చిత్తూరు

నిబంధనల మేరకే టీటీడీ నిధుల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 1: నిధులను నిబంధనల మేరకే వినియోగిస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు టీటీడీ నిధులు తరలిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూ. 3,116.25 కోట్లతో ప్రవేశ పెట్టామని చెప్పారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఖర్చులు పోను మిగిలిన నిధులను ధర్మప్రచార, సంక్షేమ తదితర కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో రూ. 28 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయం, శ్రీ మహాగణపతి ఆలయాల్లో ఈనెల 13న విగ్రహ ప్రతిష్ఠ జరగుతుందని తెలిపారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఇందులో ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతుందని చెప్పారు. కల్యాణానికి లక్షమందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతాయన్నారు. ఈనెల 5, 12 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, 6, 13 తేదీల్లో ఐదు సంవత్సరాల్లోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తామన్నారు. గతేడాది ఫిబ్రరిలో 17.90 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18.87 లక్షల మంది దర్శించుకున్నట్లు చెప్పారు. అలాగే గతేడాది ఫిబ్రవరిలో రూ. 82.27 కోట్లు హుండీ ఆదాయం రాగా, ఈ ఏడాది రూ. 83.11 కోట్లు వచ్చిందన్నారు. గతేడాది ఫిబ్రవరి నెలలో 36.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని, ఈ ఏడాది 42.64లక్షల మందికి అందజేసినట్లు చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరి 75.18 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది 82.06 లక్షల లడ్డూలు అందించడం జరిగిందన్నారు. తిరుమలలో ఫిబ్రవరి 12న జరిగిన రథసప్తమి పర్వదినం నాడు భక్తులకు సేవలందించిన టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఈఓ అభినందనలు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తామని చెప్పారు.

అందరూ వెంట ఉంటామంటేనే
రాజకీయాల్లోకి వస్తా
* టీడీపీ, వైకాపాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి
* ఆత్మీయ సభలో తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి
తిరుపతి, మార్చి 1: తనను రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తున్న నాయకులు, కార్యకర్తలు చివరి వరకు తన వెంట ఉండి, విజయం సాధించడానికి సంపూర్ణంగా సహకరిస్తానంటేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే రాలేనని తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న మేఘనా అపార్ట్‌మెంట్ వద్ద శంకర్ రెడ్డి ఆత్మీయుల సభ జరిగింది. ఈసందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలని ఇప్పటికే టీడీపీ, వైకాపాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయన్నారు. తనకు విద్యార్థి దశ నుంచే సీఎం చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి వారితో సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. నేడు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే పార్టీలు భారీగా సొమ్ము అడుగుతున్నాయన్నారు. తాను టీడీపీలో తిరుపతి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని గుర్తుచేశారు. నేడు ఐదారుకు మించి రావడంలేదన్న విషయం గుర్తించాలని తెలిపారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా, తుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రజలకే అధిక ప్రాధాన్యత ఇచ్చానని, ఆ సంస్థలను ప్రజా సంస్థలుగా మార్చానని చెప్పారు. అందుకే ఆనాడు టీడీపీ విజయానికి ఎదురులేకుండా పోయిందన్నారు. తన అనుచరులంతా తిరుపతిలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను పుత్తూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించారని, ఆయన ఆదేశాలను కాదనలేక తాను పోటీ చేశానన్నారు. నేడు తిరిగి రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుతున్నా తాను త్వరలోనే తిరుపతిలోని అన్ని వార్డులను