ఈ వారం కథ

కృతజ్ఞతలా? ఫిర్యాదులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి తిరిగి వచ్చిన సూరజ్ చెప్పిన మాటలు విన్న తల్లి చెప్పింది.
‘‘ఏమిటిది? వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. అందరిమీదా ఫిర్యాదులు చేస్తున్నావు. ఇంగ్లీషు టీచర్ పాఠం అర్థం అయ్యేలా చెప్పలేదని, నీ పక్కన కూర్చున్నవాడి సాక్స్ కంపుకొట్టాయని, నీ పెన్ రీఫిల్ మధ్యలో రాయడం ఆగిపోయిందనీ.. ఇవాళ ఫిర్యాదుల దినంలా ఉంది’’.
సూరజ్ బదులుగా నవ్వాడు.
‘‘ఈ రోజుని ఫిర్యాదుల దినం బదులు దేవుడికి కృతజ్ఞతలు చెప్పే దినంగా మార్చచ్చు కదా?’’ ఆమె ఆలోచనగా చెప్పింది.
‘‘దేవుడికి కృతజ్ఞతలు చెప్పే దినమా? అంటే?’’ సూరజ్ అడిగాడు.
ఆమె చిన్నగా నవ్వి తన వంక ఆసక్తిగా చూసే కొడుకుతో చెప్పింది.
‘‘నువ్వు అందరిమీదా గొంతు చించుకుని ఫిర్యాదులు చేసినట్లుగానే దేవుడ్ని గొంతుచించుకుని పొగడచ్చుగా? ఇవాళ వర్షం కురిపించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. వేడి బాగా తగ్గింది కదా?’’
‘‘అవును. కానీ నా బూట్లకి బురద అంటింది’’.
‘‘అదిగో మళ్లీ.. ఇది ఫిర్యాదుల రోజు కాదు, కృతజ్ఞతల రోజు’’ ఆమె చిరుకోపంగా చెప్పింది.
తర్వాత ఆలోచించి ఓ కాగితం, పెన్సిల్‌ని కొడుక్కి ఇచ్చి చెప్పింది.
‘‘దేవుడు నీకు ఆనందం కోసం ఏం విలువైనవి ఇచ్చాడో ఆలోచించి అందుకు ఆయన్ని పొగిడే జాబితాని తయారుచెయ్యి. నాకు వంట పనుంది. రాత్రి భోజనం అయ్యాక ఆ జాబితాని చూపించు’’.
ఆమె వంట గదిలోకి వెళ్ళాక సూరజ్ ఆలోచించి రాసాడు.
‘‘దేవుడు నాకు రోజూ ఆహారం ఇస్తున్నందుకు కృతజ్ఞుడ్ని..’’
అలా వాడు జాబితాని రాసాక గట్టిగా అరిచాడు.
‘‘అమ్మా! ఇంకో కాగితం ఇవ్వు’ చాలా పెద్ద జాబితానే రాసాడు.
ఆఫీస్ నుంచి ఇంటికివచ్చిన భర్తని ఆమె అడిగింది.
‘‘ఆఫీస్‌లో ఎలా గడిచింది?’’
‘‘ఏం బాగాలేదు. ముందుగా వర్షానికి బట్టలు తడిసాయి. తర్వాత..’’
‘‘దేవుడ్ని కీర్తించు నాన్నా’’ సూరజ్ అరిచాడు.
తండ్రి ఆశ్చర్యంగా చూస్తే చెప్పేడు.
‘‘ఇవాళ దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, పొగిడే రోజు తప్ప ఫిర్యాదులు చేసే రోజు కాదని అమ్మ చెప్పింది’’.
‘‘మీ అమ్మని పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ప్రతీరోజు మనకి రుచికరంగా వంట చేసే నైపుణ్యాన్ని ఇచ్చినందుకు కూడా ’’ అతను నవ్వుతూ చెప్పాడు.
తల్లి కూడా నవ్వి చెప్పింది.
‘‘పిర్యాదులు చేసే కంటే, వారు చేసిన మంచిని గుర్తుతెచ్చుకుని పొగడటం మనకి, మనవాళ్ళకి కూడా మంచిది’’.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి