చిత్తూరు

ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం కక్ష సాధింపు చర్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 9 : కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జరిగిన ధర్నాలో జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీజిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మేల్యే నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ దేశంలోనే తొలిసారిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. అయితే నేడు చంద్రబాబు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్య శ్రీని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి డిక్టేటర్‌లా వ్యవహరిస్తూ వైఎస్ పథకాలను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి నిధులను తగ్గిస్తుండటం ఇందుకు నిదర్శనమన్నారు. తోటి తెలుగు రాష్టమ్రైన తెలంగాణా ప్రభుత్వం తమ బడ్జెట్‌లో రు 1000 కోట్లు మంజూరు చేస్తే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేవలం రు కేవలం రు 420 కోట్లును మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామాల్లో 108 వాహనాల కుయ్ కుయ్ శబ్దానికి బదులుగా సరైన నిర్వహణ లేక కుయ్యో మొర్రో అంటూ అరుస్తున్నాయని ఆరోపించారు. దాదాపు తొమ్మిదేళ్లు వినియోగించిన వాహనాల స్థానంలో సరికొత్త వాటిని కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పలు ఎన్నికల్లో ఓటమి చెందిన తమపార్టీ అభ్యర్థులను జన్మభూమి కమిటీలో సభ్యత్వం ఇచ్చి దందాలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుకు కావాల్సిన రు 910కోట్లు నిధులు విడుదల చేయకుండా, అమరావతిలో తమపార్టీ వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని సమాధి చేసేందుకు చంద్రబాబునాయుడు ఆరోగ్యశ్రీకి చెదలులా పట్టుకున్నాడని విమర్శించారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలతోనే చంద్రబాబు పతనం ప్రారంభం అవుతుందని, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లకు గాను 40 డివిజన్లు వైకాపా గెలవడం ఖాయమన్నారు. చంద్రబాబునాయుడు ముత్తాతలు దిగివచ్చినా తమనేత వైఎస్సార్ పేరును ప్రజల గుండెల నుంచి చెరపలేరని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ముఖ్యమంత్రి అనుచరులకు చెందిన మెడాల్ సంస్థ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ భారీ ఎత్తున దోపిడికి పాల్పడుతున్నారని చెప్పారు. మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పథకం ప్రకారం ప్రైవేటు పరంచేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో 108 వాహన కుయ్‌కుయ్ శబ్దానికి బదులుగా మరణఘోష వినిపిస్తోందన్నారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ వైద్యశాలను అభివృద్ధి చెందనీయకుండా టిడిపి ప్రభుత్వం ప్రైవేటు వైద్యశాలలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్సార్ పేరును చెరిపేందుకే చంద్రబాబునాయుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ తిరుపతి నగరం ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పేద, బడుగు, బలహీన వర్గాల వారి సంజీవినిలా ఉన్న 108 వాహనాల చప్పుడుకు బదులు టిడిపికి వ్యితిరేకంగా మాట్లాడే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసు వాహనాలు వస్తున్నాయని విమర్శించారు. అనంతరం చంద్రగిరి ఎమ్మేల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి పార్టీ ఇన్‌చార్జ్ ఆదిమూలం తదితరులు ప్రసంగించారు. ఈ క్రమంలోనే వైకాపా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు ఆరోగ్యశ్రీ పథకం తీరుతెన్నులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ జెసి - 1 గిరీషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ చిత్తూరు, తంబళ్లపల్లి, కుప్పం నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు జంగాలపల్లి శ్రీనివాసులు, ద్వారకానాథరెడ్డి, చంద్రవౌళి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెమ్మ, మాజీ ఎమ్మెల్యే గాంధీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, జిల్లా మహిళ నాయకురాలు గాయత్రి, చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్, స్థానిక నాయకులు నారాయణ, సయ్యద్‌తో పాటు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

7వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రత
* ఇస్కా ఏర్పాట్లు పర్యవేక్షించిన డిజిపి

