క్రైమ్/లీగల్

చిరుతపులి దాడిలో మేకల కాపరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన సంపంగి ఎల్లయ్య(40) అనే మేకల కాపరి చిరుతపులి దాడిలో మృతి చెందాడని భీమ్‌గల్ సీ.ఐ సైదయ్య తెలిపారు. ఎప్పటిలాగే తన భార్య గంగామణితో కలిసి ఎల్లయ్య మంగళవారం ఉదయం మేకలు మేపేందుకు పిప్రి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం కోసం అతని భార్య పిలిచినప్పటికీ పలుకకపోవడంతో ఆమె అటవీ ప్రాంతమంతా గాలించింది. అయినప్పటికీ ఎల్లయ్య ఆచూకీ కనిపించకపోవడంతో గంగామణి, తన భర్త ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి ఇంటికి తిరిగి వచ్చింది. ఎల్లయ్య ఇంటి వద్ద కూడా లేకపోవడంతో ఆమె విషయాన్ని తన బంధువులకు తెలిపింది. ఆమె బంధువులు, స్థానికులు హుటాహుటిన అటవీ ప్రాంతానికి చేరుకుని మరోమారు గాలింపులు మొదలు పెట్టారు. ఎల్లయ్య వద్ద ఉండే సెల్‌ఫోన్‌కు రింగ్ చేస్తూ, ఆ శబ్దాన్ని అనుసరిస్తూ గాలింపులు జరిపారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో ఎల్లయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడి శరీరంలోని కడుపు, ఇతర భాగాలన్నీ ఎక్కడికక్కడ చీరుకుపోయి ఉండడం, చేతులు, కాళ్లు తినేసిన స్థితిలో ఉండడంతో చిరుతపులి దాడిలో చనిపోయాడని భావిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో భీమ్‌గల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి దేహంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే చిరుతపులి దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నామని సీఐ సైదయ్య పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి తరలివచ్చి ఆందోళనకు గురయ్యారు. చిరుత దాడి చేసి మేకల కాపరిని బలిగొనడంతో మునుముందు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, తక్షణమే చిరుతను బంధించాలని కోరుతున్నారు.