చిత్తూరు

వారంలోగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 8: తిరుపతి పార్లమెంట్, అర్బన్, చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈసీ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన ఆకస్మింగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా చంద్రగిరి నియోజకవర్గంలోని పనపాకం జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 155, 156 పోలింగ్ కేంద్రాలను, ముంగిలిపట్లు ఎలిమెంటరీ స్కూల్లోని 151, 152 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 3800 పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కోసం ర్యాంప్, నీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం తిరుపతిలోని బైరాగిపెట్టడ, ఎస్జీఎస్ కళాశాల వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కనీస వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజును ఆదేశించారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని 167 పోలింగ్ కేంద్రాలను, తిరుమలలోని 5 పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీ చేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో, సంయుక్తంగా కలిసి పోలింగ్ బూత్, పోలీస్ స్టేషన్‌ల వారీగా జాతీయ స్థాయిలో ఉత్తమ సూక్ష్మ స్థాయి సెక్యూరిటీ ప్లాన్‌ను, ఎన్నికల నిర్వహణ ప్రణాళికను వెంటనే రూపొందించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను, రిటర్నింగ్ అధికారులను, ఎస్పీలను కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 11న రాజధానిలో ఈసీఐ కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మార్చి నాటికి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
* ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశం
తిరుపతి, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకై జీఓ 65, 66 లను జారీ చేసిందని, ఈ మేరకు మార్చి నెలాఖరులోగా ఆ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. కమిషన్ జిల్లాలో మూడవ రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక పద్మావతి అతిథిగృహంలో డిస్కం, స్విమ్స్, ద్రావిడ విశ్వవిద్యాలయం, ఎస్వీయూనివర్శిటీల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్లపైన, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పరిధిలో 2011 నుంచి అట్రాసిటీ ఇతర కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ టీటీడీలో 94 ఎస్సీ, 76 ఎస్టీ, ఎస్వీబీసీలో 21 ఎస్సీ, 8 ఎస్టీ, డిస్కంలో స్విఫ్ట్ ఆపరేటర్స్ 214 ఎస్టీ, కడప జిల్లా లో 26 ఎస్సీ పోస్టులను గుర్తించామన్నారు. వెంటనే వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. తిరుపతిలో ఒక ఎస్సీ కాలనీకి, జిల్లాలో కొన్ని కాలనీలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని వెంటనే వాటిని పూర్తి చేయాలని డిస్కం అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వివరాలను ఈనెల 14వ తేదీలోపు అందించాలని స్పష్టం చేశారు. డీఈ సత్యానంద్‌పై తప్పుడు కేసు నమోదైనట్లు అభియోగం ఉందని కోర్టులో తేలేంత వరకు పూర్తి జీతం ఇవ్వాలని డెరెక్టర్ వెంకటేశ్వర్లను ఆయన ఆదేశించారు. స్విమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతి, లక్ష్మీ ప్రసన్నల విషయంలో వివక్ష చూపిస్తున్నారని, వెంటనే న్యాయం చేయాలని స్విమ్స్ అధికారులను ఆదేశించారు. ఎస్వీయూలో 15 నుంచి 16శాతం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని రిజిస్టార్ అనురాధను ఆదేశించారు. వేద విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించాలని, టీటీడీపై ఆధారపడటం కన్నా యూజీసీ పరిధిలో ఉండాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలన్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు తీసుకురావాలని వీసీ సుదర్శన శర్మకు తెలిపారు. తిరుపతి ఎస్పీ అన్బురాజన్ గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగిన అట్రాసిటీ, రేప్ కేసుల నివేదికను పరిశీలించిన కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులుగా రుజువైతే వారికి జీఓ నెంబర్ 95 ప్రకారం రూ. 8.25 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, భూమి నష్టపరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు నరహరి వరప్రసాద్, రవీంద్ర, అబ్రహ సవేరి, చైర్మన్ ఓఎస్డీ సుబ్బారావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చలపతి, సీజీఎం చలపతి, స్విమ్స్ ప్రొఫెసర్ శ్రీ్ధర్ బాబు, అలోక్ వర్మ, వేదిక్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసాచార్యులు, సోషల్ వెల్ఫేర్ జేడీ విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

