చిత్తూరు

నేడు పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహిస్తున్న కార్తీక బ్రహ్మోత్సవంలో చివరిరోజైన ఆదివారం పంచమీతీర్థ ముఖ్య ఘట్టం జరుగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తన ప్రియసఖి అయిన అమ్మవారికి స్వామివారు సారెను పంపనున్నారు. ఈ సారెను తిరుమల నుంచి జె ఇ ఓ శ్రీనివాసరాజు తిరుచానూరుకు తీసుకొచ్చి జె ఇ ఓ పోలాభాస్కర్‌కు అప్పగిస్తారు. ఇందులో భాగంగా సారెకు సంబంధించిన పసుపు, కుంకుమ, ప్రసాదాలు, వస్త్రాలు, తులసి, ఆభరణాలను ఆదివారం ఉదయం 4 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా ప్రారంభమవుతుంది. ఈ సారెను గజ రాజులపై గంపలో ఉంచి అర్చక స్వాములు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుగా కాలినడకన తిరుమల నుంచి తిరుపతి అలిపిరి వద్దకు తీసుకొస్తారు. అక్కడనుంచి కోమలమ్మ సత్రం ( ఆర్ ఎస్ గార్డెన్) చేరుకుంటారు. అనంతరం తిరుపతి పుర మాడ వీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుతుంది. అక్కడ ప్రత్యేక పూజలునిర్వహించినఅనంతరం అర్చక స్వాములు అధికార గణంతో కలిసి మంగళవాయిద్యాల మధ్య గజ, తురగ, అశ్వ దళాలు ముందు కదులుతుండగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్ద ఉన్న పద్మావతి సరోవరం వద్దకు చేరుస్తారు. ఉదయం 11 గంటలకు పుష్కరిణిలోని పంచమీ తీర్థ మండలంలో స్నపన తిరుమంజనం మొదలవుతుంది.
నేడు పంచమీ తీర్థం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమీ తీర్థం. శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమీతీర్థంగా వ్యవహరిస్తారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఈ తీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పంచమీతీర్థం, పద్మపుష్కరిణి వైశిష్ట్యాన్ని ఆలయ అర్చకుడు అర్చకం వకుళాభరణం శ్రీనివాస మణికంఠ బట్టర్ తెలియజేస్తూ శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పద్మ పురాణం ఒకటన్నారు. ఇందులో పద్మావతి అవిర్భావాన్ని వివరించారన్నారు. వైకుంఠంలో శ్రీ వేంకటేశ్వరస్వామి శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తరుషులు అర్హులైన మహా దేవుడ్ని వెతుకుతూ వైకుంఠం చేరుతారన్నారు. ఈక్రమంలో స్వామివారు యోగ నిద్రలో ఉండి బృగుమహర్షి రాకను గమనించలేదన్నారు. దీంతో కోపోద్రేకుడైన బృగుమహర్షి తపోసంపన్నుడైన తన ఆగమనాన్ని గుర్తించకుండా మహావిష్ణువు నిర్లక్ష్యం వహించాడంటూ ఆగ్రహంతో ఊగిపోతూ స్వామివారి వక్ష స్థలంపై కాలితోతన్నారన్నారు. దీంతో స్వామివారు లేచి బృగుమహర్షికి సకల సపర్యలు చేసి శాంతిపచేస్తాడన్నారు. తన నివాస స్థలమైన స్వామివారి వక్షస్థలంపై బృగుమహర్షి పాదంతో తన్నినా స్వామి వారు క్షమించడాన్ని పద్మావతి అమ్మవారు జీర్ణించుకోలేకపోయారన్నారు. దీంతో ఆగ్రహించి వైకుంఠం వదలి పాతాల లోకానికి వెళ్లిపోయారన్నారు. స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటే పాతాల లోకానికి వచ్చారని, ఆమె ఆచూకీ కోసం భూమాత సహకారాన్ని తీసుకొని 56 దేశాలు తిరిగారన్నారు. ఈ క్రమంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన కోల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా స్వామివారు సందర్శించారన్నారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీర వాణి ప్రత్యక్షమై స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారని తెలిపింది. దీంతోస్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకొని ‘కుంతలము’ అనే ఆయుధంతో పుష్కరిణి తవ్వి వాయుదేవుడ్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్ణలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారన్నారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైకానస ఆగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్టించారన్నారు. అలా స్వామివారు పుష్కర కాలం పాటు పాలు మాత్రమే ఆహారంగా తీసుకొని శ్రీ మంత్రం జప, తప అర్చన చేశారన్నారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం ఉత్తరాషాడ నక్షత్రంలో శుక్రవారం పంచమీతిథి నాడు అమ్మవారు సహస్రదళ బంగారు పద్మంనుంచి 4 చేతులతో పద్మాల వంటి కళ్లతో సకల దివ్య ఆభరణాలు, వస్త్ర పుష్పాలంకురాలై ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు.