తిరుపతి, డిసెంబర్ 9: ఇస్కా సభ నిర్వహణకు ప్రత్యేక శిక్షణ పొందిన ఏడువేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు డిజిపి సాంబశివరావు తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన ఎస్వీ యూనివర్శిటీలో జనవరి 3వ తేదీ నుంచి జరగనున్న ఇస్కా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. శుక్రవారం తిరుపతి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్వీయూ తారకరామా స్టేడియం, ఎస్వీ యూనివర్శిటీ, మహిళ యూనివర్శిటీ, ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను డిజిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కా సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం 7వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఇస్కా సదస్సు బందోబస్తుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రల ఐజి హరీష్‌కుమార్ గుప్తా, రాయలసీమ రేంజ్ ఐజి శ్రీ్ధర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, మహిళ యూనివర్శిటీ విసి దుర్గ్భావానీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
*ఐదుగురికి గాయాలు: ఇద్దరి పరిస్థితి విషమం
మదనపల్లె, డిసెంబర్ 9: ప్యాసింజర్లును తరలిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగావారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కథనం మేరకు మదనపల్లె పట్టణం బాలాజికాలనీకి చెందిన విష్ణునాయక్ (27) ప్యాసింజర్ ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాల్మీకిపురం తోటవీధికి చెందిన కాలేషా(18), దంపతులు కరుణాకర్(23), అరుణ(21), అరుణ అమ్మరెడ్డెమ్మ(45), రామ్‌నగర్‌కు చెందిన గాజుల వ్యాపారం చేసుకుని జీవనం సాగించే అంజనమ్మ (30), వెంకటలక్ష్ము (38)లు మదనపల్లె నుంచి ప్యాసింజర్ ఆటోలో వాల్మీకిపురానికి బయలుదేరారు. మదనపల్లె డిపోకు చెందిన తిరుపతి నాన్‌స్ట్ఫా సర్వీస్ తిరుపతి నుంచి మదనపల్లెకు వస్తుండగా మార్గమధ్యలోని సిటిఎం శ్రీదేవి ఎస్టేట్స్‌వద్ద ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ విష్ణునాయక్, కాలేష, అంజనమ్మ కుప్పకూలిపోయారు. కాలేష, అంజనమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన విష్ణునాయక్, కరుణాకర్, అరుణ, రెడ్డెమ్మ, వెంకటలక్ష్ములను స్థానికులు ప్రైవేట్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఆటోడ్రైవర్ విష్ణునాయక్, అరుణ పరిస్థితి విషమం కావడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. మిగతా ముగ్గురు మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. దీంతో వాల్మీకిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దులపై గట్టి నిఘా
* డిఐజి ప్రభాకర్‌రావు వెల్లడి
వి.కోట, డిసెంబర్ 9: అనంతపురం రేంజ్ పరిధిలోని అంతర్ రాష్ట్ర సరిహద్దులపై ఘట్టి నిఘా చర్యలకు కృషి చేస్తున్నామని డిఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆయన శుక్రవారం వికోట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పురప్రముఖుల సహకారంతో మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును చూసి అన్ని మండలాల్లో ఇదే స్పూర్తితో దాతలు ముందుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు తగు సూచనలు, సలహాలు అందించారు. కేసుల వివరాలు, ఫిర్యాదులను తప్పని సరిగా కంప్యూటర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు బాధ్యతతో పనిచేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఈకార్యక్రమంలో చిత్తూరు అదనపుఎస్పీ అభిషేక్ మహంతి, డిఎస్పీ శంకర్, సిఐ రాజశేఖర్, ఎస్సై రాజశేఖర్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.
15లోగా 50వేలు సభ్యత్వం పూర్తి చేస్తాం
* తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 9: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోగా తిరుపతి నియోజకవర్గంలో వందశాతం సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పారు. శుక్రవారం తిరుమలలో రాజుయాదవ్ ఆధ్వర్యంలో వెయ్యి సభ్యత్వాన్ని పూర్తి చేసిన కార్యకర్తలు, సభ్యత్వ నగదును, రశీదులను ఎమ్మెల్యే సుగుణమ్మకు అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించారు. వారిని ఉద్దేశించి సుగుణమ్మ మాట్లాడుతూ జనచైతన్య యాత్రల కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన 50వేల సభ్యత్వాన్ని పూర్తి చేయలేకపోయామన్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా సభ్యత్వ నమోదు చేశామని, అయితే మరో 15 రోజులు గడువు పొడిగించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో తమకిచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహయాదవ్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ్ధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠం క్యాంప్లెక్స్‌లో జెఇఓ పరిశీలన
తిరుపతి, డిసెంబర్ 9: తిరుమల్లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉన్న వంటశాలను, పరికరాలను జెఇఒ శ్రీనివాసరాజు శుక్రవారం పరిశీలించారు. వరుస సెలవుదినాలు, పర్వదినాలు రానున్న నేపథ్యంలో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని వంటశాల పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ 2 రామచంద్రారెడ్డి, అన్నప్రసాదం ట్రస్ట్ అధికారులు చెంచులక్ష్మి, క్యాటరింగ్ అధికారి శాస్ర్తీ, ఆరోగ్య అధికారి డాక్టర్ షర్మిష్ట, ఇఇలు చంద్రశేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.