హైవే పెట్రోలింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలి
* గస్తీలను పటిష్టం చేయాలి
* జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు,్ఫబ్రవరి 8: జిల్లాలో హైవ్ పెట్రోలింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు పోలీసు కార్యాలయంలో జిల్లాకు కొత్తగా వచ్చిన 63 ద్విచక్రవాహనాలకు ఎస్పీ జెండా ఊపి పోలీసు స్టేషన్లకు కేటాయించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పోలీసు శాఖకు పలు వాహనాలు కేటాయించిందని, ఇందులో జిల్లాకు 63 వాహనాలు కేటాయించారని తెలిపారు. మోటారు వాహనాలకు జీపీఎస్, బ్లింకర్, ఎల్‌ఈడి బల్బులు, సైరన్ ఏర్పాటు చేసారన్నారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా బ్లూ కోల్డ్స్ వ్యవస్థ, బీట్ సిస్టమ్‌ను మరింత వేగవతం చేయాలన్నారు. జిల్లాలో హైవే పెట్రోలింగ్ వ్వవస్థను మరింత పటిష్ట పరిచి రోడ్డు ప్రమాదాలు నివాణరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ, రాధాకృష్ణ, డీఎస్పీ గిరిధర్, ఎంటివో మురళి తదతరులు పాల్గొన్నారు.

జిల్లాలో 51 మంది ఎంపీడీవోలు బదిలీలు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 8 : ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన 51 మంది ఎంపీడీవోలు, నలుగురు ఈవోఆర్‌డివోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులను వారిని ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాకు చెందిన ఎంపిడివోలు, ఈవోఆర్‌డిలను పొరుగు జిల్లాలకు చెందిన కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు బదిలీ చేయగా, ఈ జిల్లాకు పొరుగు జిల్లాకు చెందిన 50 మంది ఎంపీడీవోలను, 8 మంది ఈవోఆర్‌డిలను జిల్లాకు కేటాయించారు. త్వరలోనే జిల్లా నుంచి పొరుగు జిల్లాకు బదిలీ అయిన ఈ ఆధికారులు రిలీవ్ కానున్నారు. జిల్లాకు కేటాయించిన ఎంపీడీవోలు రిపోర్టు చేసిన తరువాత కొత్తవారికి మండలాలను కేటాయించనున్నారు.

