మెయన్ ఫీచర్

‘మధ్య తరగతి’ పెదవి విరుపు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరుక్షణం ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, పేదలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని వర్గాలకు రాయితీలు ప్రకటించిన జైట్లీ తమను పూర్తిగా విస్మరించారని ముఖ్యంగా మధ్య తరగతి వారు వాపోయారు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నది తామే అయినా తమను పట్టించుకోలేదని వీరు విమర్శలు గుప్పించారు. భారతీయ జనతాపార్టీకి తొలినుండి దన్నుగా ఉంటున్న తమను విస్మరించి, ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా వుంటున్న పేదలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించారన్న నిరసనలు మధ్య తరగతి జీవుల్లో చెలరేగుతున్నాయి. భాజపా పాలిత రాష్ట్రాలలో ఆందోళనలకు దిగుతున్న రైతులు, వ్యవసాయ ఆధారిత వర్గాలను ఆకట్టుకునేందుకు జైట్లీ ప్రయత్నం చేశారని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అటువంటి ప్రయత్నం చేయకుండా ఉండలేదు. ఆ ప్రయత్నాల వల్ల సంబంధిత వర్గాలకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందన్నది వేరే విషయం.
బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని ఉద్యోగులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నా వారికి ఫలితం దక్కలేదు. దీంతో ఉద్యోగులలో సహజంగానే అసంతృప్తి చెలరేగింది. ‘మా ఓట్లు లేకుండా, మా సహకారం లేకుండా మోదీ మళ్లీ ప్రధాని అవుతారా?’ అంటూ మొన్నటివరకు ఆయనకు వీరాభిమానులుగా ఉన్నవారు సైతం ఇప్పుడు శపించడం ప్రారంభించారు. దేశ జనాభాలో మధ్య తరగతి వారు ఇప్పుడు 10 శాతంగా ఉన్నప్పటికీ, 2040 నాటికి వీరు 70 శాతం నుండి 80 శాతానికి పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఏ సమాజంలోనైనా మధ్య తరగతి ప్రజల సంక్షేమంతోనే ఆ దేశ పురోభివృద్ధి ఆధారపడి వుంటుందని ఆర్థికవేత్తలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారు అటు పేదలకు, ఇటు ధనికులకు మధ్య వారధులుగా ఉంటారు. పేదల పట్ల సానుభూతి చూపి, వారి ఉన్నతి కోసం ఆరాటపడేది వీరే కావడం గమనార్హం. జీతాలు, పెన్షన్లు పొందుతున్నవారు ఆదాయపు పన్ను పరిమితి గురించి బడ్జెట్‌లో జైట్లీ ప్రస్తావించకపోవడంతో కంగుతిన్నారు. వాస్తవానికి దేశంలో తక్కువ పనికి ఎక్కువ జీతాలు పొందేవారెవరైనా ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పాలి. వారికి ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు వంటి అవకాశాలు ఇతర రంగాలో దాదాపుగా లేవని చెప్పవచ్చు. ప్రైవేటు రంగంలో భారీ జీతాలు పొందే ఐటి ఉద్యోగులు రాత్రికి రాత్రి నిరుద్యోగులుగా మారడం మనం చూస్తునే ఉన్నాం.
కేంద్రీయ విద్యాలయాలలో ఒక్కొక్క విద్యార్థి చదువుకు కేంద్ర ప్రభుత్వం రూ.40వేలకు పైగా ఖర్చుపెడుతోంది. అంత భారీ వ్యయం హైదరాబాద్ వంటి నగరాలో ఉండే కార్పొరేట్ పాఠశాలలో కూడా పెట్టడం లేదు. ఆదాయపు పన్ను పరిమితిని మాత్రమే కాకుండా ఇటువంటి పలు సదుపాయాలను సైతం ఉద్యోగుల విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఉన్నత చదువులు చదివి, మంచి నైపుణ్యం ఉన్నవారు అనేకమంది నామమాత్రపు జీతాలకు పనిచేస్తుండడం తెలిసిందే. అయినా పనిపట్ల నిర్లక్ష్యం, నిరాసక్తత చూపడంలో ప్రభుత్వ ఉద్యోగులను మించినవారెవ్వరూ ఉండరు. బలమైన యూనియన్లు ఉండడంతో వారిని ప్రశ్నించే సాహసం ఏ ప్రభుత్వం చేయదు. చివరకు అనైతిక పనులకు పాల్పడినా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం చాలా అరుదు. పన్ను రాయితీలు కల్పించకపోయినా ఉద్యోగులను విస్మరించి జైట్లీ ప్రభుత్వాన్ని నడపగలరని ఆశించలేము. అందుకే వారికి అంతకన్నా ఎక్కువ ప్రయోజనం కలిగించే అనేక రాయితీలు కల్పించారు. గత నాలుగేళ్లుగా ‘మిగులు డబ్బు’ను మధ్య తరగతి చేతుల్లోనే పెడుతూ వస్తున్నామని జైట్లీ పేర్కొనడం గమనార్హం. దీనికి సంబంధించి కొన్ని చర్యలను గమనించాల్సిందే.