పర్యటిస్తానని కందాటి శంకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశానికి వచ్చిన వారితోపాటు ఇక్కడకు రాలేని వారిని వారి ఇళ్లవద్దే కలిసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఆతరువాత ఏ పార్టీలోకి వెళ్లాలన్నది నిర్ణయించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తన వెంట చివరి వరకు ఉంటేనే తాను ముందుకు వస్తానంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీవీ రమణ, అన్నా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు మునిరామి రెడ్డి, జేడబ్ల్యు విజయ్ కుమార్, చెంచులక్ష్మి, ఖాదర్ బాషా, విజయలక్ష్మి, దొడ్డారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మునికృష్ణా రెడ్డి, తిరుచానూరు మాజీ సర్పంచ్ నరసింహా రెడ్డి, ముళ్లపూడి మాజీ సర్పంచ్ నరసింహా రెడ్డి, తూకివాకం మాజీ సర్పంచ్ భాస్కర యాదవ్, ఎంపీటీసీ అరుణ, గాండ్ల తెలి, దేవ తెలికుల కార్పొరేషన్ డైరెక్టర్ రుద్రగోపీ, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ సోమశేఖర్
* మరో నలుగురు స్మగ్లర్లు అరెస్ట్
* 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి, మార్చి 1: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని మూడు రాష్ట్రాలకు చెందిన అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులు సమావేశమైన సమయంలోనే ఎర్రచందనం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన టాస్క్ఫోర్స్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న సోమశేఖర్ స్మగ్లర్లకు సహకరిస్తూ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనానికి స్వయంగా ఎస్‌ఐ ఎస్కార్ట్‌గా వ్యవహరించడమే కాకుండా పోలీసుల తనిఖీ సమయంలో ఆ వాహనం మనదేనని చెప్పడం గమనార్హం. దీంతో టాస్క్ఫోర్స్‌లో ఇంకా ఎంతమంది ఇలాంటి అధికారులు, సిబ్బంది ఉన్నారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌ఐ సోమశేఖర్‌తోపాటుగా పట్టుబడ్డ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఈస్ట్‌పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ కే.నాగేశ్వర రావు మాట్లాడుతూ తిరుపతి ఎస్పీ అన్బురాజన్‌కు అందిన పక్కా సమాచారం మేరకు, ఆయన ఆదేశాలతో తాము స్థానిక లీలామహల్ జంక్షన్ వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహించామని చెప్పారు. సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ జయచంద్ర ఇతర సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ సోమశేఖర్ పైలెట్‌గా వ్యవహరిస్తున్న ఏపీ 05 ఈడీ 3648 నెంబర్‌గల ఇన్నోవా, టమోటా గ్రేడ్లలోడ్‌తో ఉన్న ఏపీ 30 ఎక్స్ 8229 నెంబర్ గల వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయన్నారు. ఈ సమయంలో ఆ వాహనాలు మనవేనంటూ ఎస్‌ఐ సోమశేఖర్ చెప్పినా తమకందిన సమాచారం మేరకు ఆ వాహనాలను తనిఖీ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్నారు. అయితే పోలీసులు వాహనాలవైపు రావడం గమనించి ఆ రెండు వాహనాల డ్రైవర్లు వాటిని పోలీసులకు చిక్కకుండా తిరుపతి మున్సిపల్ కార్యాలయం, ఆర్సీ రోడ్డు, అన్నమయ్య సర్కిల్ మీదుగా 150 బైపాస్ రోడ్డు వైపు వెళ్లాయన్నారు. వీటిని పోలీసులు వెంబడించి తనపల్లి క్రాస్ వద్ద అడ్డగించి ఇన్నోవా వాహనంలో ఉన్న 600 కేజీల బరువున్న 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చనసుకున్నామని చెప్పారు. ఎర్రచందనం వాహనాలకు ఎస్కార్ట్‌గా వ్యవహరించి ఇప్పటికే అనేక కేసులో నిందితుడిగా ఉన్న పులిచర్ల మండలం, రామిరెడ్డిగారి పల్లికి చెందిన వినాయక రెడ్డి, కేరళ రాష్ట్రానికి చెందని వి.పి.ఉమర్, వీరికి సహకరించిన టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ సోమశేఖర్, తిరుపతి రూరల్ మండలానికి చెందిన తుపాకుల శివ, తమిళనాడుకు చెందిన డ్రైవర్ ఆండియన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 14లక్షలు ఉంటుందన్నారు. వీరిని అరెస్టు చేశామని, ఎస్‌ఐ సోమశేఖర్‌పై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేశామని వెల్లడించారు. ఈ కేసును మరింతలోతుగా దర్యాప్తు చేపడతామని చెప్పారు.

