చిత్తూరు

కుండపోత వర్షంతో వణుకుతున్న జిల్లాలోని తూర్పు మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెబర్ 2: గత 20రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లా వణుకుతోంది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు మండలాల్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. సత్యవేడులో దీపా(35) బుధవారం తెల్లవారుజామున 2.30గంటలకు ఎన్ ఎం కండ్రిగ వద్ద పొంగుతున్న వరదలో కొట్టుకుపోయింది. దాదాపు వంద గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. స్వర్ణముఖి, కాళంగి రిజ్వాయర్, అరణియార్, ఉబ్బలమడుగు, సదాశివకోన, కృష్ణాపురం ప్రాజెక్టుల్లో వరదనీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి-వెంకటగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తూర్పు మండల్లాల్లోని సత్యవేడు, కె వి బి పురంలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతంనమోదైంది. వరదయ్యపాల్యెంలో 13 సెం.మీ., పిచ్చాటూరులో 15 సెం.మీ., నగరిలో 10 సెం.మీ., శ్రీకాళహస్తి, రేణిగుంటల్లో 7, పుత్తూరు 6, ఏర్పేడు7.2, తిరుపతిలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అరణియార్ ప్రాజెక్టులో 123.20 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో 7వేల క్యూసెక్కులు నీరు చేరుతుండగా 9వేల క్యూసెక్కుల నీటిని వదిలివేస్తున్నారు. కృష్ణాపురం ప్రాజెక్టులో వెయ్యి క్యూసెక్కుల నీరు చేరుతుండగా 3 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. స్వర్ణముఖి ఆయుకట్టకింద 21,051 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తే కె వి బి పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ ఉద్ధృతంగా ప్రవహిస్తూ 15వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, వచ్చిన నీటిని అలాగే వదిలేస్తున్నారు. సదాశివకోనలో 170 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరదయ్యపాల్యెంలోని ఉబ్బల మడుగులో 5,500 క్యూసెక్కుల నీటిని, కల్యాణి డ్యాంలో 800 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తంబళ్లపల్లిలోని పెద్దేరులో 300 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. చిత్తూరులోని ఎన్‌టి ఆర్ జలాశయంలో 300 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఇక వరదయ్యపాళ్యెంలోని 8గ్రామాలు, పిచ్చాటూరులో 30 గ్రామాలు, సత్యవేడు పరిధిలో రాజగుంట-గన్నవరం మధ్య వాగు పొంగిపొర్లు తుండటంతో 15 గ్రామాలు, ఓబవారి కండ్రిగలో 10 గ్రామాలు, కెవిబి పురం మండలంలో రాజులవారి కండ్రిగలో 15 గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇక శ్రీకాళహస్తి కమ్మకండ్రిగలో వాగు పొంగిపొర్లుతుండటంతో 25 గ్రామాలకుపైగా సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. కాగా జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తూర్పు మండలాలను కలియ తిరుగుతూ బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు. బాధితులను ఆదుకుంటామని ఓదారుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 378 చెరువులు ప్రమాదకర పరిస్థితిని తలపిస్తున్నాయి. ఏ క్షణంలో గండ్లు పడతాయో ఎక్కడ ఆప్రాంతంలో ఉన్న ఇళ్లు కొట్టుకుపోతాయోనని ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని జీవిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులున్న గ్రామాలను పరిశీలిస్తున్న అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు ప్రాంతాల్లో ఉన్న సత్యవేడు,నగరి నియోజక వర్గాలు తమిళనాడుకు సరిహద్దుల్లో ఉండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి చిత్తూరులో తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈక్రమంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారుల్లోను, అటు ప్రజల్లోను తీవ్ర ఆందోళన కనిలిగిస్తోంది. గురువారం వర్షం ఉద్ధృతి పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత 15 రోజుల క్రితం వరకు వర్షం కోసం ఎదురుచూసిన ప్రజలు నేడు వర్షం అంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో పరిస్థితి గురించి సిఎం చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగితెలుసుకుంటన్నారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ గుప్తా సైతం నాగలాపురం వద్ద పొంగిప్రవహిస్తున్న కాజ్‌వేలను పరిశీలించి ప్రజలకు తగు సూచనలు జారీ చేశారు. నీట మునిగిన దళితవాడలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించినప్పుడే
వైద్య విద్యకు సార్థకత
* రోగులు ఆధునిక పరికరాలు చూసిరారు -
వైద్యులపై నమ్మకంతో వస్తారు