బాలుడిని బలిగొన్న హంద్రీ-నీవా
బి.కొత్తకోట, ఫిబ్రవరి 8: బాలుడిని హంద్రీ-నీవా బలి తీసుకున్న సంఘటన బి.కొత్తకోట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. బి.కొత్తకోట మండలం, హుసేన్ కుమారుడు హక్మల్(12)లు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల అనంతరం మిత్రులతో కలిసి ఆడుకునేందుకు బెంగళూరు రోడ్డులోని హంద్రీ-నీవా కాలువలోకి ఈతకు వెళ్లారు. ఆడుతూ ఆడుతూ కాలువ మధ్యలో లోతు ఎక్కువుగా ఉండడంతో బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడే మునిగిపోయాడు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో మునిగిన చోట నుండి 100 అడుగుల దూరంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో సహాచర మిత్రులు తన మిత్రుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకొని గట్టిగా కేకలు వేసారు. స్పందించిన స్థానికులు హుటాహుటిన కాలువ నుండి బాలుడ్ని బయటకు తీసారని, అప్పటికే బాలుడు భయాభంత్రులకు గురై కడుపునిండానీరు మింగడంతో దీన్ని గమనించిన స్థానికులు బాలుడు ప్రాణప్రాయ స్థితిలో ఉండడం చూసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ వైద్యులు బాలుడిని ప్రాథమిక వైద్యం నిర్వహించక ముందే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడు మృతితో బి.కొత్తకోట పట్టణంలోని రంగసముద్రం రోడ్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భార్య మీద అనుమానంతో...
ఏడు నెలల పసికందును బావిలో పడేసిన కసాయి తండ్రి
పెద్దపంజాణి, ఫిబ్రవరి 8: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఓ కసాయి తండ్రి తమకు పుట్టిన ఏడు నెలల పసికందును బావిలో పడేసిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. పెద్దపంజాణి ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం, గొర్రెలదొడ్డికి చెందిన నాగవేణి, గంగవరం మండలం, చౌవిరెడ్డిపల్లెకు చెందిన కృష్ణ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి కాపురం ఏడాదిన్నర పాటు సజావుగా సాగింది. భార్య నాగవేణి మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానం భర్త కృష్ణలో మొదలైంది. అప్పటి నుండి తరచూ ఘర్షణకు పాల్పడేవాడు. శుక్రవారం కృష్ణ భార్యతో గొడవపడి వారికి జన్మించిన ఏడు నెలల పసికందును పత్తికొండ రోడ్డు బత్తలపల్లె వ్యవసాయ పొలాల సమీపంలోని నిడిగుంట దగ్గర బావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ శ్రీనివాసులు, పెద్దపంజాణి ఎస్‌ఐ మురళీమోహన్‌లు పరిశీలించి బావిలో పడిన పసికందును వెలికితీశారు. దీనిపై పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక్‌సత్తాతోనే ప్రజలకు జీవన భద్రత
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం స్పష్టం
తిరుపతి, ఫిబ్రవరి 8: పేదలందరికీ జీవన భద్రత కల్పించే వౌలిక ఆదాయ పథకాన్ని లోక్‌సత్తా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రణాళికలపై సూచనలు, సలహాలకై నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయపార్టీలు తమ స్వలాభం కోసం రానున్న ఎన్నికల్లో ఓట్లకోసం పేదలను కులాలుగా, ఉప కులాలుగా విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. లోక్‌సత్తా పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల పేదలను ఐక్యం చేసే దిశగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందన్నారు. ఇందులో పేదలందరికీ జీవన భద్రతకు ప్రతి వ్యక్తికి ప్రతి నెలా రూ. 2వేలు వౌలిక ఆదాయం, అందరికీ నివాస వసతి, జబ్బులకు ఉచితంగా వైద్యం, మందులు అందించనున్నట్లు తెలిపారు. మంచి ప్రమాణాలతో ఉచిత విద్య అందించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను పేదలందరికీ ఉమ్మడి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చడం, గ్రామాలు, పట్టణాల్లో ఉపాధినిచ్చే వృత్తి నైపుణ్యాల శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తామని, ప్రభుత్వమే పరిమితంగా మద్యం షాపులను నిర్వహిస్తుందని తెలిపారు. లాభసాటి వ్యవసాయం, కౌలుదారులకు ఊరట, దళారీ వ్యవస్థ నిర్మూలన, రైతు సహకార సంఘాల ద్వారా తాము పండించిన పంటలకు ఉత్పత్తి ధరలను నిర్ణయించుకునే అవకాశం, పంట రుణాలు, రాయితీలు అందించడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించే విధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు, సాధారణ ఉపాధినిచ్చే వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, వౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రాంతీయ కౌన్సిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ నాయకులు బెల్లంకొండ సురేష్, పార్థసారథి, మునిచంద్ర, వెంకటాద్రి, హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఫలాలను వెనుకబడిన వర్గాల ముందుంచుతున్న సీఎం బాబు
* తుడా చైర్మన్ నరసింహ యాదవ్ వెల్లడి
తిరుపతి, ఫిబ్రవరి 8: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాలనాదక్షతతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి దానిని వెనుకబడిన వర్గాలకు అందించేందుకు నిరంతరం పాటు పడుతున్నారని తుడా చైర్మన్ నరసింహ యాదవ్ కొనియాడారు. శుక్రవారం స్థానిక తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి ప్రతి నియోజకవర్గంలో బీసీలు కుటీర పరిశ్రమల్లో తాము తయారు చేసిన ఉత్పత్తులను మినీ మార్కెట్‌లో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నారన్నారు. పీజ్ రీయింబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలలు ఏర్పాటు, విదేశీ విద్యకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నారుూబ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీ సబ్‌ప్లాన్ తీసుకువచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏమాత్రం పరిపాలనా అనుభవం లేని, నిజాయితీలేని జగన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మాటలతో మాయం చేయాలనుకుంటున్న వైకాపా నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్న సీఎంను కేంద్ర ప్రభుత్వమే గుర్తించి అవార్డులు ప్రకటిస్తోందన్న విషయం తెలుసుకోవాలన్నారు. తిరుపతిని ఇండస్ట్రియల్ హబ్‌గా, రాయలసీమకే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అపర భగీరధుడిగా సీమకు సాగు, తాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పీలేరు, ఫిబ్రవరి 8: మండల పరిధిలోని రేగల్లు గ్రామం పించా ఏరు వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సీఐ పెద్దయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పించా ఏరు సమీపంలో సుమారు 50సంవత్సరాలు వయసు కలిగిన ఓ మహిళ మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
తిరుపతి, ఫిబ్రవరి 8: ఎస్వీయూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అడ్వానె్సస్ ఇన్ డేటా సైనె్సస్ అండ్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఎస్వీయూ వీసీ ఆచార్య వి.వి.ఎన్.రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆచార్య ఎస్.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆచార్య అనూరాధ, బిఎఎస్ చైర్మన్ ఆచార్య ఎం.పద్మావతమ్మ, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

13 నుంచి గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, ఫిబ్రవరి 8: స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి తెపోత్సవాలు ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్నాయని టీటీడీ పీఆర్వో డాక్టర్ రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాలని కోరారు.