ఉదాహరణకు 2013లో గృహ రుణాలపై వడ్డీలు 9.5 నుండి 11.25 శాతం వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎస్‌బిఐ 8.5 శాతానికి తగ్గించింది. మిగిలిన బ్యాంకులు కూడా దాదాపు అదే రీతిలో తగ్గించాయి. ఇంటి నిర్మాణానికి రూ. 30 లక్షల రుణం తీసుకొంటే, కనీసం 2 శాతం వడ్డీ తగ్గినా తద్వారా ఏటా రూ.45 వేలు మేరకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రయోజనం ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకే కదా ఎక్కువగా వర్తించేది! 2013లో సగటున వినియోగ ధరల సూచిక 10.92 శాతంగా ఉండగా, ఇప్పుడు 2.49 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువుల ధరలు తగ్గితే కలిగే ప్రయోజనాన్ని ఎవరైనా సులభంగా అంచనా వేయవచ్చు. 2013లో ద్రవ్యలోటు 4.1 శాతంగా ఉంటే, ఇప్పుడు 3.3 శాతానికి దిగింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారి సంఖ్యతో పాటు ఎగుమతులు, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థలో కదలిక ఏర్పడుతుంది. దీంతో కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఈ వర్గాలకే చేరుతాయని గమనించాలి.
మనమంతా ఆందోళన చెందవలసింది పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూ ఉండడం. 2013లో ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.78.46కాగా, ఇప్పుడు 81రూపాయలకు చేరింది. డీజిల్ ధర కూడా ఎనిమిది రూపాయలు పైగా పెరిగింది. జైట్లీ ఆర్థిక మంత్రిగా వచ్చిననాటికన్న ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు 40 శాతానికి పైగా తగ్గినా, దేశంలో మాత్రం ఎప్పటికన్నా ఎక్కువగానే ధరలున్నాయి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి గత ఆరు నెలల్లో అంతర్జాతీయంగా 70 శాతం మేరకు ధరలు పెరిగాయని మాత్రమే చెబుతున్నారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను పరిమితి రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షలకు పెరుగుతుందని ఎదురుచూశారు. ఆ విధంగా జరిగితే ఉద్యోగులు సాలీనా రూ.2,500 వరకూ పొదుపు చేసే అవకాశం ఉండేది. ఇతరత్రా లభించిన ప్రయోజనాలతో పోల్చితే అదంత ఎక్కువ మొత్తమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ మొత్తం వ్యక్తిగతంగా చాలా చిన్నదే అయినా ప్రభుత్వం మాత్రం రూ.15,750 కోట్ల మేరకు ఆదాయం కోల్పోవలసి వస్తుంది. దాని ప్రభావం బడ్జెట్‌పైన ఎక్కువగానే ఉంటుంది. ఆ మొత్తం ద్రవ్య లోటుకు తోడయితే ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది.
యూపీఏ హయాంలో 2006 నుండి 2009 వరకు ఆదాయపు పన్ను పరిమితిని రూ.1.6 లక్షల నుండి రూ.2 లక్షలకు పెంచారు. ప్రస్తుత ప్రభుత్వం 2014లో రూ. 2 లక్షల నుండి రూ.2.5 లక్షలకు పెంచింది. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వమే ఎక్కువ పన్ను రాయితీ కల్పించింది. మోదీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న రాయితీలను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి. వారికి ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. ఇంటి ఋణం పరిమితిని రూ.2 లక్షలకు, రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వచ్చే ఆదాయంపై చెల్లించవలసిన పన్నును 10 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. వీటన్నిటికి మించి సాధారణ తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.40 వేలుగా పేర్కొన్నారు.