* న్యూయార్క్ క్యానె్సర్ సెంటర్ అధ్యక్షుడు నోరి దత్తాత్రేయుడు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 2: వైద్య వృత్తి చేపట్టిన ప్రతి ఒక్కరు ప్రజారోగ్య పరిరక్షణలోను, రోగ నివారణలోను సత్ఫలితాలు సాధించినప్పుడే వైద్య విద్యకు సార్థకత చేకూరుతుందని న్యూయార్స్ హాస్సిటల్స్ పిన్స్ క్యాన్సర్ సెంటర్ అధ్యక్షుడు, రేడియేషన్, ఆంకాలజీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాల 6వ స్నాతకోత్సవం బుధవారం మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈసందర్భంగా 293మంది విద్యార్థులు మంత్రి కామినేని శ్రీనివాసులు చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. రాయలసీమలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈస్నాతకోత్సవానికి స్విమ్స్ యూనివర్శిటీ చాన్సలర్ హోదాలో హాజరు కావాల్సిన సి ఎం చంద్రబాబు నాయుడు హాజరుకాలేకపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈకార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ప్రజల్లో వైద్యుల పట్ల అపారమైన విశ్వాసం ఉంటుందన్నారు. వాటిని కాపాడుకునే విధంగా ప్రతి వైద్యుదు తమ తమ పరిధిలో పొందిన వైద్య విజ్ఞానాన్ని ప్రజలకు అందించి సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు వైద్యరంగంలో అనేక ఆదునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి వైద్యుడు తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 346 మిలియన్ల మంది ప్రజలు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని వీరిలో సంగం మందికి పైగా తమకు సంక్రమించిన ప్రమాదకర వ్యాధి గురించి తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. వ్యాధి ప్రారంభదశలోనే వైద్యులను సంప్రదించగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడటమే కాకుండా ఆర్థికంగా కూడా భారంతగ్గించుకోవచ్చన్నారు. డాక్టర్లు రోగిపట్ల మానవతా దృక్ఫదంతో వ్యవహరించి సేవలు అందించాలన్నారు. ఇక 45 ఏళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీ నుంచి తాను వైద్యపట్టాను పొందానని గుర్తు చేసుకున్నారు. అయితే ఈరోజు అదే తిరుపతి క్షేత్రంలో వైద్య విద్యార్థులకు పట్టాలందించే స్నాత కోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని ఆ తిరుమలేశుడు అందించాడని ఇది తన భాగ్యంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటికే స్విమ్స్ జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందిందన్నారు. గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన డాక్టర్ వెంగమ్మ కృషి ఉందన్నారు. అలాగే ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్‌లు స్విమ్స్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.
రోగుల్లో నమ్మకం పెంచేలా డాక్టర్లు వైద్యం అందించాలి
* మంత్రి కామినేని
తమ వద్దకు వచ్చే రోగుల్లో నమ్మకం పెంచేలా డాక్టర్లు వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం మహతి ఆడిటోరియంలో జరిగిన స్విమ్స్ 6వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి పట్టాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులను ప్రజలు భగవంతుడితో సమానంగా భావిస్తారన్నారు. ఈపరిస్థితుల్లో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు.నేడు వైద్య రంగంలో విలువలు తగ్గుతున్నాయనే భావన పెరుగుతోందని, దానిని తుడిచి పెట్టాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందన్నారు. వైద్యుడు పలకరింపుతీరుతోనే రోగిలో సగం రోగం నయమవుతుందని అన్నారు. ఇక స్విమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో సి ఎం ఉన్నారని అన్నారు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద హృద్రోగ శస్తచ్రికిత్సలు విజయవంతంగా చేయడం జరిగిందని అన్నారు. అదే తరహాలోపేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వ సెక్టార్‌లో విశాఖపట్నం, తిరుపతిల్లో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టి సహకరిస్తోందని చెప్పారు. తిరుపతిని ఒక వైద్య హబ్‌గా మార్చాలన్నది లక్ష్యమన్నారు. ఇక ఐఎంఎంఆర్, ఎంఎంఆర్ శాతం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉందన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ కింద 33 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. వీటిని నూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విమ్స్‌లో ప్రారంభించిన ప్రాణదాన పథకం ఎందరో పేదలకు పునరుజ్జీవనం కల్పించిందని అన్నారు. అందుకే పథకానికి భూరి విరాళాలు అందించడానికి కూడా దాతలు ముందుకు వస్తున్నారన్నారు. నేడు పట్ట్భద్రులైన