చిత్తూరు

వైద్య, డ్వామా, వ్యవసాయశాఖల పనితీరుపై సభ్యుల ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 26: జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్య ఆరోగ్య, వ్యవసాయశాఖల పనితీరుపై పలువురు జడ్పీటిసి సభ్యులు, ఎంపిపిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నామమాత్రంగా కాకుండా సభ్యులంతా ప్రధాన సమస్యలపైనే దృష్టి పెట్టి అధికారులను నిలదీయడం విశేషం. దీంతో సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు జడ్పీటిసి సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో నీజ యాజమాన్య సంస్థ పనితీరు అస్తవ్యస్థంగా ఉందని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా నేటికీ అనేక గ్రామాలకు రోడ్డు వసతి లేకున్నా వాటిని గురించి పట్టించుకోని ఈ శాఖ కేవలం గుంతలకే పరిమితమై నిధులను దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాల్లో కనీసం ఈ శాఖ పరంగా ఏ పనులు చేస్తున్నారన్న సమాచారం కూడా మండల ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు లేకుండా బడ్జెట్ రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ 25 శాతం నిధులు జిల్లా పరిషత్‌కు కేటాయించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు పట్టుపట్టడంతో జెసి గిరిషా జోక్యం చేసుకొని దీనిపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభ్యులు శాంతించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ శాఖ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. అనేక చోట్ల ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించినా వాటికి నిధులు మంజూరు చేయక నిత్యం లబ్ధిదారులు మండల కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇకపై ప్రతి మండలంలో ఈ శాఖ చేపడుతున్న పనులను విధిగా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు జడ్పీటిసిలు డిమాండ్ చేశారు. దీంతో డ్వామా పిడి ఇకపై ప్రతి మండలంలో జరిగే పనులను విధిగా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో వ్యవసాయశాఖ రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాఖ నిర్వాకం వల్ల నిజమైన రైతులకు అనేక రకాలుగా నష్టం వాటిల్లిందన్నారు. గత సంవత్సరం వేరుశనగ పంట నష్ట పరిహారం చెల్లింపులో నిజమైన రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదని, మామిడి తోటలు, పారిశ్రామికవేత్తలకే ఈ నష్టహారం ఇచ్చారని వ్యవసాయ శాఖ జెడిని నిలదీశారు. ఈ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని నష్టపరిహారం నివేదికలు తయారు చేయడం వల్ల నిజంగా పంట సాగు చేసిన రైతులకు న్యాయం జరగలేదన్నారు. గత సంవత్సరానికి చెందిన నష్ట పరిహారం ఇంకా సక్రమంగా చెల్లించలేదని, దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నష్ట పరిహారం నివేదికలు సక్రమంగా తయారు చేయని సిబ్బందిపై విచారణ జరిపించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు భవనాలశాఖ పరిధిలో గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయిని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాలు శాఖ అధికారులకు విన్నవించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు చాలా అధ్వన్నంగా ఉందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని పలువురు జడ్పీటిసిలు ప్రస్తావించారు. కెవి పల్లి మండలం గ్యారంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ విధులను విస్మరిస్తున్నా పట్టించుకోవడం లేదని జడ్పీటిసి జయచంద్ర ప్రస్తావించారు. చిన్నగొట్టిగళ్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కూలిపోయే పరిస్థితిని నెలకొందని, వెంటనే దీన్ని మరమ్మతులు చేయాలని అనేకసార్లు అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
రూ.911 కోట్లతో బడ్జెట్ ఆమోదం
జిల్లా ప్రజా పరిషత్ 2017-2018వ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.911.17 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. గత ఏడాది రూ.887.65 కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్‌ను సభ ఆమోదించగా ఈ సారి రూ.24 కోట్లు అదనంగా జడ్జెట్‌ను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.911.17 కోట్ల ఆదాయ అంచనాలు కాగా అందులో రూ.911 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు.
పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరు
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అనేక మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ, జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపిలు వరప్రసాద్, మిధున్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు అమరనాధరెడ్డి, సునిల్, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, సుగుణమ్మ, తిప్పా రెడ్డి, అదిత్య, శంకర్ గైర్హాజరు కాగా, చిత్తూరు ఎంపి శివప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాత్రమే హాజరయ్యారు.

ఆధిపత్యపోరుతో అసలుకే మోసం తెచ్చుకున్నారు
* రైల్వేస్టేషన్ వద్ద రెండు ఆటోస్టాండ్లు తొలగించిన ఎస్పీ
* ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్రజాప్రతినిధుల ఫోన్లు

తిరుపతి, మార్చి 26: బతుకు బండి నడుపుతూ మరింత ముందుకు సాగాల్సిన ఆటో డ్రైవర్లు క్షణికావేశం, ఆధిపత్యం పోరుకు తెగబడి పరస్పరం ఘర్షణలకు దిగడంతో ఉన్న ఉపాధిని కూడా పోగొట్టుకున్నారు. ఇదెవరునుకుంటున్నారా? తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో వ్యాపారం చేసి జీవించే ఆటోడ్రైవర్ల స్థితి ఇది. నిత్యం భక్తులతో, ప్రయాణికులతో ఆటో డ్రైవర్లు పరస్పరం ఘర్షణలకు దిగడం, తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి దిగడంతో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని భావించిన ఎస్పీ జయలక్ష్మి విష్ణునివాసం వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను తొలగించారు. శనివారం రాత్రి రైల్వేస్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లు పరస్పరం ఘర్షణకు దిగి బహిరంగంగా కొట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. తిరుపతి క్షేత్రం ఘర్షణలకు క్షేత్రంగా మారిందనే భావన ప్రయాణికుల్లోకనిపించింది. ఈ పరిస్థితి గమనించిన ఎస్పీ జయలక్ష్మి ఆదివారం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను నిర్మొహమాటంగా తొలగించారు. ఎస్పీ తొలగిస్తే తమకున్న రాజకీయ పలుకుబడితో తిరిగి ఆటో స్టాండ్‌ను నడిపించుకుంటామనుకున్నారేమోకాని ఆటో డ్రైవర్లు తిరుపతి ఎంపి, ఎమ్మెల్యేలను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఎస్పీ ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం సోమవారం నాటికి ఎలాదారితీస్తుందో, పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలకు సంబంధించి పూర్వపరాలను పరిశీలిస్తే తిరుపతిలో ఆటోలు నడుపుతున్న డ్రైవర్లు తమ వృత్త్ధిర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించడం, రాత్రి వేళల్లో ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే లైసెన్సుల్లేని వారు కూడా ఆటోలు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే హైదరాబాదులాంటి నగరంలో కూడా లేనన్ని ఆటోలు తిరుపతి నగరంలో 40వేలకు పైగా ఉన్నాయని అంచనా. వీటిలో నిజంగా ఆటో వృత్తిపై జీవించేవారి కన్నా, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆర్‌టిఓ, పోలీస్ ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది బినామీలుగా ఉన్న ఆటోలే ఎక్కువగా నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా అంతా సజావుగా సాగిపోతూ వచ్చింది. ఇటీవల విష్ణునివాసం వద్ద ప్రయాణికులను ఎక్కుంచుకుంటున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఆర్టీసీ ఉద్యోగులు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఈస్ట్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ విష్ణునివాసం వద్ద ఉన్న ఆటో స్టాండ్‌ను తొలగించారు. దీంతో వృత్తి కోల్పోయిన డ్రైవర్లు తమ ఆటోలను రైల్వేస్టేషన్ ముందున్న ఆటోస్టాండ్‌కి వలసవచ్చారు. అక్కడ 40 ఆటోలను ఉంచడానికి మాత్రమే అనుమతి ఉన్నా 70 నుంచి 100 ఆటోలు పెడుతూ వచ్చారు. ఈక్రమంలో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఆటోసంఘాల నాయకులు శనివారం రాత్రి అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహించిన కొంత మంది ఆటో డ్రైవర్లు వారితో ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే ఎలా రాజీపడ్డారో తెలియదుకాని పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్పీ జయలక్ష్మి నిత్యం లక్షమంది ప్రయాణికులు వచ్చే రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లు సృష్టిస్తిన్న రాద్ధాంతాలు శాంతి భద్రతలకు విఘాతంగా మారడమే కాకుండా పుణ్యక్షేత్ర ప్రతిష్ట కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో అక్కడున్న ఆటో స్టాండ్‌ను తొలగించారు. ప్రయాణికుల అవసరార్థం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆ సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

