క్రైమ్/లీగల్

స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, బెంగళూరు, మే 17: దేశ న్యాయ వ్యవస్థలో అరుదైన ఘట్టంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆవిష్కృతమైంది. నరాలు తెగే ఉత్కంఠ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు సమావేశమై కర్నాటక గవర్నర్ బీజేపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పంపిన ఆహ్వానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. దాదాపు
మూడున్నర గంటల పాటు కాంగ్రెస్ పార్టీ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన తర్వాత బిజెపి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. గురువారం ఉదయం 9 గంటలకు యెడ్యూరప్ప బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేస్తారనంగా మూడు గంటల ముందు సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశం మేరకు జస్టిస్ ఎకె సిక్రి, ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. అనంతరం ఈ కేసును శుక్రవారానికి విచారణ నిమిత్తం వాయిదా వేస్తూ, బీజేపికి తనకున్న సంఖ్యాబలం వివరాలతో అఫిడవిట్‌ను ఇవ్వాలని ఆదేశించింది. ఈ లేఖ వచ్చిన తర్వాత పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో కర్నాటక ప్రభుత్వానికి, బిజెపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్పకు నోటీసులు జారీ చేసింది. ‘ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జరగకుండా ఆదేశాలు ఇవ్వలేం. కాని, ఈ కేసు విచారణలో ఇది కూడా భాగమవుతుంది’ అని కోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టు ధర్మాసనం ఇస్తుండగా, తుది ఆదేశాలు ఇవ్వవద్దని, శుక్రవారం కూడా వాదనలు వినిపిస్తామని కాంగ్రెస్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అభ్యర్థించారు. బీజేపికి 104 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉందని కాని గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి బీజేపిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాయిదా వేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, ఆ లోగా బీజేపి తనకున్న సంఖ్యాబలం వివరాలను తెలియచేస్తూ లేఖను ఇవ్వాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని ఒక గవర్నర్ ఒక పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పంపిన ఆహ్వానాన్ని ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించింది. దీనికి సింఘ్వీ బదులిస్తూ గతంలో ఈ అంశంపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ధర్మాసనం పలుసార్లు జోక్యం చేసుకుంటూ, అసెంబ్లీలో ఏకైక అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే, అడ్డుకోవడం సంప్రదాయం కాదన్నారు. పైగా గవర్నర్ మెజార్టీని నిరూపించుకోవాలని కూడా లేఖలో కోరారని ధర్మాసనం పేర్కొంది. గవర్నర్ ఆహ్వానంపై తాము ఇచ్చే ఆదేశాలు రాజ్యాంగపరంగా సంక్షోభం, శూన్యతకు దారితీసే అవకాశాలు లేకపోలేదని కోర్టు పేర్కొంది. ‘ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారు ఈ పనిచేయకుండా పార్టీలు మారుతారని, ఫిరాయింపునిరోధక చట్టం పరిధిలోకి ఎలా వస్తారు’ అని ధర్మాసనం పేర్కొంది. కాంగ్రెస్, జేడీఎస్‌కు మెజార్టీ ఉందని భావిస్తున్నప్పుడు, బీజేపికి బల నిరూపణకు 15 రోజులు ఎలా ఇచ్చారో తెలుసుకోవాలని ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీలో బలనిరూపణ జరిగిన తర్వాత కోర్టు ఈ కేసు విచారణ చేపట్టవచ్చని సూచించారు. గవర్నర్ విధులు నిర్వహించేంత వరకే రాజ్యాంగపరమైన రక్షణ కవచం ఉంటుందని కాంగ్రెస్ తరఫున న్యాయవాది సింఘ్వీ పేర్కొన్నారు. కోర్టు జోక్యం చేసుకుని గవర్నర్ విచణాధికారాలను కూడా స్క్రూటినైజ్ చేయమంటారా, ఇంకా బీజేపి గవర్నర్‌కు ఇచ్చిన సంఖ్యాబలం లేఖ తమకు అందకుండా ఏమి చేయమంటారని ధర్మాసనం ప్రశ్నించింది. బీజేపి, యెడ్యూరప్ప తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహ్టగి వాదనలు వినపిస్తూ, గవర్నర్ ఆహ్వానంపై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేరన్నారు. కాగా కర్నాటక పిసిసి అధ్యక్షుడు జి పరమేశ్వర, జేడీఎస్ తరఫున హెచ్‌డి కుమారస్వామి కూడా యెడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమంపై స్టే ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు.