చిత్తూరు

నకిలీ నోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: వజ్రాల వ్యాపారం ముసుగులో నకిలీనోట్లు చలామణి చేస్తున్న 10 మంది మోసగాళ్లను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం స్థానిక ఆర్సీ రోడ్డులోని యునిమనీ ఫైన్సాన్స్ కార్యాలయం వద్ద అనంతపురంకు చెందిన అత్తర్ మహ్మద్ (55), మహ్మద్ ఖాజా ఇమ్రాన్ (42)ను అరెస్టు చేశారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు తిరుపతి అర్బన్ జిల్లా క్రైమ్ డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యలో సీఐ టి.మధు ఇతర సిబ్బంది విజయవాడ నిడమనూరు గ్రామం నారాయణపురం కాలనీలోని నవనీత్ కుమార్ (27), అరుమల బాలకుమార్ (29), బోడి పవన్‌కుమార్ (23), విశాఖపట్నంకు చెందిన మంకు నాయుడు అలియాస్ బాబు (17), అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన పెద్దయ్యనగరి మోహన్ (40), తనకల్లు మండలం, చకతిమనుపల్లికి చెందిన వన్నిలి చరణ్‌కుమార్ (23), విశాఖకు చెందిన డిపీఎస్ వర్మ (50), కృష్ణాజిల్లా గణపవరం గ్రామానికి చెందిన బక్తుల మురళీకృష్ణా రెడ్డి (33), యకులం రెడ్డి అనేవారిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో నకిలీనోట్లు ముద్రించి వాటిని చలామణి చేస్తున్నట్లు, వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసిందని ఎస్పీ చెప్పారు. వీరి నుంచి రూ. 10.02లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లు 501, రూ.5.35లక్షల విలువ చేసే 19.22 కేరెట్స్ బరువున్న 14 డైమండ్లను, నకిలీనోట్ల తయారీకి వినియోగించే ఒక స్కానర్, 2 లాప్‌టాప్‌లు, రెండు కలర్‌ప్రింటర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు తరలించామన్నారు. ఈ కేసులో మరో ముద్దాయి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేయడంలో తిరుపతి క్రైమ్ సబ్ డివిజన్ ఎస్డీపీఓ ఆర్.రవిశంకర్ రెడ్డి, శ్రీకాళహస్తి, సబ్ డివిజన్ ఎస్డీపీఓ రామకృష్ణ, తిరుపతి క్రైం సీఐ మధు, శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ఈవీవీ నరసింహ, పీసీలు పాల్గొన్నారని, వారందరినీ అభినందిస్తూ రివార్డులు ఇవ్వన్నుట్లు చెప్పారు.

మహిళా వర్శిటీలోని న్యాయవిద్య విద్యార్థిని ఆత్మహత్య
* కారణాలు అనే్వషిస్తున్న పోలీసులు
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 14: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య నాల్గవ సంవత్సరం చదువుతున్న సుస్మిత (24) తాను బస చేస్తున్న ఓ ప్రైవేటు వసతిగృహంలోని గదిలో ఉరి వేసుకుని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ సీఐ చంద్రశేఖర్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్‌ఆర్ కడపజిల్లా శేషారెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు, రాజేశ్వరిల కుమార్తె సుస్మిత మహిళా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తోందని, గత మూడు సంవత్సరాలుగా వర్శిటీకి సమీపంలో ఉన్న ఎస్‌కె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో మరో ఇద్దరు యువతులతో కలసి అద్దెకు ఉంటోంది. గురువారం ఆమెతో పాటు ఉన్న యువతులు వారి పనులు నిమిత్తం వెళ్లినా, సుస్మిత మాత్రం గదిలోనే ఉండిపోయిందన్నారు. సాయంత్రం తిరిగి వచ్చిన ఆమె సహచర యువతులు గది తలుపులు తెరవడానికి యత్నించారు. లోపల గడియపెట్టి ఉండటంతో అనుమానించి కిటికీలో నుండి చూడటంతో సుస్మిత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్‌రావు తన సిబ్బందితో కలసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న విధానాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సుస్మిత ఫోన్ సంభాషణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా మృతురాలు సుస్మిత తండ్రి శ్రీనివాసులు 11వ బెటాలియన్‌లో పోలీస్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని సీఐ తెలిపారు.

సబ్‌జైల్‌ను సందర్శించిన కలెక్టర్
తిరుపతి, డిసెంబర్ 14: తిరుపతి నగరంలో ఉన్న ప్రత్యేక ఉప కారాగారాన్ని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం సందర్శించి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనం ఎలా ఉందని ఖైదీలను కలెక్టర్ అడుగగా, బాగుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఉప కారాగారం పరిసరాలను పరిశీలించిన అనంతరం వంటశాల గదిని పరిశీలించి భోజనాన్ని రుచి చూశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించే ముందు రిజిస్టర్‌లో సంతకం చేసి తిరిగి వచ్చేటప్పుడు రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి స్పెషల్ సబ్‌జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్‌రెడ్డి ఆన్‌లాకింగ్ వివరాల గురించి తెలియజేస్తూ కన్విక్ట్ ప్రిజనర్స్ మేల్ 13మంది, రిమాండ్ ప్రిజనర్స్ మేల్ 146 మంది, రిమాండ్ ప్రిజనర్స్ ఫీమేల్ 13మంది, 1 చైల్డ్, మొత్తం 172మంది ఒక చైల్డ్ ఉన్నారని తెలిపారు.