చిన్న శేష, హంస వాహనాలపై కోదండరాముని చిద్విలాసం

తిరుపతి, మార్చి 26: స్థానిక శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం స్వామివారు చిన్నశేష వాహనంపైన, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపైన స్వామివారు తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు శ్రీకోదండరాముడు చిద్విలాసంగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే భక్తజన బృందాలు, చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో నృత్యం చేశారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకుని తరించారు. వాహన సేవ అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు కల్యాణ మండపంలో సీత, లక్ష్మణ సమేత కోదండరామ స్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు ఊంజల్‌సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కోదండరామ స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి, అదనపు సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి మునిలక్ష్మి, ఇఇ జగదీష్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి విద్యావిధానంలో మార్పులు అవసరం
* టిటిడి ప్రత్యేక అధికారి ముక్వేశ్వరరావు సూచన
తిరుపతి, మార్చి 26: నేటి విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిటిడి అన్ని ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. హేవలంబి ఉగాది సందర్భంగా విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎస్వీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో విద్యా పరిరక్షణ సమిత ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరైన ముక్తేశ్వరరావు మాట్లాడుతూ మనం చేసే పనులు సమాజంలో ప్రతిబింబిస్తుంటాయని అన్నారు. పోలీసులను కాపలా ఉంచి 10వ తరగతి పరీక్షలు రాయించడం సమంజసం కాదని అన్నారు. సమావేశానికి ఆత్మీయ అతిథిగా హాజరైన ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు మాట్లాడుతూ ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే ఎలా ఉంటుందో అదే విద్యాపరిరక్షణ సమితి అన్నారు. ఈ సంస్థ కుల, మతాలకు అతీతంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందడం సంతోషంగా ఉందన్నారు. విశిష్ట అతిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంచివారిని గుర్తించి తగినరీతిలో సత్కరించినప్పుడే సమాజం ముందుకు వెళుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య బి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి కార్యక్రమాలను చేపట్టి సమాజశ్రేయస్సుకు దోహదం చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యాపరిరక్షణ వ్యవస్థాపకుడు భాస్కర్ వేడియం ఆధ్వర్యంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య పి.వి.అరుణాచలం, అవధాన చక్రవర్తి డాక్టర్ మేడసాని మోహన్, టిటిడి మ్యూజియం డైరెక్టర్ ఆచార్య పి.వి.రంగనాయకులు, హర్షిత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతి, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో ఆచార్య డాక్టర్ కొలకలూరి మధుజ్యోతి, సీనియర్ జర్నలిస్టు అత్తి దేవరాజన్, ప్రముఖ నవలా రచయిత డాక్టర్ వి. ఆర్.రాసాని, అమ్మ మహిళా వృద్ధాశ్రమం వ్యవస్థాపకురాలు భూలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కన్వీనర్ నరసింహులు, కో ఆర్డినేటర్ నాదెండ్ల శ్రీమన్నారాయణ, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, ఆచార్య కృష్ణకుమారి, సుమతి, డాక్టర్ హరినాథ రెడ్డి, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ మన్యం నరసింహులు, డాక్టర్ కె.రెడ్డెప్ప, డాక్టర్ ధనంజయ రెడ్డి, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ నరసింహవర్మ, డాక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

అమర రాజా అవార్డుల ఖాతాలో మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్

తిరుపతి, మార్చి 26: అమర రాజా గ్రూపు ఇటీవల కాలంలో తన వ్యాపార రంగంలో అనుసరిస్తున్న అత్యున్నత ప్రమాణాలు అందిస్తున్న సేవలు సాధిస్తున్న ఆర్థిక ప్రగతి నేపథ్యంలో అనేక అవార్డులను తనపరం చేసుకుంటుంది. ఇందులో భాగంగా 2016-17 సంవత్సరానికి భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును తనపరం చేసుకుంది. అమర రాజా గ్రూపులోని ప్లాగ్‌షిప్ కంపెనీ అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్‌కు లభించిన ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన 12వ సిఎన్‌బిసి టివి 18 ఇండియా బిజినెస్ అవార్డు వేడుకలలో అందుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ చేతుల మీదుగా అమర రాజా బ్యాటరీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎంపి జయదేవ్ గల్లా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం హాజరైనట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నమయ్య సంకీర్తనల్లో రామానుజతత్వం
తిరుపతి, మార్చి 26: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల్లో శరణాగతిని, మధురభక్తి తదితర అంశాలతో కూడిన రామానుజ తత్వాన్ని చక్కగా వివరించారని నల్గొండకు చెందిన ఆర్‌కె వేదాంతం అన్నారు. అన్నమయ్య 514వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న మూడో రోజు సదస్సుకు అధ్యక్షత వహించిన ఆర్‌కె వేదాంతం అన్నమయ్య రామానుజ సంప్రదాయం గురించి వివరించారు. హైదరాబాదుకు చెందిన విష్ణ్భుట్ల రామకృష్ణ అన్నమయ్య సంకీర్తనలు చతుష్టష్టి కళావైభవం గురించి, డాక్టర్ అనుపమ కైలాష్ అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో అభినయాంశం గురించి వివరించారు. ఈకార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల డిప్యూటి ఇఓ శారద, ఏఇఓ పద్మావతి, రీసెర్చ్ అసిస్టెంట్ డాక్టర్ సి.లత తదితరులు పాల్గొన్నారు.

రవాణా కమిషనర్‌పై దాడి అమానుషం
* మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఖండన
తిరుపతి, మార్చి 26: విజయవాడ రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంపై, సిబ్బందిపై విజయవాడ ఎంపి, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ నాగుల్‌మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీ్ధర్‌లు దాడిచేయడం అమానుషం, అప్రజాస్వామికమని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రవాణాశాఖ అధికారి తప్పుచేసి ఉంటే చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా, మందీ మార్బలంతో కమిషనర్‌ను చుట్టుముట్టి బెదిరించేలా ప్రవర్తించడం సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందన్నారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ఏరివేస్తామన్న సిఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ కమిషనర్, కార్పొరేషన్ చైర్మన్‌లు గూండాల్లా వ్యవహరించన తీరుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన వారిని వెంటనే ఆ పదవుల నుంచి తప్పించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని శ్రీదేవి ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రవాణాశాఖ అధికారుల పోరాటానికి మహిళా కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తాము చేసింది తప్పేనని క్షమించాలని కోరినంత మాత్రాన ప్రజాప్రతినిధులు పవిత్రులు కారని అన్నారు.