క్రీడాభూమి

సర్వత్రా విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌తో సిరీస్‌పై సమాధానం చెప్పలేక పిసిబి ఉక్కిరిబిక్కిరి

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ దాదాపు లేనట్టేనని స్పష్టం కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇరకాటంలో పడింది. చివరి ఆశ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతుంటే, తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో అర్థంగాక పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్, పాలక మండలి చీఫ్ నజాం సేథీ తదితరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వెంట పడాల్సిన అవసరం లేదని, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి సిరీస్ జరగాలంటూ వెంపర్లాడడం ఒక రకంగా దేశంలోని క్రీడాభిమానులందరినీ కించ పరచడమేనని పిసిబిపై పలువురు మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. కానీ, తాము బతిమిలాడినా, బెదిరించినా, అన్ని షరతులకూ సానుకూలంగా స్పందించినా బిసిసిఐ ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో పిసిబి అధికారులకు బోధపడడం లేదు.
భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోనే ఆడతామని షహర్యార్ గతంలో స్పష్టం చేశాడు. బిసిసిఐ ప్రతిపాదించిన విధంగా భారత దేశంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సిరీస్ యుఎఇలోనే ఉండాలని అన్నాడు. పైగా చాలకాలంగా హోం సిరీస్‌లను తాము అక్కడే ఆడుతున్నామని, భారత్‌తో సిరీస్ కోసం తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. అదే మాట మీద పిసిబి నిల్చొని ఉంటే బాగుండేది. కానీ, రోజుకో మాటతో పరిస్థితిని గందరగోళంగా మార్చేసింది. చేతులారా పరువు పోగొట్టుకుంది. 2007, 2012 సంవత్సరాల్లో భారత్‌లో పాక్ జట్టు సిరీస్‌లు ఆడింది. రొటేషన్ విధానం ప్రకారం ఇప్పుడు పాక్‌లో లేదా ఆ జట్టు హోం గ్రౌండ్‌గా మార్చుకున్న యుఎఇలో భారత జట్టు మ్యాచ్‌లు ఆడాలి. ఒప్పందం ప్రకారం భారత జట్టు యుఎఇకి వచ్చి తీరాలని పట్టుబట్టిన పిసిబి మళ్లీ కాళ్లబేరానికి రావడం పాక్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. భవిష్యత్ టూర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని ఫ్యూర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ కమిటీ ఖారారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సిరీస్‌లను అడ్డుకోవు. అయితే, భద్రతా కారణాల వల్ల ప్రభుత్వాలు టూర్‌కు అంగీకరించకపోతే క్రికెట్ బోర్డులు ఏమీ చేయలేవు. ఐసిసి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. భారత్‌లో రాజకీయ పార్టీలేకాదు.. వీరాభిమానులు కూడా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు సుముఖంగా లేరు. ఈ విషయం తెలిసినప్పటికీ, భారత్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా ఆర్థికంగా బలపడాలన్నది పిసిబి అభిప్రాయం. అందుకే చాలాసార్లు బతిమిలాడింది. కొన్నిసార్లు హెచ్చరించింది. ఐసిసిసహా ఏ స్థాయి పోటీల్లోనూ ఆడకుండా భారత్‌ను వెలేస్తామని పలు సందర్భాల్లో బెదిరించింది. ఎన్ని ఎత్తులు వేసినా బిసిసిఐ ముందు చిత్తయింది. తమకు అనుకూలమైన ప్రకటనను రాబట్టుకోలేకపోయింది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో చర్చించేందుకు ఇటీవల ముంబయి వచ్చిన షహర్యార్‌కు చేదు అనుభవం తప్పలేదు. షహర్యార్, మనోహర్ భేటీని శివసేన తీవ్రంగా వ్యతిరేకించింది. ఏం ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో బిసిసిఐ ఈ సమావేశాన్ని రద్దు చేసుకోగా, షహర్యార్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఎన్ని మలుపులో..
భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ అంశం ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరపిస్తూ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఎప్పుడు, ఎవరు, ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి ప్రకటన చేస్తారో అర్థంగాని పరిస్థితి నెలకొంది. నిజానికి ఒప్పందాలు కుదుర్చుకొని, సిరీస్‌లను ఖరారు చేసే అధికారం బోర్డుకు ఉన్నప్పటికీ, ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే వాటికి అధికార ముద్ర పడుతుంది. మిగతా సిరీస్‌లకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టని పాక్, భారత్ ప్రభుత్వాలు ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. అందుకే షహర్యార్ లేదా మనోహర్ ఎన్నిసార్లు సమావేశమైనా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వాల నుంచి ఆమోద ముద్ర పడందే సిరీస్ అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసిసి సమావేశానికి హాజరైనప్పుడు షహర్యార్, మనోహర్ సమావేశమయ్యారు. అటు యుఎఇలో, ఇటు భారత్‌లో కాకుండా తటస్థంగా శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలని నిర్ణయించారు. పిసిబికి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెంటనే ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ రావడంతో, భారత సర్కారు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పిసిబి ఆశించింది. కానీ, అంచనాలు తారుమారయ్యాయి. కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తున్నామంటూ బిసిసిఐ తప్పించుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని పిసిబి వాపోతున్నది.
ఎవరూ రావడం లేదు
లాహోర్‌లో శ్రీలంక ఆటగాళ్లపై దాడి జరిగినప్పటి నుంచి జింబాబ్వే, కెన్యా మినహా మరే జట్టు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడలేదు. కెన్యా అనధికార వనే్డ టూర్‌లో ఆడింది. ఆ జట్టుతో సిరీస్ వల్ల పిసిబి లాభపడింది ఏమీ లేదు. మరోవైపు, ఆర్థికంగా పతనమై, డబ్బు కోసం దేనికైనా తెగించే పరిస్థితిలో ఉన్న జింబాబ్వే గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్ పర్యటనకు వెళ్లింది. టెస్టు హోదాలేని కెన్యా, ఆ హోదా ఉన్నప్పటికీ ప్రమాణాల్లో ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ వంటి జట్ల కంటే వెనుకబడిన జింబాబ్వే పర్యటనలతో పిసిబికి అదనపు ఖర్చే మిగిలింది. ప్రధాన జట్లు ఏవీ పాక్‌వైపు కనె్నత్తి చూడడం లేదు. బంగ్లాదేశ్ సైతం రెండు పర్యాయాలు పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో యుఎఇలో హోం సిరీస్‌లు ఆడాల్సిన దుస్థితి పిసిబికి తప్పలేదు. బిసిసిఐతో కాళ్లబేరానికి వచ్చినప్పటికీ పరువు పోగొట్టుకోవడం తప్ప పిసిబి సాధించింది ఏమీ లేదు. ఐసిసి సహా అన్ని స్థాయిల్లోనూ భారత్‌తో జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను బహిష్కరిస్తామని ప్రకటించిన షహర్యార్ ఆతర్వాత కొన్ని గంటల్లోనే మాట మార్చాడు. తన ఉద్దేశం అది కాదని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉందని తాను గుర్తుచేశానని అన్నాడు. యుఎఇలో తప్ప భారత్‌తో మరెక్కడా సిరీస్ ఆడే ప్రసక్తి లేదని భీష్మ ప్రతిజ్ఞ చేసి, అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. భారత్ ప్రతిపాదించిన విధంగా శ్రీలంకలో సిరీస్ ఆడేందుకు అంగీకరించాడు. ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి, దానిపై ఆమోద ముద్ర కూడా వేయించుకున్నాడు. ఇంత చేసినా, భారత్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ప్రకటనను కూడా రాబట్టుకోలేకపోయాడు. అతని వైఫల్యాలన్నీ దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయని పాక్ అభిమానులు మండిపడుతున్నారు. భారత్‌తో సిరీస్ జరుగుతుందా? లేదా? అన్నది అగమ్యగోచరంగా మారగా, మరో రెండు రోజులు మాత్రమే ఎదురుచూస్తామని ప్రకటించిన పిసిబి, భారత్ నుంచి సిరీస్‌కు అనుకూలంగా ప్రకటన వస్తుందనే ఆశతో గడువును మరో రోజు పెంచింది. కానీ, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. సిరీస్ జనవరి ఐదో తేదీ నాటికి పూర్తికావాల్సిన నేపథ్యంలో, ఈనెల 24వ తేదీ కంటే ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశమే లేదు. టీమిండియా జనవరి ఆరు లేదా ఏడో తేదీన ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరి వెళ్లాలి. అదే విధంగా న్యూజిలాండ్‌లో సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జనవరి ఏడున బయలుదేరుతుంది. ఈలోగా భారత్, పాక్ సిరీస్ జరుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది. కాగా, ఇప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో పిసిబి దిక్కుతోచని స్థితిలో ఉంది. అటు స్వదేశంలో అభిమానులు, ఇటు భారత సర్కారు మధ్య ఇరుక్కొని మల్లగుల్లాలు పడుతున్నది. భారత్ నుంచి ఏ క్షణంలోనైనా ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూడడం మినహా పిసిబి చేయగలిగింది కూడా ఏమీలేదు.

