తూర్పుగోదావరి

రబీకి పెట్టుబడి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 28: అల్పపీడన ప్రభావంతో దెబ్బతిన్న ఖరీఫ్ పంట కారణంగా రెండో పంటకు పెట్టుబడి సమస్య వచ్చిపడింది. మిల్లర్ల నుండి లెవీ బియ్యాన్ని తీసుకునే విధానాన్ని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుండే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రద్దుచేయటంతో ఖరీఫ్ పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తిప్పలుపడుతున్నారు. నిబంధనల సడలింపు ఉత్తర్వులు ఇప్పటికీ విడుదలకాకపోవటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్న రైతులు, ధాన్యం కమీషన్ ఏజంట్లుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కనీస గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడే చేతికందని పరిస్థితుల్లో, రైతులకు రబీకి పెట్టుబడి దొరికే పరిస్థితి కనిపించటం లేదు. ఖరీఫ్ సాగు కోసం బ్యాంకుల నుండి తెచ్చుకున్న రుణాన్ని తీర్చే దారిలేకపోవటంతో, రబీ పంటకు మరోసారి బ్యాంకులు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించటం లేదు. కౌలు రైతులు ఖరీఫ్ సాగు పెట్టుబడికే ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన నేపథ్యంలో, మరోసారి రబీ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఖరీఫ్‌కు ఇచ్చిన అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న కౌలు రైతులకు రబీ సాగుకు అప్పు ఇచ్చేందుకు ప్రయివేటు వడ్డీ వ్యాపారులు కూడా సుముఖంగా లేరు. దాంతో రబీ సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కౌలు రైతులు ఉన్నారు. బ్యాంకుల నుండి రుణం తీసుకుని ఖరీఫ్ సాగు చేసిన భూమి యజమానులైన రైతులు, రబీ సాగు కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో రైతులు రబీ సాగుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. రైతులకు ఖరీఫ్ పంటలో కన్నా రబీ పంటలోనే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అలాంటి రబీ పంట సాగుచేసుకునేందుకు ఇపుడు పెట్టుబడి సమస్య వచ్చిపడింది. నిబంధనల సడలింపు ఉత్తర్వులు త్వరగా వెలువడితే కనీసం పెట్టుబడయినా చేతికి దక్కేదని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దారుణంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి డెల్టాలో పూర్తి ఆయకట్టుకు అనుమతినిచ్చినప్పటికీ, రబీ సాగు చేపట్టలేని పరిస్థితుల్లో గోదావరి రైతులు ఉంటారని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అర్హతగల రేషన్‌కార్డులకు హోలోగ్రామ్‌లు
కాకినాడ, నవంబర్ 28: జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే అర్హతగల రేషన్‌కార్డులన్నింటికీ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం హోలోగ్రామ్‌లు అతికించే ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం జెసి తహసీల్దార్లతో కలెక్టరేట్ నుండి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీ నుండి జాతీయ ఆహార భద్రత చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలులోకి రానున్నాయన్నారు. జిల్లాలో 14.95 లక్షల కుటుంబాలకు గాను 10.79 లక్షల కుటుంబాలు ఈచట్టం పరిధిలోకి రానున్నాయన్నారు. ఈ మూడు నెలల కాలంలో రేషన్ సరుకులు తీసుకోని కార్డులను మినహాయించి మిగిలిన వాటన్నింటికీ ఈ హోలోగ్రామ్‌లు అతికించాలన్నారు. సమావేశంలో డిఆర్వో బి యాదగిరి, డిఎస్‌ఒ జి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

డిజిటల్ ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు
జెసి సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 28: ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్ ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో శనివారం కామన్ సర్వీస్ సెంటర్ 2.0 (మీసేవ) ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి జెసి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్, స్మార్ట్‌వార్డ్ ఏర్పాటులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ సెంటర్ ద్వారా అన్ని ప్రభుత్వ సర్వీసులను అందించనున్నట్టు తెలిపారు. అన్ని శాఖల ప్రభుత్వ సేవలను మీసేవ ద్వారా పొందవచ్చని, ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు వివిధ రకాల సేవలందించడం ఈ కామన్ సర్వీస్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రైతుల వివరాలను పూర్తిగా నమోదు చేశామని, వారు ఎక్కడినుండైనా ఆన్‌లైన్ విధానంలో తమ భూమి వివరాలను పరిశీలించుకోవచ్చన్నారు. మీసేవ సెంటర్‌ను ప్రజలకు అనుకూలమైన వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ అధికారి శ్రీహర్ష, టెక్నికల్ టీమ్ లీడర్ ఎం కుమార్, ఈ-గవర్నెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ జెసితో సమస్యలు పరిష్కారం
కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన డయల్ యువర్ జెసిలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 ఫోన్‌కాల్స్ రాగా జెసి వాటిని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయల్ యువర్ జెసికి అందిన ప్రతి అర్జీని అత్యంత జాగ్రత్తగా స్టడీచేసి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అందే ప్రతి ఒక్క అర్జీకి సకాలంలో న్యాయం జరుగుతున్న భావన ప్రజల్లో కలిగేవిధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి యాదగిరి, డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు, వివిధ శాఖల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు
ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
రాజమండ్రి, నవంబర్ 28: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా, బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఈసంఘటన శనివారం తెల్లవారుజామున దివాన్‌చెరువు సమీపంలో 4వ వంతెనపై జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం విశాఖపట్నం నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సు ముందు వరుసలో కూర్చున్న తిరుపతికి చెందిన ఎస్‌విఎస్ శ్రీరామ ఆదిత్య(20), చిలకలూరిపేటకు చెందిన కె శ్రీనివాస్, కె సాంబశివరావుతో పాటు డ్రైవర్, క్లీనర్‌లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆదిత్య మృతి చెందాడు. ఆదిత్య విశాఖపట్నంలోని గీతం కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదిత్య తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆసుపత్రి వాతావరణం హృదయవిదారకంగా కనిపించింది.
అర్బన్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు
ఏలూరు రేంజి డిఐజి హరికుమార్
పెద్దాపురం, నవంబర్ 28: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు ఉన్నందున ఈ ప్రాంతాల్లో అర్బన్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజి డిఐజి హరికుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన స్థానిక డిఎస్పీ కార్యాలయం, పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏలూరు రేంజీ పరిధిలో 600 కానిస్టేబుళ్లు, 80 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇటీవల ప్రభుత్వం పోలీసు నియామకాలకు అనుమతులు మంజూరు చేసిందని, త్వరలోనే నియామకాలకు చర్యలు తీసుకుంటామన్నారు. విలీన మండలాల్లో సిబ్బంది సర్దుబాటు వల్ల జిల్లాలో పోలీసుల కొరత ఉందన్నారు. అనాధిగా డిఎస్పీ కార్యాలయం అద్దె భవనంలో నిర్వహించడం విస్మయం కలిగించిందన్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో నాలుగు పోలీసుస్టేషన్లకు గాను మూడు స్టేషన్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, త్వరలోనే శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షించడంలో పోలీసులు మరింత శ్రద్ధ కనబరచాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ రాజశేఖర్‌రావు, ఎస్సైలు సతీష్, మురళీకృష్ణ, సిఐ శ్రీ్ధర్‌కుమార్, అడిషనల్ ఎస్సై ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
వైభవోపేతంగా భీమేశ్వరుని తెప్ప మహోత్సవం
సామర్లకోట, నవంబర్ 28: పవిత్ర కార్తీక మాసంలో భాగంగా స్థానిక పంచారామక్షేత్రంలోని భీమేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం (ఆరుద్రా)ను పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామివారి ఆలయ కోనేరులో తెప్ప మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ పుష్కరిణి గట్టు వద్ద వేదికపై ఉంచి తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ ప్రత్యేక పూజలను ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తదితర ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం స్వామివారి అమ్మవారి విగ్రహాలను సుందరంగా విద్యుత్ అలంకరణలతో రూపొందించిన తెప్పపై అధిష్టించి ఘనాపాఠీ శ్రీపాద రాజశేఖర శర్మ, అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వరశర్మ, అర్చకులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు వెంకన్న, సుబ్బన్న, లచ్చన్న, చెరకూరి రాంబాబు తదితరులు మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల భద్రతా ఏర్పాట్లను పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్, ఎస్సైలు ఆకుల మురళీకృష్ణ, వై సతీష్‌లు పర్యవేక్షించారు.