వైకుంఠ ఏకాదశికి స్థానికుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ఏర్పాటు చేయాలి
* 17న టీటీడీ ఏడీ బిల్డింగ్ వరకు పాదయాత్ర
* కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ స్పష్టం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 14: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా స్థానికుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి స్వామివారి దర్శన సౌకర్యం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ అధికారుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజల కోసం తిరుమల కొండపై వెలిశాడన్నారు. ఆయన దర్శనం స్థానికులకు కల్పించకుండా టీటీడీ ధనవంతులకే ఎల్ 1 దర్శనాలను కల్పించడం సరికాదన్నారు. ఎల్ 1 దర్శనాలను స్థానికులకు, కేటాయంచాలని ఆయన డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న టీటీడీ పరిపాలనా భవనం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ అధికారులను కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన కూడా స్థానికులకు స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు హుండీలో వేసే కానుకల ఖర్చుపై కాగ్ ఆడిటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలపై ఆయన మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఆనందంగా ఉందని చింతా మోహన్ అన్నారు. బీజేపీకి పతనకాలం ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గెలుపు వెనుక ఆయన చేసిన సంక్షేమ పథకాలే కీలకంగా మారాయని, అదే సమయంలో ఎంఐఎంతో పొత్తు కూడా కలిసొచ్చిందని తెలిపారు.
అంతిమయాత్రలోనూ ఆంక్షలా..
ఇదిలావుండగా అంతిమయాత్రపై నగర పాలక సంస్థ నిబంధనలపై చింతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్థివ దేహాలను తరలించే అంతిమయాత్ర సందర్భంగా పువ్వులు చల్లడం ఒక సాంప్రదాయమని, ఆ ప్రక్రియపై నగర పాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు నిషేధం పెట్టడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధన వెనక్కు తీసుకోవాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ప్రమీలమ్మ, పీసీసీ కార్యదర్శి కెఎం సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి, నాయకులు బ్రహ్మానందం, వెంకటముని, బుర్రా సావిత్రి యాదవ్, భారతి, శోభ తదితరులు పాల్గొన్నారు.

మానవత్వానికి ప్రతిరూపం ఛారిటీ వాల్
* జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
* జిల్లా పోలీసులు వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, డిసెంబర్ 14: జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా పోలీసు యంత్రాంగా ఏర్పాటు చేసిన ఛారిటీ వాల్ మానవత్వానికి ప్రతి రూపమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. ఇదివరకు చిత్తూరు ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు దాతలు సహకారంతో ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడంతో పాటు నిస్సహాయలకు అపన్న హస్తం అందించే విధంగా ఛారిటీ వాల్‌ను ఏర్పాటు చేసారు. గతంలో నగర వాసులు తమ పుట్టిన రోజన , పెండ్లి రోజులతో పాటు ఇతర శుభదినాల్లో ఈ ఛారీటీ వాల్ ద్వారా చిత్తూరు ఆసుపత్రికి వచ్చే నిరుపేదలు పలు రకాలుగా చేయూత నిచ్చే వారు. అయితే ఇకపై నగరంలోని అమ్మవడి సేవా ఆశ్రమం ద్వారా ప్రతి రోజు ఒక పూట 150 మందికి అన్న దానం చేసే కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు చేయూత నివ్వాలన్న తలంపుతో ఈ ఛారిటీ వాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలవారితో లేనివారి అవసరాలు తీర్చే గొప్ప ప్రయత్నమే ఈ ఛారిటీవాల్ ని చెప్పారు. గతంలో దాతులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆసుప్రతిలో అన్నదానం కొనసాగేదని, అయితే ఇకపై అమ్మవడి ఆశ్రమ నిర్వాహులు సహకారంతో ప్రతి రోజు 150 మందికి ఒక పూట ఆసుపత్రికి వచ్చే పేదలు అన్న దానం చేయడం జరుగుతుందన్నారు. అన్నిదానాల్లో అన్నదానం ఉత్తమైందని ఇటు వంటి కార్యక్రమానికి చేయూత నిచ్చిన అమ్మవడి ఆశ్రమ నిర్వాహుకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై జిల్లా పోలీసులు అమ్మవడి ఆశ్రమ నిర్వాహకులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిత్యం కొనసాగుతుందని ,ప్రజలు కూడా ఈ మంచి కార్యక్రమానికి సహకారం ఇవ్వాలన్నారు. ఛారిటీ వాల్ కు ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసామని దీని ద్వారా దాతలు సహాయాన్ని అందించ వచ్చునని చెప్పారు. కేవలం అన్నదానమే కాకుండా బియ్యం , కందిపప్పు, నూనెలు, దుస్తులు , తో పాటు ఆహార వస్తువులను ఇతర వినియోగ వస్తువులను స్వయంగా ఛారిటీ వాల్ లో అందజేయవచ్చునని తెలిపారు. దాతలు సహాయం అందించే వారు పోలీసు వాట్స్ ఆఫ్ నెంబర్ 9440900005కు సమాచారం ఇవ్వాలన్నారు. పేదల ఆకలి తీర్చడంలో నగర వాసులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రంమలో అమ్మవడి అశ్రమ నిర్వాహకులు పద్మనాభరెడ్డి, పలువురు డీ ఎస్పీలు సి ఐలు పాల్గొన్నారు.