వారిలో అధికశాతం మహిళలు ఉన్నారని రాబోయేకాలంలో పురుషులకు ప్రత్యేక మెడికల్ కళాశాల ఏర్పాటుచేయాల్సి వస్తుందని మంత్రి అన్నారు. అంతకమునుపు మంత్రి చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు. కాగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ స్విమ్స్‌లో అందిస్తున్న సేవలను, మెడికల్ కళాశాల అభివృద్ధిని వివరించారు. అనంతరం మంత్రి కామినేని స్విమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన ఎన్ టి ఆర్ స్విమ్స్ ఏర్పాటుకు చేసిన కృషిని వివరించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గాలిముద్దు కృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, టిటిడి ఇ ఒ డాక్టర్ సాంబశివరావు, చైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, ఎస్వీయూ విసి దామోధరం, స్విమ్స్ డైరెక్టర్ పి ఆర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా టిటిడి చైర్మన్ చదలవాడ స్విమ్స్ ఆవరణలోని గ్లోబీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మదనపల్లె సబ్‌కలెక్టర్ అమరావతికి బదిలీ
* నూతన సబ్‌కలెక్టర్‌గా క్రిటికాబత్రా
మదనపల్లె, డిసెంబర్ 2 : మదనపల్లె సబ్‌కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునను నూతన రాజధాని అమరావతి సిఆర్‌డిఎ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో తిరుపతి సబ్‌కలెక్టర్‌గా హిమాంశుక్లా, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా క్రిటికాబత్రాలను నియమిస్తూ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 15న సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మల్లికార్జున విధి నిర్వహణలో కిందిస్థాయి అధికారులతో నిక్కర్చిగా పనిచేయించడం, గ్రీవెన్స్‌డేలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ముఖాముఖి నిర్వహించి అర్జీదారుల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించడంలో సఫలమయ్యారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు రాత్రింబవళ్లు చెరువులకు గండి పడకుండా స్వయంగా చెరువులు పరిశీలించడంతోపాటు సంబంధిత అధికారులను అప్రమత్తం చేయించారు. ఎక్కడా చెరువులు గండి పడకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు. కొంతకాలం కుప్పం స్పెషలాఫీసర్‌గా, ప్రస్తుతం హంద్రీ-నీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హర్యానాకు చెందిన క్రిటికబత్రా 2012 ఐఎఎస్ బ్యాచ్‌లో ఎంపికై ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణ పొందుతూ మొదటగా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా రానున్నారు.

పిహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన 500మంది డాక్టర్ల నియామకం
* మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం

తిరుపతి, డిసెంబర్ 2: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 500 మంది డాక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి సిఎం ఆమోదం తెలిపారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు చెప్పారు. బుధవారం స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల్లోని అనాటమీ విభాగం హాల్లో ఆయన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వైద్యశాఖ అందిస్తున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించి, ప్రజల్లో విశ్వాసం పెరిగేలా, జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యసేవల రంగానికి రూ.1300 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 5వ తేదీన విజయవాడలో సుపరిపాలనపై సదస్సు నిర్వహిస్తున్నామని ఈకార్యక్రమానికి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి సదస్సుకు హాజరవుతారని అన్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వైద్య అరోగ్యశాఖ చేపట్టిన వైద్య సేవలపై అధికారులు చక్కగా పనిచేస్తున్నట్లు సి ఎం కూడా అభినందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రతి పిహెచ్‌సికి మందులను నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కామినేని విలేఖరులతో మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం నిర్వహించడం వల్లే నేడు కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని 6వేల చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కల్యాణి డ్యాం నీటితో తిరుపతి,తిరుమలకు మూడేళ్ళ వరకు నీటి సమస్యలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి శివప్రసాద్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి, డిసి ఎస్‌హెచ్ సరళాదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
