చిత్తూరు

ఇక మీ జీవితం..మీ చేతుల్లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 23 : ఉన్నత విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి వెళ్తున్న నేపథ్యంలో మీ జీవితం ఎలా ముందుకు సాగించాలన్నది మీ చేతుల్లోనే ఉందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం 17వ స్నాతకోత్సవం ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ నరసింహన్ విచ్చేసి విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్, చేతన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి నన్నపనేని మంగాదేవికి గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ చేతుల మీదుగా అందించారు. అలాగే 2013-15, 2014-16 సంవత్సరాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న 1316మందికి మహిళ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందారు. వీరిలో స్నాతకోత్సవం సందర్భంగా హాజరైన 658 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. అలాగే సైన్స్‌లో 28 మందికి, సోషియల్ సైన్స్‌లో 27 మందికి, ఇంజినీరింగ్ టెక్నాలజీలో 13 మందికి ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు బంగారు పతకాలు అందించారు. అలాగే 11 మందికి బుక్‌ప్రైజ్‌లు, ఇద్దరికి నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి చేయాల్సిన సేవలను, వాటి అవసరాలను సవివరంగా తెలియజేశారు. అంతేకాకుండా మహిళలు లేనిదే సమాజం లేదని, వారి విలువలను విద్యార్థి దశ నుంచే పిల్లలకు బోధించాలని వివరించారు. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు జీవితంలో ముందుకు ఎలా సాగాలన్న విషయంపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థినులు కోపైలట్లని, గురువుల, తల్లిదండ్రుల పర్యవేక్షణలో విద్యను పూర్తి చేశారన్నారు. పట్టాలు అందుకున్న సమయం నుంచి ప్రతి విద్యార్థి ఒక పైలెట్ అన్నారు. వారి జీవితాలను ఎలా ముందుకు నడపాలో ఎవరికి వారు దిశానిర్దేశం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా చదువు అనేది మనిషి జీవించడం కోసమే అన్న భావన ఉందని, అది నిజమేనని అయితే విద్య పూర్తిచేసి తాము ఎంచుకున్న రంగంలో ఉద్యోగం చేస్తూ సంపాదన చేసినంత మాత్రాన ఆ విద్యకు సార్ధకత చేకూరదన్నారు. తాము నేర్చుకున్న విద్య తమ వ్యక్తిగత జీవితానికి ఎంత ఉపయోగించుకుంటున్నారో అంతకు మించి సమసమాజ నిర్మాణానికి విద్యార్థులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా మానవత్వం పరిఢవిల్లేలా ముందుకు సాగినప్పుడే ఆ విద్యకు సార్థకత చేకూరుతుందని అన్నారు. అదే గురువులకు ఇచ్చే గురుదక్షణ అన్నారు. ఇక ఏ ప్రాంతమైనా, ఏ రాష్టమ్రైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అన్నింటిని ప్రభుత్వాలే చేయడం సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలో సమాజాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములై సేవాభావంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే పద్మావతి అమ్మవారి అనుమతి కావాలన్నారు. ఆమె అనుమతి లేనిదే స్వామివారిని దర్శించలేమని అన్నారు. అంతటి గొప్పశక్తి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి పేరుమీద ఉన్న విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేసుకునే భాగ్యం లభించిందన్నారు. నేడు గౌరవ డాక్టరేట్ అందుకున్న మంగాదేవి తన జీవితాన్ని సార్థకం చేసుకునేలా చిన్న పిల్లల నుంచి దివ్యాంగులకు, అనాథలకు, వృద్ధులకు విశేష సేవలు అందించారన్నారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా సమాజ సేవకు కట్టుబడిన వారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని తాను విసి దుర్గ్భావానీకి సూచించానన్నారు. అందులో భాగంగానే నన్నపనేని మంగాదేవికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారన్నారు. సమాజ సేవ చేస్తే ఎవరికైనా అంత గౌరవం దక్కుతుందన్నారు. ఆమెను మార్గదర్శకంగా చేసుకుని విద్యార్థినులు ముందుకు వెళ్లాలన్నారు. ఇక మహిళలు లేనిదే సమాజం లేదన్నారు. ఆడ బిడ్డ జన్మిస్తే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులు చెప్పుకుంటారని, మగబిడ్డ పుడితే అలా చెప్పరు కదా అన్నారు.