భక్తిశ్రద్ధలతో శ్రీ సప్తకన్నికలమ్మ ఆలయ మహా కుంభాభిషేకం
* గోపూజతో మహోత్సవాన్ని ప్రారంభించిన ఆలయ చైర్మన్ నటరాజన్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 8 : చిత్తూరు నగరం 75 దొడ్డిపల్లెలో జీర్ణోద్ధరణ చేసిన శ్రీ సప్తకన్నికలమ్మ ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ క్రమంలో ఉదయం ఆలయ పాలకమండలి చైర్మన్ నటరాజన్ ఆధ్వర్యంలో గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయంలో సప్తకన్యలకల అమ్మవారి అష్ఠబంధన మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, సాయంత్రం 6 గంటలకు పాటకచ్చేరి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. పై కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా దేవాదాయశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, మేయర్ కఠారి హేమలత, ఎమ్మెల్సీ రాజసింహులు, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, చిత్తూరు సహకార చక్కర కర్మాగారం చైర్మన్ ఎన్‌పీ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని తదితరులు పాల్గొంటారని తెలిపారు. సంబంధిత కార్యక్రమాలకు చిత్తూరు, పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమంలో దొడ్డిపల్లె కార్పొరేటర్ విఎస్ నళిని, ఆమె భర్త టీడీపీ నాయకుడు తిరుకుమరన్, పాలక మండలి సభ్యులు సురేష్‌కుమార్, మునిరత్నంనాయుడు, ఆర్‌కే రేష్యేంద్ర, ఈశ్వరానంద, కే వనిత, జ్యోతిమలర్, ఎక్స్ అఫిషియో సభ్యులు ఆర్ సుబ్రహ్మణ్యం, ఈవో రమణతో పాటు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

నేడు వికృతమాల వద్ద గృహ సముదాయాలు ప్రారంభం
* రూ. 83.90కోట్లతో నిర్మించిన 1800 జీ ప్లస్ రెండు గృహాలు
* ప్రారంభించనున్న మంత్రులు
ఏర్పేడు, ఫిబ్రవరి 8: మండలంలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక వికృతమాల పంచాయతీ పరిధిలో రూ. 83.90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1800 జీ ప్లస్ రెండు ఎన్టీఆర్ గృహ సముదాయాలను శనివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కాలువ శ్రీనివాసులు, ఎన్ అమరనాథరెడ్డి, గృహనిర్మాణ సంస్థ చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారని తహశీల్దార్ సీవీ సుబ్బన్న శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జీ ప్లస్ గృహాల్లో 1800 కుటుంబాలు నివాసం ఉండే విధంగా అన్ని వౌలిక సదుపాయాలతో నిర్మాణం చేసినట్లు వివరించారు. సిసి రోడ్లు, నీటి సౌకర్యాలు, విద్యుత్, డ్రైన్స్, ప్రహరి, రెండు ప్రాధమిక పాఠశాలలు, రెండు కమ్యూనిటీ భవనాలు, పార్కు, పైలాన్ వంటివి అత్యంత అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీడియో లైవ్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడతారని తెలిపారు.

ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి
* జిల్లాలో ప్రశాతంగా ఈ పక్రియ జరగాలి
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 8: రానున్న ఎన్నికలకు అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని, జిల్లాలో ఈ ఎన్నికల పక్రియ సజావుగా ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు కోడ్ రాక పోయినా జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులంతా ఎన్నికల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లులో నిమగ్నం కావాలన్నారు , అధికారులంతా ఎన్నికల పనులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో నిష్పక్షపాతంగా శాంతియతంగా, నిజాయితీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో కూడా జిల్లాకు దేశ స్థాయిలో మంచి పేరు తీసుకు రావాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు అధికారులు కూడా తమ విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో చిన్న తప్పులు జరిగినా ఎన్నికలు సంఘం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఎన్నిలక సంఘం ఆదేశాల మేరకే అధికారులు నడుచుకోవాలని, ఎన్నకల సమయంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తాము విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించు కోవాలన్నారు. జిల్లాలో ఎన్నికలపై ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులకు వాట్స్‌ప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సమగ్ర సమాచారం అందరికీ చేరువ అవుతుందని చెప్పారు. జిల్లాలో గోడవలు చోటు చేసుకొనే పోలింగ్ కేంద్రాల జాబితాను వెంటనే పోలీసు అధికారులు తమకు అందజేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల తనిఖీలు చేయాలని సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ ఓటర్లకు వౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్నదాన్ని పరిశీలించారు. ఓటర్ల నమోదుకు వచ్చిన క్లెయిమ్స్‌ను నిజాయితీగా పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పరిధిలోని పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచేకొని పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా చిన్నపాటి గొడవ జరగడానికి ఆస్కారం ఉండరాదన్నారు. ఘర్షణలు చోటు చేసుకొనే పోలింగ్ కేంద్రాలపై ఇప్పటి నుంచి నిఘా ఉంచాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ చిన్ని చిన్న గోడవలు జరిగే ప్రాంతాలపై ఇప్పటి నుంచి గట్టి నిఘా ఉంచి బైండవర్ చేసుకోవాలన్నారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో పలువురు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.