మురికినీటి కాలువల్లో చెత్త వేయకండి
* నగర ప్రజలకు కమిషనర్ వినయ్‌చంద్ విజ్ఞప్తి
తిరుపతి, డిసెంబర్ 2: నగర ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను, వ్యర్థాలను, బట్టలను మురికి నీటి కాలువల్లో వేయకుండా చెత్తకుండీల్లో వేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వి వినయ్‌చంద్ విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి మురుగునీరు, వరద రావడానికి ప్రధాన కారణం కాలువల్లో పడేస్తున్న చెత్త, వ్యర్థాలు, పాత దుస్తులేనని అన్నారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్న కారణంగానే నీరు రోడ్లపైకి ప్రవహిస్తోందని వివరించారు. ఈపరిస్థితిని నియంత్రించడానికి తాము కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టితోపాటు వినియోగానికి పనికిరాని దుస్తులను కూడా బయటకు తీస్తున్నట్లు చెప్పారు. కాగా బుధవారం కమిషనర్ శివజ్యోతినగర్, తంబువాని గుంట స్కూల్ పక్కనే ప్రవహించే పెద్ద కాలువను, ఎయిర్ బైపాస్ రోడ్డు, నవోదయ కాలనీ, అశోక్‌నగర్, రైల్వే కాలనీ, అబ్బన్న కాలనీ, లక్ష్మీపురం, శంకరంబాడి సర్కిల్, యశోద నగర్, తిరుమల రెడ్డినగర్, మధురానగర్, కరకంబాడి రోడ్డుల్లో పర్యటించారు. రోడ్లుపైన వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న మట్టిని, చెత్తను తొలగించడానికి, కాలువల్లో ఉన్న మట్టిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. గతంలో కురిసిన వర్షాలకు వరదనీరు కాలనీల్లోకి ప్రవేశించకుండా ప్రత్యేక అధికారి ఎస్ రమేష్ బుధవారం తెల్లవారు జామున 4గంటల నుంచి వరదనీటి కాలువలను పర్యవేక్షిస్తూ ఎక్కడా నీటి ప్రవాహానికి అడ్డులేకుండా సిబ్బందిచే శుభ్రం చేయిస్తున్నారు. అలాగే ఉప కమిషనర్ కె భాగ్యలక్ష్మి వార్డుల్లోని వితంతు, వికలాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేషన్‌కు చెందిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొంటున్నారు. దీంతో గత రెండు రోజులుగా తిరుపతిలో వర్షం పడుతున్నా ఎక్కడా రోడ్లపైకి ప్రవహించకపోవడం గమనార్హం.
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
సోమల, డిసెంబర్ 2 : మండలంలోని పెద్దఉప్పరపల్లెకు మూడు కిలోమీటర్ల దూరంలోని అడవిలో గుర్తుతెలియని వ్యక్తిని అతి దారుణంగా గొంతుకోసం హత్య చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దఉప్పరపల్లె, చౌడేపల్లె రోడ్డుమార్గంలోని చింతమాకులగుట్ట నుంచి కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతంలో బుధవారం గొర్రెల కాపరులు మృతదేహాన్ని గుర్తించి సోమల పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తెల్లచొక్కా, తెల్లపంచె, తెల్లని బనియన్, బ్లూకలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. మృతుడి ఎడమచేతికి బొటన వేలు లేదు. హతుడి వయస్సు 50 సంవత్సరాలపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ పరసర ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. మృతదేహాన్ని చూసేందుకు పరసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చినప్పటికీ గుర్తించలేకపోయారు. పెద్దఉప్పరపల్లె మారమూల ప్రాంతమైన అటవీ ప్రాంతాల్లో యదేచ్ఛగా పేకాట రాయుళ్లు సంచరిస్తుంటారని, చదం, కలికిరి, చౌడేపల్లె, సోమల ప్రాంతాల నుంచి చింతమాకులగుట్టకు జూదం కోసం వచ్చి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరకట్నం వేధింపుల కేసులో
భర్తకు నాలుగేళ్ల జైలు
పుంగనూరు రూరల్, డిసెంబర్ 2 : అదనపు కట్నం కోసం భార్యను హింసించిన కేసులో భర్తకు పుంగనూరు కోర్టు జడ్జి బుధవారం నాలుగేళ్ల 9 నెలల జైలు శిక్ష, 70 రూపాయలు జరిమానా విధించి తీర్పు ఇచ్చారు. క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి మోతిలాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని మోదుగులపల్లెకు చెందిన పార్వతమ్మను రామసముద్రం మండలం ఎద్దులపల్లెకు చెందిన డి శంకరకు గత 15 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. గత కొంతకాలంగా భార్యను అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టడంతో ఆమె ఈ ఏడాది జూన్ 1వ తేదీన పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిప్రసాద్ బాధితురాలి కథనం మేరకు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేసి కోర్టులో నివేదించారు. కేసును పరిశీలించిన జడ్జి నిందితుడైన భర్త వరకట్నం కోసం వేధించడం వాస్తవమని తేలడంతో తుది తీర్పునిచ్చారు. నిందితుడికి నాలుగేళ్ల 9 నెలల జైలు శిక్ష, 70 రూపాయలు జరిమానా విదించారు. కేసును ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేసి తుదితీర్పునివ్వడం విశేషం.