అసత్యమేవ జయతే ఎన్నటికీ క్షేమం కాదు
ఇక సమాజంలో కీలక పాత్ర పోషించే మీడియా కూడా సంచలనాల వార్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజ హితం కోరే వార్త కథనాలను ప్రచురించడంపై దృష్టి పెట్టాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ హితవు పలికారు. శ్రీ పద్మావతి మహిళ విశ్వ విద్యాలయం 17వ స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ పరోక్షంగా మీడియాకు, రాజకీయ నేతలకు కూడా చురకలు అంటించే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ధర్మాన్ని పాటించాలని బోధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచలనాత్మకమైన వార్తలకు మీడియాలో ప్రాధాన్యత పెరగడంపై ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమాజ హితాన్ని పాటిస్తూ అందుకు అనుగుణమైన వార్తా కథనాలను ప్రచురించాలని హితవు పలికారు. సత్యమేవ జయతే అన్నది ధర్మ బోధన అని ఆ బోధనను అసత్యమేవ జయతేగా మార్చడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. సత్యదూరమైన విధానాలు, మాటలు ఎక్కువ కాలం మనజాలవన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళ విశ్వ విద్యాలయ విసి దుర్గ్భావానీ, గుంటూరు చేతన ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఎన్ మంగాదేవి, వర్శిటీ రిజిస్ట్రార్ ఉమ, రెక్టార్ మమత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ‘మున్సిపల్’ నామినేషన్ల దాఖలు
* 33వ డివిజన్‌కు నలుగురు, 38వ డివిజన్‌కు 10 మంది దాఖలు * నేడు నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ
చిత్తూరు, మార్చి 23 : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 33, 38 వ డివిజన్ల ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. 33వ డివిజన్‌కు నలుగురు వ్యక్తులు ఏడు సెట్లను, 38వ డివిజన్‌కు చెందిన 10 మంది 18 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన గురువారం 33వ డివిజన్‌కు నలుగురు, 38వ డివిజన్‌కు మరో ఐదుగురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రక్రియ ముగిసిన అనంతరం డివిజన్ల వారీగా నామినేషన్ల దాఖలు చేసిన వారిలో 33వ డివిజన్‌కు దివంగత మేయర్ కఠారి అనూరాధ దంపతుల కోడలు కఠారి హేమలత ( టిడిపి ), మేయర్ దంపతుల కుమార్తెకఠారి లావణ్య (టిడిపి డమీ అభ్యర్థి) భాస్కర్ అలియాస్ బాచి (ఇండిపెండెంట్) జయశ్రీ (ఇండిపెండెంట్)లు ఉన్నారు. అదే విధంగా 38వ డివిజన్‌కు సంబంధించి చెరుకూరి వసంత్‌కుమార్ (టిడిపి), జ్యోతి (వైకాపా), నరేష్‌చౌదరి (ఇండిపెండెంట్), శ్రీనివాసన్ (ఇండిపెండెంట్) ఎన్‌ఎం హేమంత్‌కుమార్ (ఇండిపెండెంట్), ఖాజా షరీఫ్ (ఇండిపెండెంట్), హీరా (ఇండిపెండెంట్), నరేష్ (ఇండిపెండెంట్) పి హేమంత్‌కుమార్ (ఇండిపెండెంట్) అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దివంగత మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ తండ్రి ఎస్ సుబ్రహ్మణ్యం నాయుడు గురువారం సాయంత్రం 2.58 గంటలకు నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి రాగా, సమయం ముగిసిందంటూ రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఆయనను నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించలేదు. కాగా సంబంధిత రెండు డివిజన్లకు రిటర్నింగ్ అధికారులుగా ఉన్న చంద్రబాబు, ఇన్బనాధన్‌లు నామినేషన్ పత్రాలను స్వీకరించారు.