నాగలాపురం చెక్‌పోస్ట్ వద్ద వసూలు చేస్తున్నారంటూ
ముగ్గురు అధికారుల సస్పెన్షన్
నాగలాపురం, డిసెంబర్ 9: నాగలాపురం తనిఖీ కేంద్రం వద్ద లారీల డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్యశాఖకు సంబంధించిన ముగ్గురు అధికారులను ఆ శాఖ కమిషనర్ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డిసిటిఓ భరత్ మోహన్‌కుమార్, ఎసిటివో ప్రతాప్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రాజు ఉన్నారు. వీరు ముగ్గురు తనిఖీ కేంద్రం ద్వారా వెళ్లే లారీల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ విచారణ జరిపించి వాస్తవాలని తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా కోడికొండ చెక్‌పోస్టు వద్ద జెఎస్‌డబ్ల్యు కంపెనీలకు చెందిన రెండు లారీలు గత నాలుగు రోజుల క్రితం ఎంట్రీ పాస్ వేసుకోకుండా చెన్నైకు బయలుదేరాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చివరి తనిఖీ కేంద్రమైన చిత్తూరు జిల్లా నాగలాపురం చెక్‌పోస్ట్ వద్దకు చేరుకొని ఎగ్జిట్ పాస్ నమోదు చేసుకోవాల్సి ఉండగా ఆ రికార్డులను చెక్‌పోస్ట్ సిబ్బంది పరిశీలించారు. కాగా అందులో కోడికొండ చెక్‌పోస్ట్ దగ్గర ఎంట్రీపాస్ లేకపోవడంతో లారీలను పక్కన నిలబెట్టేశారు. దీంతో డిసిటివో లారీ యాజమాన్యం వద్ద దాదాపు లక్ష రూపాయలకు పైగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వారు రూ.40వేలు చెల్లించి రహస్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. ఈ ఆధారాలను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు కమిషనర్‌కు నివేదిక సమర్పించడంతో ఈ మామూళ్ల వెనుక మరో ఇద్దరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు వారిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

నోట్ల రద్దుతో జరిగే మేలుపై ప్రచారం చేయండి
* జిల్లా బిజెపి అధ్యక్షుడు చంద్రారెడ్డి పిలుపు
తిరుపతి, డిసెంబర్ 9: నల్లకుబేరుల ఆట కట్టించి పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి బిజెపి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడలో నూతన బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి చిత్తూరు జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో నేడు సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే ఇవి తాత్కాలికమైనవన్నారు. అమృతం కోసం రాక్షసులు, దేవతల మధ్య విభేదాలు తలెత్తినపుడు పాలకడలిని చిలికినపుడు ముందు విషం వచ్చిందన్నారు. అటు తరువాత దేవతలకు అమృతం దక్కిందన్నారు. అలాగే దంపతుల కలైన పిల్లల జనన సమయంలో తల్లి ప్రసవ వేదన పడుతుందని, ఆ తరువాత బిడ్డకు జన్మనిచ్చి ఆ కుటుంబానికి ఒక వారసుడ్ని అందిస్తుందన్నారు. ఒక మంచి పనిచేసే సమయంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినా అవి తాత్కాలికమేనని ప్రజలు గుర్తించాలన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దశలవారీగా భారతదేశంలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. వాటిని పూర్తిగా అంతమొందించడానికి ప్రధాని మోదీ ఒక యజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. ఒక్క రోజులో దశాబ్ధాల తరబడి కూరుకుపోయిన అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదన్నది జగమెరిగిన సత్యమన్నారు. అయితే ఈ అవినీతి నిర్మూలన జరిపి పేదలకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తొలి అడుగు వేశారన్నారు. ఇది అంతం కాదని, ఆరంభం అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రధాని నిర్ణయాన్ని ఆహ్వానించడం శుభ పరిణామమన్నారు. ఇదిలాఉండగా అంతకుముందు జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 3న తిరుపతిలో ప్రారంభం కానున్న ఇస్కా కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని, ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటుచేసే విషయంపై చర్చించారు. కేంద్రం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా తెలియజేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి మాజీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు కె ఉమ, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, బిజెపి ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్, మాజీమంత్రి పట్నం సుబ్బయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