భారీ వర్షాలకు నీటిలో మునిగిన పొలాలు
* తొట్టంబేడులో 3 పునరావాస కేంద్రాలు
శ్రీ కాళహస్తి, డిసెంబర్ 2: అల్పపీడన ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగి పారుతున్నాయి. స్వర్ణముఖి నదికి కూడా ఉద్ధృతి పెరిగింది. చెరువుకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు కొన్ని చోట్ల కట్టలను తెగ్గొట్టి అదనంగా వస్తున్న నీటిని వదిలేస్తున్నారు. మరికొన్నిచోట్ల కలుజుల ఎత్తును తగ్గించారు. ఇంకొన్ని చోట్ల తూముల నుంచి నీటిని కాలువలకు తరలిస్తున్నారు. అయినా పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. గత వారం కురిసిన వర్షాలకు శ్రీ కాళహస్తి ప్రాంతంలో 686 హెక్టార్లల్లో వరి పంట మునిగింది. 145 హెక్టార్లల్లో వేసిన నాట్లుకూడా మునిగాయి. 372 హెక్టార్లలో మినుముపంట, 51 హెక్టార్లలో వేరుసెనగ పంట మునిగిపోయింది. తిరిగి కురుస్తున్న వర్షాలకు మళ్లీ పంటలు మునకలో ఉన్నాయి. దీంతో పాటు శ్రీకాళహస్తి మండలంలోని దొమ్మరపాళెం, బుడమల పాడు, జాలవేడు, ఓబులాయిపల్లి ప్రాంతాల్లో కాలువలు పొంగి పారుతున్నాయి. దీని వల్ల ఆయా గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు. అదేవిధంగా తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు వద్ద ఏరు పొంగుతూ ఉండడంతో తొట్టంబేడు, కెవిబిపురం మండలాలకు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. బోనుపల్లి కూడా వరద నీటిలో చిక్కుకుంది. రెండు రోజుల పాటు వర్షాలు లేకుంటే నీళ్లు తగ్గుముఖం పడతాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. తొట్టంబేడు మండలంలోని చిన్నకన్నలి, పెద్దకన్నలి, బసవన్న గుట్ట గ్రామాల్లో రెవెన్యూ అధికారులు 100 కుటుంబాలకు చెందిన 400 మందికి పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. శ్రీ కాళహస్తి మండలం చుక్కల నిడిగళ్లు ఎస్టీ కాలనీకి తహశీల్దార్ చంద్రమోహన్ దుప్పట్లు పంపిణీ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను ఆదుకుంటామని తెలిపారు. తొట్టంబేడు మండలంలో గుండ్ల మడుగువాగు దాటుతూ సోమవారం రామయ్య (70) అనే వృద్డుదు గల్లంతయ్యాడు. ఆయన కోసం గ్రామస్థులు వెతుకుతున్నారు. గ్రామస్థులకు సహకారంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా గాలింపుచేపడుతున్నాయి.
గ్రామాల్లో రాకపోకలు స్తంభించడంతో పాటు జనజీవనం కూడా అస్తవ్యస్థంగా తయారైంది. శ్రీ కాళహస్తికి లేదా తిరుపతికి వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. గాలులు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. తిరపతి ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండడంతో స్వర్ణముఖి నదికి నీటి ప్రవాహం పెరిగింది. సోమవారం కన్నా బుధవారం నాటికి 3 అడుగుల ఎత్తు వరద ఉద్ధృతి పారుతోంది. మల్లిమడుగు, కళ్యాణిడ్యాం రిజర్వాయర్‌ల నుంచి కూడా మిగులు నీళ్లు నదిలో పారుతున్నాయి.

కళ్యాణి డ్యాం గేటు ఎత్తివేత
చంద్రగిరి, డిసెంబర్ 2: కళ్యాణి డ్యాం గేటు తెరిచి సెకనుకు 600 క్యూసెక్‌ల బయటకు వదులుతున్నామని చంద్రగిరి ఎఇ మురళీమోహన్ తెలిపారు. చంద్రగిరి ఇరిగేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డ్యాం పైభాగం నుంచి వర్షపునీరు ఉద్ధృతంగా డ్యాంలోకి వస్తున్నందున ఒక గేటు తెరిచినీరు ప్రతిరోజూ బయటకు వదులుతున్నామని తెలిపారు.