త్వరలో క్లియరెన్స్:షహర్యార్
కరాచీ, డిసెంబర్ 17: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ శ్రీలంకలో జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఉన్నామని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. భారత ప్రభుత్వం నుంచి ఒకటిరెండు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వస్తుందని జోస్యం చెప్పాడు. ఈనెల చివరి వారంలో మ్యాచ్‌లు మొదలవుతాయని తాను ఆశిస్తున్నానని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. సమయాతీతమవుతున్నది కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, బిసిసిఐ ఇప్పటికే భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని అన్నాడు. తన అభిప్రాయం ప్రకారం ఒకటిరెండు రోజుల్లో ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర పడే అవకాశం ఉందన్నాడు. ఒకవేళ సిరీస్‌ను వాయిదావేయాలని బిసిసిఐ కోరితే ఏం చేస్తారన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు. బిసిసిఐ విధించిన షరతులకు అంగీకరించామని, యుఎఇలో కాకుండా శ్రీలంకలో సిరీస్ ఆడేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పాడు. పాకిస్తాన్ సర్కారు నుంచి తమకు ఆమోదం లభించిందని అన్నాడు. ఇప్పుడు బంతి బిసిసిఐ కోర్టులోనే ఉందన్నాడు. సానుకూల స్పందన వస్తుందనే ఆశిస్తున్నామని చెప్పాడు. భారత ప్రభుత్వం సిరీస్‌కు అంగీకరించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందన్నదే తన అభిప్రాయమన్నాడు. ఒకవేళ ప్రతికూల నిర్ణయం వెలువడితే, అప్పుడు భవిష్యత్ నిర్ణయాలపై చర్చిస్తామని అన్నాడు.

ఆశలు రేపిన సుష్మా పర్యటన
కరాచీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల పాకిస్తాన్‌లో జరిపిన పర్యటన పిసిబి అధికారుల్లో ఆశలు రేపింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక సిరీస్‌లు మొదలవుతాయని అభిమానులు కూడా ఆశపడ్డారు. కానీ, పాక్ పర్యటనకు భారత క్రికెటర్లను పంపాలనిగానీ, చివరికి తటస్థ కేంద్రాల్లో సిరీస్‌లకు అనుమతించాలనిగానీ భారత ప్రభుత్వం సిద్ధంగా లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. శ్రీలంకలో సిరీస్‌కు పాక్ సర్కారు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. బిసిసిఐ కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను పంపింది. సుష్మా స్వరాజ్ పాక్‌లో పర్యటించినప్పుడు ఈ విషయంపై ఒక ప్రకటన వెలువడుతుందన్న వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ సర్కారు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో, పాక్‌తో సిరీస్‌కు సిద్ధం లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ పార్టీల నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ పాక్‌తో సిరీస్‌ను వ్యతిరేకిస్తున్నారే తప్ప సానుకూలంగా స్పందించడం లేదన్న విషయం కేంద్రానికి తెలియందికాదు. 2008లో ముంబయిపై ఉగ్రవాదులు పంజా విసిరిన తర్వాత పాక్‌తో సంబంధాలపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో పాక్‌తో సిరీస్‌లకు కేంద్రం అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టమవుతున్నది.