అక్కకూతుర్ని హత్య చేసిన మేనమామ
* నిందితుడు అరెస్ట్
పలమనేరు, డిసెంబర్ 9: అక్కకూతరు ప్రవర్తన సక్రమంగా లేదని భావించి దారుణంగా మేనమామే హత్య చేసిన వైనం పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పలమనేరు పట్టణంలోని రాధాబంగ్లా వీధిలో నివాసం ఉన్న కృష్ణప్ప కుమారుడు అయ్యప్ప(27) వ్యవసాయ పనులు చేసుకొని జీవించేవాడు. అదేవీధిలో నివాసం ఉన్న శ్రీనివాసుల కుమార్తె పావని తన వ్యవసాయ పొలంలో కూలీ పనులు చేసుకుంటూ ఉండేది. అయ్యప్పకు పావని స్వయాన అక్కకూతురు కావడంతో చనువుగా ఉండేది. ఈనేపథ్యంలో సొంత అక్క కూతురి ప్రవర్తన బాగలేదని పలుమార్లు తన అక్క చంద్రమ్మకు, బావ శ్రీనివాసులకు చెప్పాడు. ఎంతకి పావని ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం పావని తన వ్యవసాయ పొలంవైపు వెళ్తుండగా మార్గమధ్యలో గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపాడు. పూడ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి, ఎస్సై లోకేష్, రూరల్ ఎస్సై రాంభూపాల్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అయ్యప్పను అదుపులోకి తీసుకొని హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
* ఎర్రస్మగ్లర్ అరెస్ట్
తిరుపతి, డిసెంబర్ 9: తిరుమలలోని పార్వేటి మండపం వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా శేషాచల కొండల్లోని ఎర్రచందనం నరికి అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు మాత్రం కొండను వీడటంలేదు. గురువారం శేషాచల కొండల్లో స్మగ్లర్ల కదలికలకను గుర్తించిన టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. శ్రీవారిమెట్టు, చీకటీగల కోన, సచ్చినోడి బండ మీదుగా పార్వేటి మండపం వైపు వస్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో స్మగ్లర్లకు పైలెట్‌గా వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి టాస్క్ఫోర్స్ సిబ్బంది వారికంట పడకుండా మాటువేశారు. వీరిని గమనించకుండా దాదాపు 15మంది ఎర్రచందనం దుంగలతో సమీపానికి రాగానే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్మగ్లర్లు దుంగలను పడేసి, అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. కాగా వీరిలో తమిళనాడు, ధర్మపురి జిల్లాకు చెందిన పెరుమాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

‘మానవహక్కులు పుట్టుకతో ఉద్భవించి మరణంతో అంతమవుతాయి’
తిరుపతి, డిసెంబర్ 9: మనిషికి పుట్టుకతో మానవహక్కులు ఉద్భవించి మరణంతో అంతమవుతాయని, ఒక విధంగా ఈ హక్కులు మానవుడికి కర్ణుడికి కవచకుండలాలు వంటివని విశ్రాంత రెక్టార్ ప్రొఫెసర్ ఉమాదేవి అన్నారు. శుక్రవారం మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మావతి మహిళా వర్శిటీలో న్యాయసాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ డైరెక్టర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా పిసిఫిక్ స్టడీస్ ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే మానవహక్కుల పరిరక్షణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ మమత, డీన్ కృష్ణకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇంటిలో అగ్నిప్రమాదం
తిరుపతి, డిసెంబర్ 9: స్థానిక కర్నాలవీధిలో బ్యాంకు ఉద్యోగులు ఉంటున్న భవన సముదాయంలోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఇంటిలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారన్నారు. ఇంటిలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి ఎవరికి వారు కృషి చేశారు. ముందుగా ఆ ఇంటికి విద్యుత్ సరఫరాను ఆపివేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి, మంటలు చెలరేగకుండా ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న గీజర్ వైర్లు కాలి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. అయితే ఆ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్పంగా ఆస్తినష్టం జరిగింది. కాగా ఆ ఇంటిలోని బ్యాంకు ఉద్యోగులు విధులకు వెళ్లే సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గీజర్‌ను ఆపకుండానే వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.