది బెట్టింగ్‌లు కట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని వివరించారు.
బుకీల వద్ద నుండి 3లక్షల రూపాయల నగదుతో పాటు 13సెల్‌ఫోన్‌లు, బెట్టింగ్‌లు కట్టిన 80మందితో కూడిన వివరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పట్టుబడ్డ 8మంది బుకీలను రిమాండ్‌కు తరలిస్తున్నామని, పరారీలో ఉన్న సాహెబ్‌తో పాటు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నట్టు వివరించారు.