చిత్తూరులో టీడీపీకి షాక్
* నగర టీడీపీ అధ్యక్షుడు, పలువురు కార్పొరేటర్లు వైకాపాలోకి జంప్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మార్చి 1: చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పలువురు నాయకులు షాక్ ఇచ్చారు. నగర టీటీపీ అధ్యక్షుడు మాపాక్షి మోహన్, పలువురు టీడీపీ కార్పొరేటర్లు శుక్రవారం హైదారాబాద్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా నేత జంగాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు. ఒక్కసారిగా పలువురు టీడీపీ నాయకులు పార్టీని వీడటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు నగర టీటీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న మాపాక్షి మోహన్ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో చిత్తూరు రూరల్ మండల జడ్పీటీసీగా, చిత్తూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడటం అంతుపట్టని రహస్యంగా మారింది. చిత్తూరు కార్పొరేషన్‌కు చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకె బాబు వర్గానికి చెందిన కార్పొరేటర్, చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలానికి చెందిన ఎంపీటీసీలు సైతం ఒక్కసారిగా వైకాపాలో చేరడంతో నగర టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. చిత్తూరు కార్పొరేషన్ ఒకటవ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన శ్రీకాంత్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకె బాబు సతీమణిపై విజయం సాధించి చిత్తూరు నగరంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయన కూడా తాజాగా వైకాపా కండువా కప్పుకోవడం అందరినీ ఆశ్చర్య కలిగించింది. జిల్లా మొదలియార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ సురేష్, అతని సన్నిహితుడైన చిత్తూరు మాజీ మున్పిపల్ చైర్మెన్ భాస్కర్ సైతం వైకాపాలో చేరారు. మొదలియార్ సంఘ అధ్యక్షునిగా ఉన్న బుల్లెట్ సురేష్‌కు చిత్తూరు నగరంలో తన సామాజిక వర్గంలో మంచిపట్టు ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో వివిధ డివిజన్లల్లో బుల్లెట్ అనుచరవర్గమే విజయం సాధిస్తూ వస్తోంది. బుల్లెట్ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా ఆయన వైకాపాలోకి వెళ్లడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుడిపాల మండలం రాసనపల్లికి చెందిన ప్రకాష్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పటం నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేకెత్తించింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు శ్రీకాంత్, రంజితం, సహదేవన్, ముత్తమ్మ, చంద్రయ్య, ఇందు, నవీన్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకె బాబు వర్గానికి చెందిన లత కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఒకేసారి పలువురు టీడీపీ నాయకులు పార్టీని విడనాడంతో రాజకీయ వాతావారణం వేడెక్కింది. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘పార్టీలు మారిన వారితో టీడీపీకి నష్టం లేదు’
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మార్చి 1: చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైకాపాకు వెళ్లిన నాయకులతో పార్టీకి ఎటువంటి నష్టం లేదని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ కఠారి హేమలత అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా పదవులు అనుభవించి స్వార్థంతో ప్రత్యేక ప్యాకేజీలు ఆశించి కొందరు కార్పొరేటర్లు, కొందరు నాయకులు వైకాపాలో చేరినట్లు ఆరోపించారు. వీరివల్ల టీడీపీకి ఎటువంటి నష్టం లేదని, పార్టీ మారిన జనల్లో బలం లేదన్నారు. కేవలం టీడీపీ వల్లనే వారు కార్పొరేట్లర్లగా విజయం సాధించారనే విషయం నగరవాసులకు తెలుసన్నారు. నగర పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన మాపాక్షి మోహన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండుసార్లు మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసిన ఆయన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని ఆరోపించటం, అందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ వర్గానికి చెందిన మోహన్‌కు రెండుసార్లు వరుసగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, నగర పార్టీ అధ్యక్షునిగా పదవులు ఇస్తే నేడు టీడీపీపై నిందలు వేయడం దారుణమన్నారు. ఇటువంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, ఎవరూ ఎటువంటి డ్రామాలు అడినా టీడీపీ విజయం ఖాయమన్నారు. పదవులు అనుభవించి పార్టీ మారిన వ్యక్తులు టీడీపీని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ సుగ్రీ, నాయకులు కఠారి ప్రవీన్, జహంగీర్, జ్యోతి, వెంకటేష్, కమలేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ఆశయం
* మంత్రి అమరనాథరెడ్డి స్పష్టం
* మోడల్ మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి
గంగవరం , మార్చి 1: రైతుల అభివృద్ధే ప్రభుత్వ ఆశయమని మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలోని క్యాటిల్ ఫారం వద్ద 33ఎకరాల్లో నిర్మించే మోడల్ మార్కెట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు అండగా నిలిచారన్నారు. రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ఎక్కడో ఉన్న కృష్ణాజలాలను పలమనేరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత సీఎందేనని చెప్పారు. రైతుల కోసం 9గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. పలమనేరులో నిర్మించే మోడల్ మార్కెట్ రాష్ట్రానికే తలమానికమని, జాతీయ రహదారి సమీపంలో నిర్మిస్తున్న ఈ మార్కెట్ వల్ల తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. రామకుప్పంలో నిర్మించే ఎయిర్‌పోర్ట్ ద్వారా కూడా రైతులు పండించిన పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. వి.టలో కోల్డ్‌స్టోరేజీ నిర్మాణంలో ఉందన్నారు. పలమమనేరు అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఎన్నడూ జరగని అనేక అభివృద్ధి పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయని, ఇందులో మంత్రి చొరవ ఎంతో ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తానుకూడా టీడీపీలో చేరానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్‌కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర, టీడీపీ నాయకులు జాలాజీ, కదిరప్ప, జగదీష్ నాయుడు తదితరలు పాల్గొన్నారు.