పంచమీతీర్థం ఉత్సవం క్రమం
చూర్ణ్భాషేకం
పంచమీతీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణ్భాషేకం నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారి పుట్టిన రోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వులనూనె, చూర్ణపొడి కలిపి ఈక్రతువు నిర్వహిస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.
పంచమీతీర్థ మండపంలో
పంచమీతీర్థ మండపంలో వేధికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌ను ఆశీనులను చేస్తారు. 9 కళాశాలల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఉపచారాలు సమర్పిస్తారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు, కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.
తిరుపతిలో ఇఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
తిరుపతి, డిసెంబర్ 3: స్థానిక వరదరాజనగర్‌లో శనివారం ఇఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంతీయ కార్యాలయాన్ని ఇఎస్‌ఐ ఫైనాన్స్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో జరిగిన బోర్డు మీటింగ్‌లో చర్చ జరుగుతున్న సందర్భంగా రీజనల్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఆ సమయంలోతాను తిరుపతిలోనే రీజనల్ కార్యాలయం పెట్టాలని ప్రతిపాదించడంతో అందుకు బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. తన ప్రతిపాధన కార్యరూపం దాల్చడమే కాకుండా ఈ కార్యాలయాన్ని తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇందువల్ల కార్మికులు ఇకపై హైదరాబాదుకు క్లైంలకోసం వెళ్ళాల్సిన పనిలేకుండా పోయిందని, ఇక్కడే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో డిస్పెన్సిరీలు ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం సుగమమైందని చెప్పారు. ఈ సందర్భంగా ఇ ఎస్ ఐ హెచ్‌డిసి సభ్యురాలు అంబూరి సింధూజ, టి ఎన్ టి యు సి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిఖార్జున, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్, బి ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమణలు ఆయనకు స్వాగతం పలికారు. అలాగే తిరుపతిలోని వందపడకల ఇ ఎస్ ఐ ఆస్పత్రి నిర్మాణం నత్త నడకన సాగుతోందని తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ ఆస్పత్రిని ఆగస్ట్ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదన్నారు. వెంటనే ఆస్పత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఇ ఎస్ ఐ రీజనల్ డైరెక్టర్ దాసు, ఎస్ ఆర్వో రవికుమార్, సూపరింటెండెంట్ అబ్దుల్ మజీద్, లోకల్ మేనేజర్ ఫణికుమార్‌లు పాల్గొన్నారు.
అల్ప పీడనంగా మారిన తుఫాన్

* జిల్లా అంతటా వర్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, డిసెంబర్ 3: నాడా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గత రెండురోజులుగా ఈ తుఫాన్‌తో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. తూర్పు మండలాల్లో కొంత వరకు వర్షాలు కురవగా పడమటి మండలాల్లో అతి స్వల్పంగా నమోదైంది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే క్రమేణా ఈ తుఫాన్ అల్పపీడనంగా మారడంతో జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అయినప్పటికీ తూర్పు మండలాల్లో అధికార యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. గత రెండురోజులుగా తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సరాసరి 19.3 మి.మీ వర్షపాతం నమోదైంది. గత రెండురోజులుగా శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, సత్యవేడు, కెవిబిపురం, బిఎన్ కండిగ, నాగలాపురం, వరదయ్యపాళ్యం, పుత్తూరు, నగరి, వడమాలపేట, నిండ్ర, విజయపురం, గంగాధరనెల్లూరు, తిరుపతి, రేణిగుంట, పాలసముద్రం, గంగవరం, చిత్తూరు, కార్వేటినగరం తదితర మండలాల్లో 40 మి.మీ పైగా వర్షం కురిసింది.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
* దివ్యాంగులకు కలెక్టర్ సిద్దార్థజైన్ సూచన