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ద్వారా అధిక ఆదాయం
సిపిసిఆర్‌ఐ
డైరెక్టర్
చౌడప్ప
అంబాజీపేట, నవంబర్ 28: కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తే రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని సిపిసిఆర్‌ఐ (కాసరగడ్, కేరళ) డైరెక్టర్ డాక్టర్ పి చౌడప్ప అన్నారు. అంబాజీపేట మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన కొబ్బరి రైతుల సదస్సు జరిగింది. కొబ్బరిలో అంతర పంటల సాగు, మూల్యవృద్ధిపై జరిగిన ముఖాముఖి సమావేశంలో చౌడప్ప మాట్లాడుతూ పచ్చి కొబ్బరినుండి పాలు తీసే పరిశ్రమలు ఏర్పాటుచేస్తే పశువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించు కోవచ్చన్నారు. ఇప్పటికే యూరప్ దేశాలలో ఈ పాలను వినియోగిస్తున్నారని, దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని రుజువైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.5 లక్షల హెక్టార్లలో కొబ్బరిసాగు అవుతుండగా కేవలం కోనసీమలో సుమారు లక్ష హెక్టార్లు ఉందన్నారు. కొబ్బరి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నేటికీ సాంప్రదాయ పద్ధద్దతులనే వాడటం ఈ పరిస్థితికి కారణమన్నారు. ఇందుకు రైతులు విలువ ఆధారిత ఉత్పత్తులను చేస్తూ కొబ్బరి అనుబంధ పరిశ్రమల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఎకరం కొబ్బరితోటలో కల్పరస తయారు చేస్తే సాలుకు 1.5 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చన్నారు. కల్పరస తయారీకి ఆబ్కారీ శాఖనుండి అనుమతి పొందాలన్నారు. దేశంలో ప్రధానంగా నాలుగు రాష్ట్రాలలో కొబ్బరి 90 శాతం ఉత్పత్తి అవుతోందని, 94 శాతం ఉత్పాదన ఉన్నప్పటికీ కేవలం ఆరు శాతం మాత్రమే విలువ ఆధారిత వస్తువులు తయారవుతున్నాయన్నారు. ఈ మొత్తం 30 శాతం నుండి 40 శాతానికి పెరగాలన్నారు. ఈ వృద్ధికి సిపిసిఆర్‌ఐతో పాటు సిడిబిలు సహాయం చేసేందుకు సిధ్దంగా వున్నాయన్నారు.సిపిసిఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్ నిర్ణయం తీసుకోవాల్సివుందన్నారు. ఈ సదస్సులో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, సిడిబి డిప్యూటీ డైరెక్టర్ జయనాధ్, సభ్యులు జవహర్‌ఖాన్, ఎఎంసి ఛైర్మన్ అరిగెల బలరామమూర్తి, జడ్పీటీసీ బొంతు పెదబాబు, సొసైటీ అధ్యక్షులు గణపతి వీరరాఘవులు, ఎంపిపి డివివి సత్యనారాయణ, సర్పంచ్ సుంకర సత్యవేణి, బికెఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీల్, జిల్లా అధ్యక్షులు దొంగ నాగేశ్వరరావు, పూర్వాంధ్ర అధ్యక్షులు ఉప్పగంటి భాస్కరరావు, జలగం కుమారస్వామి, మద్దింశెట్టి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.