ఆంత్రాక్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* ఆంధ్రభూమి వార్తకు స్పందన
* కోదండరామాపురం గ్రామాన్ని సందర్శించిన జిల్లా అధికారులు
కార్వేటినగరం, మార్చి 1: ఆంత్రాక్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ జనార్థన్ రాజు సూచించారు. ఆయన శుక్రవారం కోదండరామాపురం గ్రామంలో ఆంత్రాక్స్ వ్యాధి బాధితులను పరామర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధిపై ఆంధ్రభూమి దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా స్థాయి అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలో గొర్రెలు, మేకలు, పశువులు అనారోగ్యంతో మృతిచెందితే ఈ మాంసాన్ని తినరాదని, వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టాలన్నారు. 5 నెలల క్రితం ఆంత్రాక్స్ వ్యాధితో పశువులు మృతిచెందితే వాటిని కోయడం వలన దళిత వాడలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలిందన్నారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ గురునాధం, వ్యాధి నిర్థారణ కేంద్రం అధికారి పద్మావతి, నాగరాజు, పశువైద్యాధికారి కుమార్, మండల వైద్యాధికారి చక్రపాణిల ఆధ్వర్యంలో పశువులకు, మనుషులకు వ్యాధి నిరోధక టీకాలు వేసి ప్రజలకు అవగాహన సదస్సు కల్పించారు. ఈ గ్రామంలో 10 రోజులుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకురావడంతో రెండురోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణమూర్తి, వైద్యసిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

తిరుమలలో ఇంజినీరింగ్ పనులను తనిఖీచేసిన టీటీడీ ఈఓ
తిరుపతి, మార్చి 1: తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను శుక్రవారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలు, నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి పుష్కరిణి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద మీడియాతో మాట్లాడుతూ నారాయణగిరి ఉద్యానవనాల్లో టైంస్లాట్ సర్వదర్శనం భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడకుండా రూ. 23కోట్లతో చేపడుతున్న శాశ్వత కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. అక్కడ అన్నప్రసాదాలు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తామన్నారు. శ్రీవారి పుష్కరిణి వద్ద ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుచేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ. 4.50 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా మాడవీధుల్లో భూగర్భ కేబుళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సప్తద్వారాల అంశానికి సంబంధించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని ఆర్చిలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద గల సిమెంట్ కాంక్రీట్ ఆర్చిలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుమలలో పచ్చదనం పెంపుకోసం అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం పనులను త్వరలో పరిశీలిస్తామన్నారు. ఇటీవల జరిగిన ఆగమ సలహా మండలి సమావేశంలో రథమండపం నిర్మించాలని తీర్మానం జరిగిందని, రూ.1.50 కోట్లతో ఈ పనులు చేపడతామని ఈఓ తెలిపారు. శ్రీ వరాహస్వామి ఆలయంలో ఏప్రిల్ 24 నుంచి 27వ తేదీ వరకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయనున్నట్లు తెలిపారు.