చిత్తూరు, డిసెంబర్ 3 : ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ సూచించారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జిల్లా వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ సుబ్రహ్మణ్యం, కలెక్టర్, జెసి-1 గిరీషా జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని పథకాల్లో మూడు శాతం రిజర్వేషన్ తప్పక అమలు చేస్తున్నామని, అయితే ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దివ్యాంగులు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. అధికారులు కూడా దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, న్యాయశాఖ అధికారులు వారానికి కనీసం గంట పాటు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని కోరారు. ఇకపై ప్రతి నెలా ఒక రోజు దివ్యాంగుల కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల దినాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి దివ్యాంగుడిలో అపార శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ బిడ్డలను దైవ స్వరూపులుగా భావించి పెంచాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దివ్యాంగులు కూడా తమ వైకల్యం గురించి తరచూ ఆలోచించకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌లోని అన్ని బ్లాక్‌లలో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులు పట్టుదల, కృషితో ఉన్నత స్థాయికి ఎదిగారని, అలాంటి వారిని మిగిలిన వారు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం మేయర్ సుబ్రహ్మణ్యం, జెసి-1 గిరీషా మాట్లాడారు. చివరిగా దివ్యాంగుల కోసం ఇటీవల నిర్వహించిన పలు క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్న పలు దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులను దుశ్సాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి లక్ష్మి, డిఆర్‌డిఏ పిడి రవిప్రకాష్‌రెడ్డి, జిల్లా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడి శ్రీనివాస్‌తో పాటు పెద్దఎత్తున దివ్యాంగ విద్యార్థులు, పలు గ్రామాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు.
మా ‘బంగారు’ భవిష్యత్తు ఏమవుతుంది
* వర్షంలో తడుస్తూ వైకాపా ఆధ్వర్యంలో మహిళల ధర్నా
* బాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు : భూమన
తిరుపతి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తమ ‘బంగారం’ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయాందోళనలలో ఉన్న మహిళలు శనివారం రోడ్డెక్కారు. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తాతయ్యగుంట గంగమ్మ గుడివద్ద బంగారు ఆభరణాల పరిమితిపై జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో రోడ్డుపై బైటాయించారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా మహిళలు చెక్కు చెదరని నిబ్బరంతోఅక్కడే బైటాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మహిళలతోపాటు కరుణాకర్ రెడ్డి సైతం వర్షంలోనే బైటాయించి నిరసన తెలిపారు. నల్లకుభేరుల వద్ద ఉన్న బంగారాన్ని వదిలేసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ మెడల్లోని అభరణాలను దోచుకోవడానికి చూస్తోందని ఈ సందర్భంగా మహిళలు నిప్పులు చెరిగారు. ఇక తమకు మిగిలేది ఇక పసుపుకొమ్మువున్న పసుపుదారాలే అంటూ మెడలోవున్న మెడలోవున్న పసుపుదారాలను ప్రదర్శించారు.ఈసందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సామాన్యులు, మహిళలు తీవ్ర ఇబ్బందులతోపాటు తీవ్ర భయాందోలనలకు గురవుతున్నారని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో పేద వాడి బ్రతుకు రోడ్డున పడితే, తాజాగా బంగారంపై సైతం పరిమితి విధిస్తూ, పన్నులు కట్టాల్సిందేనన్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయంతో మహిళలు మనస్సులు భగ్గుమన్నాయని చెప్పారు. భారత దేశంలో ఉన్న ప్రజలు తాతముత్తాల దగ్గర నుంచి సంక్రమించే ఆస్తుల్లో బంగారు ఆభరణాలు ఒకటని అన్నారు. వాటికి లెక్కలు ఎలా చూపించాలి, ఎలా నిరూపించుకోవాలని నేడు మహిళల్లో వ్యక్తమవుతున్న ఆవేధన, ఆందోళన అన్నారు. అయితే వారి ఆందోళనకు సంబంధించి కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం సరికాదని అన్నారు. అయితే దీనిపై సి ఎం చంద్రబాబు నాయుడు మహిళల వద్ద బంగారానికి తాను గ్యారంటీ అంటూ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారంతో విడదీయలేని సంబంధం ఉన్న మహిళల జీవితాలతో చెలగాటం ఆడటం కేంద్రానికి మంచిదికాదని తెలిపారు. ఇప్పటికే ఆగ్రహంతోవున్న మహిళలు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనలతో సంతృప్తి చెందే అవకాశం లేదని, ప్రధాని మోదీ దీనిపై స్పష్టమైన ప్రకటనచేయాలని కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా కాపాడతారని ఓటేస్తే బంగారంపై కాటేస్తారా, నిన్నటి బంగారం నేడు అంగారం(అగ్గి), విజయ్‌మాల్యావంటి నల్ల కురులను వదిలేసి మహిళల గొంతు నులిపేస్తారా, గృహిణి కన్నీరు మీకు పన్నీరా?, అంటూ ప్లకార్ధులతోపాటు లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాలను మహిళలు ప్రదర్శించారు.