డైలీ సీరియల్

బంగారు కల 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!..’’
ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్ర స్థాయిలో విన్పిస్తోంది.
తెల్లారితే బస్ హంపీ నగరాన్ని చేరుతుందంటే అమృతకి చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. బస్‌లో అంతా నిద్ర మూడ్‌లోకి జారుకుంటున్నారు. అభిషేక్ కూడా హంపీ గురించే ఆలోచిస్తున్నాడని అమృతకి తెల్సు. రాత్రి పదవుతోంది. దాదాపు నలభై మంది ప్రయాణిస్తున్న ఆ టూరిస్టు బస్ తెల్లవారితే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నదని వాళ్దిద్దరికీ అన్పిస్తున్నదంటే ఆ స్థలం వాళ్లకి ఎంత ప్రీతిపాత్రమైందో మరి!
‘అభీ!’ మెల్లగా పిల్చింది అమృత.
‘ఊ..’ అభిషేక్ బదులిచ్చింది ఒక్క అక్షరమే అయినా అమృత మీద ప్రేమంతా రంగరించి అన్నట్లుంది.
‘‘ఇప్పుడు నీకేమన్పిస్తుంది’’ అతని భుజంమీద వాలి కళ్లు మూసుకుంది.
‘‘మనం మనదైన లోకంలోని కాలానికి వెళ్లిపోతున్నాం అమ్మూ’’ ట్రాన్స్‌లో ఉన్నట్లు అన్నాడు.
‘‘నిజంగా అపుడు ఉండే ఉంటాం అభీ!’’ అమృత రెప్పల కింద సినిమా రీళ్ళలాగా... అనేక దృశ్యాలు కన్పిస్తున్నాయి.
‘‘అమ్మూ!’’ మంద్రంగా హస్కీ వాయిస్‌తో పిలిచాడు అభిషేక్.
అలా పిలిస్తే అమృతకెంత ఇష్టమో అతనికి తెలుసు. నాగస్వరానికి ఆడే నాగినిలా అయిపోయింది అమృత.
‘‘చెప్పు అభీ!’’
‘‘రేపట్నుంచి మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని నాకన్పిస్తుంది’’.
‘‘అవును అభీ.. నాక్కూడా’’
‘‘మనం ఇన్నాళ్లుగా కన్న కలలు నిజం కాబోతున్నాయంటే.. ఓహ్ నమ్మలేకుండా వున్నాను’’ ఉద్వేగంగా అన్నాడు అభిషేక్.
‘‘అవును అభీ! మనం యూనివర్సిటీ స్టూడెంట్స్‌గా ఏ క్షణంలో కలిశామో... ఆ ఘడియ అద్భుతమైంది అభీ. ఎందరో అక్కడ చదువుకుంటారు. కాని మనలాగా చరిత్రలోకి ప్రయాణించే వాళ్ళుంటారా! అన్పిస్తుంది.’’’
‘‘అవును అమ్మూ! నీకు చెప్పాను గుర్తుందా! మొదటిసారి ఫీల్డ్‌వర్క్ కోసం నేను హంపీ వచ్చినపుడు ఎంత ఆశ్చర్యపోయానో! క్లాసులో ప్రొఫెసర్ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నేను చూసినవే అన్పించింది’’.
‘‘అవును అభీ! మనం ఈ సామ్రాజ్యంలో పుట్టామనే నా నమ్మకం’’
‘‘ఏదో పరీక్షల కోసం చదివాను, రాశానుగానీ ఇద్దరం కల్సి హంపీ ఎప్పుడు వస్తామా అని నా మనస్సు అని వేగిరిపడుతోంది’’
‘‘అవును అభీ! పెళ్ళయితే గానీ ఇలా కల్సిరాలేదేం కదా!’’

‘‘కళాకారులుగా కల్సి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఈ అనుభవం వేరు. చదువుకన్నా నీ నాట్యమే నన్ను నీ దగ్గరికి చేర్చింది అమ్మూ’’
‘‘నీ పాట కోసమే నా పాదాలు ఎప్పుడూ ఎదురు చూస్తాయి అభీ!’’
‘‘రేపటినుంచి మనం మనదైన అద్భుత ప్రపంచంలో విహరిద్దాం’’
అభిషేక్ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు.
‘‘అందుకే గదా! హనీమూన్ ఎక్కడికి వెళ్తారు? అని నాన్న అడిగితే ‘హంపీ’ పేరు చెప్పాను’’ కొంచెం సిగ్గుపడింది అమృత.
‘‘అంతా నవ్వారు తెలుసా! శిథిలాల్లో హనీమూనా అని’’ అభిషేక్ అల్లరిగా చూశాడు.
‘‘నువ్వెక్కడుంటే అదే నా స్వర్గం అభీ! మనం కలలు కన్న కళా ప్రపంచంకన్నా మనకింకేం కావాలి చెప్పు’’’ తన్మయంగా అంటున్న అమృత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు అభిషేక్.
నవదంపతుల మనసులు పరస్పరం ఊసులాడుకుంటుంటే నిద్రలోకి జారుకున్నారు.
బస్ రాత్రి చీకటిని లైట్ల కత్తులతో చీలుస్తూ పరిగెడుతోంది. రాబోయే రోజు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని తెలీని ఆ యువ జంట ఆదమరచి నిద్రపోతున్నది.
తెలతెలవారుతోంది. సూరీడు కూడా బద్ధకిస్తున్నట్లు ఇంకా పూర్తిగా పక్కమించి లేవలేదు. బస్‌లో లైట్లేసి హారన్ కొట్టాడు డ్రైవర్. అంతా నిద్రలేచి గమ్యం చేరినట్లు గుర్తించారు.
‘‘అభీ! హంపీ అదే హాస్పేట్ వచ్చేశాం’’ అమృత అతన్ని నిద్రలేపింది ఆనందంగా.
అభిషేక్ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. అంతా దిగుతున్నారు. పెద్ద లగేజీలన్నీ బస్ డిక్కీలోంచి తీస్తున్నారు.
అమృత, అభిషేక్‌లు బస్ దిగారు.
ఎదురుగా హోటల్ ప్రియదర్శిని. టూరిజం ప్యాకేజీ సభ్యులుగా అందరికీ డబుల్ బెడ్ ఎసి రూంలు కేటాయించారు. అంతా వెళ్ళాక రిసెప్షన్‌లో కొంచెంసేపు ఆగి అభిషేక్ తనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. రూంకి వచ్చి ఇద్దరూ రిప్రెష్ అయ్యారు. రూంకే బ్రేక్‌ఫాస్ట్ తెప్పించుకుని తిన్నారు.
‘‘అభీ! మనం అడిగినట్లు విడిగా ఒక కారు ఏర్పాటయిందా?’’
‘‘ఆ! ఒక గైడ్ కూడా’’
‘‘మనకి గైడ్ ఎందుకు? అభీ! నువ్వున్నావుగా’’

-ఇంకావుంది

-చిల్లర భవానీదేవి