శ్రీవారి సేవకులు సొంత ప్రాంతాల్లోనూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి - ఈఓ
వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న శ్రీవారి సేవకులు సొంత ప్రాంతాల్లోనూ ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ కోరారు. నూతన శ్రీవారి సేవ భవనంలో శ్రీవారి సేవకులతో ఈఓ మాట్లాడారు. రూ.96కోట్లతో నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలను నిర్మించామని, ఇక్కడ మంచాలు, పరుపులు, సత్సంగం హాలు, రీక్రియేషన్ హాలు, అన్నప్రసాదాలు తదితర అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. వివిధ విభాగాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సేవా విధులు ముగించుకొని ఖాళీగా ఉన్న సమయంలో సేవకులు ధార్మిక జ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా ధార్మిక వెబ్‌సైట్‌లను, ఆధ్యాత్మిక పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. శ్రీవారి సేవకులందరూ టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ వెబ్‌సైట్‌లో సభ్యులుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ తనిఖీల్లో టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

విక్రమ్ అభినందన్ విడుదల సందర్భంగా టీసీసీ సంబరాలు
తిరుపతి, మార్చి 1: భారత వాయుసేన వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ భారతదేశానికి అప్పగించిన సందర్భంగా తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎ.మంజునాథ్, కార్యదర్శి పి.మధుసూధన్ రావు, కోశాధికారి కెవి చౌదరిల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విక్రమ్ అభినందన్ నిజమైన దేశభక్తి కలిగిన సైనికుడని, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు దేశ విమానాన్ని కూల్చాడన్నారు. పాకిస్థాన్ వారికి చిక్కినా ధైర్యసాహసాలతో శత్రుసేనలకు ధీటైన సమాధానం ఇచ్చారన్నారు. అభినందన్ లాంటి ఎందరో వీరు సైనికులకు పుట్టినిల్లు భారత్ అని, పాకిస్థాన్ ఇకనైనా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీసీసీ సభ్యులు వాసుదేవన్, మోహన్, శ్రీనివాసులు, ఎక్స్ సర్సీస్ మెన్ భాస్కర్ రాజు, ఎపీ నాయుడు, రోటరీ క్లబ్ దామోదర్, షేక్ నిజామ్, సాకం నాగరాజు, లైన్స్‌క్లబ్ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు
విక్రమ్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ శుక్రవారం భారత దేశానికి తిరిగి అప్పగించిన సందర్భంగా స్థానిక గోవిందరాజ స్వామి ఆలయ దక్షిణ మాడ వీధిలో శుక్రవారం బీజేపీ నేతలు భారీ ఎత్తున టపాకాయలు కాల్చారు. అలాగే ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ రెడ్డి, జిల్లా కోశాధికారి అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టమంచి చంద్రబాబు యాదవ్, నగరి ఇన్చార్జ్ సుబ్రమణ్యం యాదవ్, నగర అధ్యక్షుడు వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుబాల హర్షవర్థన్, జిల్లా ఉపాధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్, నాయకులు ఆకేపాటి నారాయణ రెడ్డి, నాగినేని చంద్రయ్య, దీపక్ యాదవ్, చంద్ర, మునస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ జిల్లాపర్యటనను విజయవంతం చేయండి
చిత్తూరు, మార్చి 1: జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని చిత్తూరు నగర జనసేన పార్టీ నాయకులు కోరారు. నగర జనసేన పార్టీ నాయకులు, ప్రచార కమిటీ ఇన్‌చార్జ్ ఆరణి కళాబాబు, పుష్ప, రెహమాన్, దయారాం తదితరులు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీనేత పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటన శనివారం మధ్యాహ్నం 12గంటలకు మదనపల్లె నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మదనపల్లెలో రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడతారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పుంగనూరు, నాలుగు గంటలకు పలమనేరు పట్టణంలో రోడ్‌షో జరుగుతుందన్నారు. సాయంత్రం 6గంటలకు చిత్తూరు నగరంలో రోడ్‌షోతో పాటు గాంధీసర్కిల్ వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న పవన్‌కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కూకటివేళ్లతో పెకలించేందుకే తమ నాయకుడు పార్టీని స్థాపించారన్నారు. ఆయనకు జిల్లాప్రజలు మద్దతు ప్రకటించాలని కోరారు. చిత్తూరు నగరంలో భూసేకరణ చట్టాన్ని విస్మరించి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డువిస్తరణ పనులు చేపట్టడాన్ని వ్యతిరేకించి, విస్తరణ చేయకుండా నిలిపించిన మహానాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు స్వప్న, పోతపాల రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

4న సీఎం చంద్రబాబు మదనపల్లె పర్యటన
* జలహారతి, బహిరంగసభ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పరిశీలన
మదనపల్లె, మార్చి 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 4వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జాయింట్ కలెక్టర్ గిరీషా, సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి మదనపల్లె మండలం పొన్నూటిపాళెం పంచాయతీ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, రామిరెడ్డిగారిపల్లె టెనె్నల్, హంద్రీ-నీవా కాలువలో కృష్ణజలాల పరుగుల తీరును పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో సమీక్ష జరిపారు. సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. హెలీప్యాడ్, బహిరంగసభ ఏర్పాట్లను వెంటనే మొదలుపెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ జలాశయానికి హంద్రీ-నీవా కాలువ నుంచి వస్తున్న కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే ప్రాంతంలో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని హంద్రీ-నీవా అధికారులను ఆదేశించారు. బహిరంగసభ ఏర్పాట్లపై జలవనరుల శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల వెంట హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకటేష్‌రావు, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, జీఎం అనీల్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.