ఈకార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ కె బాబు, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర, మహిళవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత, నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి, నాయకులు కేతం రామారావు, కట్టగోపియాదవ్, గీత, కృష్ణవేణమ్మ, పుష్పచౌదరి, ప్రమీల, రాజేశ్వరి, కవిత తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు 10 లక్షలు విరాళం
తిరుపతి, డిసెంబర్ 3: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు వైజాగ్‌కు చెందిన సంఘవరపు వెంకటశివకృష్ణ కుటుంబ సభ్యులు రూ.10 లక్షలను శనివారం విరాళంగా ఇచ్చారు. డిడి రూపంలో ఉన్న ఈ మొత్తాన్ని తిరుపతి మాధవం గెస్ట్‌హౌస్‌లో ఉన్న టిటిడి చైర్మన్ చాంబర్‌లో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
ఏర్పేడు, డిసెంబర్ 3: పంట పొలాల్లో ఉన్న తాగునీటి బోర్లు,వైర్లను వర్షం ప్రభావం వల్ల ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని బండారు పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బత్తిరెడ్డి (49) గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల పక్కన స్వర్ణముఖి నదిలో ఉన్న మోటర్ స్టాటర్‌ను వర్షం పడుతోందని వైర్లు తొలగించ బోయి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బత్తిరెడ్డికి వివాహమై ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక ఎకరా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యుదాఘాతానికి గురైన మృతుడి సంఘటనా స్థలానికి ఎస్ ఐ రామకృష్ణ, తహశీల్దార్ వెంకట్రాయులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీ కాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇస్కా ఏర్పాట్లు పక్కాగా చేయండి
* సిఎం త్వరలోనే పరిశీలిస్తారు
* అధికారులకు ప్రొటోకాల్ అడిషినల్ సెక్రటరీ అశోక్‌బాబు ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 3: ఎస్వీ యూనివర్శిటీలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధాని మోదీ, నోబల్ గ్రహీతలు, విదేశీ, స్వదేశీ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో నిర్వహించాలని ప్రోటోకాల్ అడిషినల్ సెక్రటరీ ఎం.అశోక్‌బాబు స్పష్టం చేశారు. శనివారం ఎస్వీ యూనివర్శిటీ విసి చాంబర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయనతోపాటుగా సమాచారశాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్కా ఏర్పాట్లపై విసి దామోదరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇస్కా ఏర్పాట్లు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ సభాప్రాంగణం పి ఎం ఓ కార్యాలయ అనుమతి మేరకు నిర్మించాలన్నారు. హాజరయ్యే ప్రముఖులకు పాసులు జారీ వంటివి ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలన్నారు. సభా ప్రాంగణం 15వేల మంది పాల్గొనేలా ఉండాలన్నారు. ఫుడ్‌కోర్టుల నిర్మాణంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. రవాణ, బస ఏర్పాట్లు, రోడ్ మ్యాప్‌లు బుక్‌లెట్ రూపంలో ప్రముఖులు రాగానే వారికి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీ తరువాత తిరుపతిలో పర్యటిస్తారని ఆలోగా వివిధ కమీటల సభ్యులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం వారు యూనివర్శిటీ సెనెట్ హాల్, అడిటోరియం, లైబ్రరీలో జరుగుతున్న పనులను అలాగే ప్రముఖులు బసచేస్తున్న ప్రైవేట్ హోటళ్లను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఇస్కా ఆర్గనైజింగ్ సెక్రటరీలు విజయ్‌భాస్కర్, శ్రీనాథ్, జెసి-2 వెంకటసుబ్బారెడ్డి, జడ్పీ సి ఇ ఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ భారత దేశ చార్టెడ్ అకౌంటెంట్లకు