నేడు నామినేషన్ల పరిశీలన :
33 వ డివిజన్‌కు దాఖలైన 7 సెట్లు, 38 వ డివిజన్‌కు దాఖలైన 18 సెట్ల నామినేషన్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పరిశీలిస్తారు. ఈ కార్యక్రమానికి నామినేషన్లు దాఖలు చేసిన వారు హాజరుకావచ్చని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పరిశీలన సందర్భంగా కొన్ని నిర్దేశిత పత్రాలను మాత్రం సమర్పించేందుకు అనుమతి ఉంటుందని, అయితే నామినేషన్ పత్రంలో మాత్రం ఎటువంటి రాతలకు అనుమతించ బోరు. ఈనెల 27వ తేదిన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో ఉన్న వారికి ఎన్నికల చిహ్నాలు కేటాయిస్తారు.

‘డాక్టర్ల సమస్యలు పరిష్కరించకుంటే
ప్రత్యక్ష పోరాటం తప్పదు’
చిత్తూరు, మార్చి 23 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డాక్టర్లల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ నాగరాజన్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం కోరుతూ చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు ఏ ఐటియుసి నాయకులు గురువారం తమ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ వైద్యులు గతంలో 20 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం స్పందించక పోవడంతో తాజాగా నిరాహార దీక్షలకు పూనుకున్నారని పేర్కొన్నారు. డాక్టర్లకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, సిపిఎస్ విధానం రద్దు, కాంట్రాక్టు డాక్టర్లకు జీతాలు సక్రమంగా చెల్లించడం, ఉద్యోగభద్రత కల్పించడం, ఇహెచ్‌ఎస్ అమలు చేయడం, టైమ్ బాండ్ పేస్కేలు అమలు చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా వైద్యులు నైరాశ్యానికి లోనవుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగి వచ్చి డాక్టర్ల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరుణ్‌కుమార్, మీనాకుమారి, విశ్వనాధన్ పాటు, ఏ ఐటియుసి నాయకులు ఉమాపతి, నాగరాజు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సౌందర్‌రాజన్, కె వెంకటేష్, పూమాల, చంద్రనాధ్, జయచంద్ర తదిరులు పాల్గొన్నారు.

గజవాహనంపై ఊరేగిన పద్మావతీ దేవి
తిరుపతి, మార్చి 23: శ్రీ పద్మావతి అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ పురస్కరించుకుని గురువారం రాత్రి అమ్మవారు గజవాహనంపై మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతక ముందు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని విశేషాలంకార భూషితురాలిని చేసి ఊంజల్ మండపంలో వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు అమ్మవారు గజ వాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటి ఇ ఓ మునిరత్నం రెడ్డి, ఏ ఇ ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ వెంకన్నకు కంచుగంట విరాళం
చంద్రగిరి, మార్చి 23: మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామికి తిరుపతికి చెందిన ఓ భక్తుడు రూ. 10.50 లక్షల విలువచేసే కంచు గంటను విరాళంగా అందించారు. దాదాపు 420 కేజీల బరువున్న కంచుగంటను గురువారం ఆర్.శ్రీనివాసులు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీ ఇ ఓ వెంకటయ్యకు అందించారు. దీనికి అర్చకులు సాంప్రదాయంగా పూజలు నిర్వహించారు. గంటను విరాళంగా అందించిన దాతకు స్వామివారి దర్శన ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో ఏ ఇ ఓ ధనంజయులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన కారు
తిరుపతి, మార్చి 23 : తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడు భక్తులు ప్రయాణిస్తున్న కారు మొదటి ఘాట్‌రోడ్డులోని 16వ మలుపు వద్ద అదుపుతప్పి కొండల్లోకి దూసుకెళ్లింది. ఈ కారు నడుపుతున్న రంగనాథన్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బావిస్తున్నారు. అయితే కారులోని భక్తులు క్షేమంగా బయటపడ్డారు.