హృద్రోగులకు అమర్చే స్టెంట్ ధరలను రూ.1.5 లక్షల నుండి రూ.35 వేలకు తగ్గించారు. మోకాళ్ల శస్తచ్రికిత్సకు వ్యయాన్ని రూ.1.5 లక్ష నుండి రూ.45 వేలకు మార్చారు. ఏటా రూ.333 ప్రీమియంకు రూ.2లక్షల బీమాను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ ప్రయోజనాలు ఉద్యోగ, మధ్యతరగతి వారికి వర్తించవా?
మరే వర్గం కన్నా ఉద్యోగ, మధ్యతరగతి వర్గాల వారికే ప్రభుత్వం ఎక్కువ ప్రయోజనం కల్పించినట్లు భావించవలసి వస్తుంది. వాస్తవానికి రైతులు, పేదలు, అణగారిన వర్గాలకు భారీ పథకాలు ప్రకటించినా వాటికి అవసరమైన నిధుల కేటాయింపు జరగకపోవడం గమనించాలి. ఏ దేశంలోనూ లేనంతగా చాలా తక్కువ ఆదాయపు పన్ను మన దేశంలోనే ఉందని ఆర్థిక మంత్రులు తరచూ అంటుంటారు. అదనపు పన్నుల భారం మోపకుండా ఉదారత ప్రదర్శిస్తున్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు. అయితే ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు, జీడీపీ వృద్ధిని బట్టి ఇదంతా ఆధారపడి ఉండదని గమనించాలి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా పేరుపొందిన భారత్‌లో 73 శాతానికి పైగా సంపద కేవలం ఒక శాతం మంది సంపన్నుల వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేయడం ఆందోళన కలిగించే అంశం.
గత రెండు దశాబ్దాలలో మన జీడీపీ ఆరు రెట్లకుపైగా పెరిగినట్లు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక ప్లీనరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గర్వంగా పేర్కొన్నారు. అయినా దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలు ఘోరంగా ఉన్నాయి. పెరుగుతున్న ఆర్థిక తారతమ్యాలను ఒక హెచ్చరికగా అందరూ భావించాలి. వీటిని సరిచేయలేని పక్షంలో మన సమాజం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఈ పరిస్థితులను చూస్తుంటే అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి కోసం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీడీపీ, వృద్ధిరేటు పెరుగుదలనే అభివృద్ధిగా పరిగణించాలా?
భారతీయ బ్యాంక్‌లలో నిరర్థక ఆస్తులు రూ.9.5లక్షల కోట్ల మేరకు ఉన్నట్లు తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే ప్రభుత్వం అరచేయి అడ్డుపెట్టి అడ్డుకోని పక్షంలో ప్రధాన బ్యాంకులన్నీ మూతబడడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం అవుతుంది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉన్నదని గ్రహించాలి. ఈ ప్రమాదకర పరిస్థితుల నుండి బైటపడవేయగల సామర్థ్యం, సాహసం మన పాలకుల వద్ద కనిపించడం లేదు. ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికే బడ్జెట్‌ను రూపొందించే పాలకులు ఉన్నంతకాలం ఇటువంటి ప్రమాదాలను అధిగమించలేము.
*

chitram...
2013లో గృహ రుణాలపై వడ్డీలు 9.5 నుండి 11.25 శాతం వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎస్‌బిఐ 8.5 శాతానికి తగ్గించింది. మిగిలిన బ్యాంకులు కూడా దాదాపు అదే రీతిలో తగ్గించాయి. ఇంటి నిర్మాణానికి రూ. 30 లక్షల రుణం తీసుకొంటే, కనీసం 2 శాతం వడ్డీ తగ్గినా తద్వారా ఏటా రూ.45 వేలు మేరకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రయోజనం ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకే కదా ఎక్కువగా వర్తించేది! 2013లో సగటున వినియోగ ధరల సూచిక 10.92 శాతంగా ఉండగా, ఇప్పుడు 2.49 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువుల ధరలు తగ్గితే కలిగే ప్రయోజనాన్ని ఎవరైనా సులభంగా అంచనా వేయవచ్చు.

-చలసాని నరేంద్ర 98495 69050