ఆర్థిక నూతన చట్టాలపై ప్రత్యేక శిక్షణ
* ఎస్‌ఐఆర్‌సి చైర్మన్ ఫల్గుణకుమార్ వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 3: కేంద్రప్రభుత్వం ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక చట్టాలపై చార్టెడ్ అకౌంటెంట్లకు అవగాహన కల్పించేందుకు తిరుపతిలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా ఎస్ ఐ ఆర్ సి చైర్మన్ ఇ ఫల్గుణకుమార్ చెప్పారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలో దాదాపు6 ఆర్థికపరమైన చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. దీనిపై చార్టెటెడ్ అకౌంటెంట్లకు సరైన అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో దేశం నలుమూలల నుంచి మేధావులైన వారిని పిలిపించడం జరుగుతోందన్నారు. స్థానిక ఎస్వీ వెటర్నీ యూనివర్శిటీ క్రీడామైదానంలో నిర్వహించే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు దక్షిణభారత దేశం నుంచి 2500 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వీరేకాక మరో 1000 మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడాపాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్థుతం నోట్ల రద్దుతో ఏర్పడ్డ పరిణామాలు, నల్లకుబేరులకు సంబందించిన అనేక అంశాలు ఈసమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఇక బంగారం ఆభరణాలకు సంబంధించిన అంశం నేడు కొత్తగా ఏర్పాటు చేసిన చట్టంకాదని అన్నారు. ఇందుకు సంబంధించి ఆదాపుపన్నుశాఖ దశాబ్దాల క్రితమే ఇలాంటి చట్టాలను అమలు చేస్తోందని అన్నారు. తాజాగా నల్లకుభేరుల వద్ద ఉన్న అక్రమ బంగారాన్ని వెలికి తీయడానికే కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించదన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈకార్యక్రమంలోతిరుపతిశాఖ ఛైర్మన్ కె.రఘురామిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

శరణుఘోషతో మార్మోగిన అయ్యప్పస్వామి దేవాలయం

మదనపల్లె, డిసెంబర్ 3: మదనపల్లె పట్టణ శివారు ప్రాంతం మడికయ్యల శివాలయం సమీపంలోని అయ్యప్పనగర్‌లోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో దాతలు, శ్రీ యోగభోగేశ్వరస్వామి ఆలయ ఇఓ రాజగోపాల్‌రెడ్డిల సహకారంతో శనివారం రాత్రి పద్దెనెమిది మెట్ల పడిపూజ కన్నుల పండువగా నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్పస్వామి దేవస్థానం ప్రధానతంత్రీ ఈశ్వర్‌నంబూత్రి, శిష్యబృందం, ఆలయ ప్రధాన గురుస్వామి రమణదీక్షితులు పడిపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల నుంచి వేలాదిగా అయ్యప్పస్వామి పడిపూజకు హాజరయ్యారు. అష్టాదశ సోపానాలైన 18 మెట్లకు ప్రత్యేక పుష్పాలంకరణ, దీపాలంకరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన పడిపూజను రాత్రి 9.30 గంటలకు ముగించారు. అనంతరం అయ్యప్పస్వామి వారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ప్రతిఏటా మదనపల్లె పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జరిగే పడిపూజలు కేరళ శబరిమలై ప్రధాన అర్చకులచే నిర్వహించడం ఆనవాయితీ. అధికసంఖ్యలో వచ్చిన భక్తులకు ఆలయ సేవకులు, భక్తులు తీర్ధప్రసాదాలు అందించి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
అయ్యప్పసేవలో ఎమ్మెల్యే
మదనపల్లె పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శనివారం రాత్రి జరిగిన అయ్యప్ప పడిపూజకు ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ బి నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, వైస్‌చైర్మన్ భవానిప్రసాద్, ఎంపిపి సుజన, జడ్పీటిసి భాస్కర్, సర్పంచ్ శరత్‌కుమార్‌రెడ్డి, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బాలగంగాధర్‌రెడ్డి హాజరయ్యారు. శనివారం రాత్రి జరిగిన అయ్యప్ప పడిపూజకు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి హాజరై హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అయ్యప్పస్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కేరళ శబరిమలై ప్రధాన అర్చకులు ఈశ్వర్‌నంబూత్రి తంత్రీ దీక్షితులను మర్యాదపూర్యకంగా కలుసుకున్నారు. స్వామివారి పడిపూజ వైభవంగా నిర్వహించడంతో పడి పూజలను అడ్డుకునేందుకు యత్నించిన ఓ వర్గానికి చుక్కెదురైంది.