శ్రీవిరించీయం

దిగజారిన చేతనం-నక్షత్ర శాంతి పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుటుంబాన్ని ఉద్ధరించడం చేతకాదు కాని, దేశాన్ని ఉద్ధరిస్తాడట! .. కన్నబిడ్డకు గ్లాసెడు పాలు తేలేడు కాని, దేశంలో అందరికీ తిండి పెడతాడట!’ - ఈ మాటలు అన్న మనిషి చదువురానివాడు, చదవనేర్వనివాడు కాదు నాలుగు వేదాలు పుక్కిట పట్టిన మహా పండితుడు శ్రీ సుబ్రహ్మణ్యశాస్ర్తీ. అష్టాదశ పురాణాలు సత్సాఖ్యానంగా చెప్పగలవాడు. అయితే ఆయన యిప్పుడు ‘్భర్య చనిపోవడంతోనూ, తన పాండిత్యానికి విలువ తగ్గడంతోను అదోరకమైన విరక్తితో హైదరాబాదులోని కొడుకు దగ్గరకు చేరుకున్నాడు. ఈ సన్నివేశం శ్రీ రెంటాల నాగేశ్వరరావు వ్రాసిన ‘తిలదానం’ కథానికలో సందర్భపడుతుంది. అంత పండితుడి కొడుకు హైదరాబాద్‌లో బి.ఏ చదవడంతో పాటు మార్క్స్ పౌరసత్వం అంతా కూడా చదివి ‘నక్సలైట్’గా మారిపోయాడు. అతని ఆకారం ఇప్పుడు చూచినవాళ్లెవరూ అతని తలమీద యాభై వేల రూపాయల బహుమానం- అతని ఆచూకీ చెప్పినవారికి- యిస్తారని ఊహించరు. ‘నెరిసిన గెడ్డం, నలిగిన లాల్చీ పైజమా, భుజానికి గుడ్డ సంచి, పీక్కుపోయిన కళ్లు’- అదీ అతని ఆకారం. సన్నగా పొడుగ్గా వున్న ఆ వ్యక్తిని పట్టిస్తే- సజీవంగాగానీ, నిర్జీవంగా గానీ- ఏభైవేల రూపాయల బహుమతి యిస్తుంది ప్రభుత్వం!
శ్రీ సుబ్రహ్మణ్య శాస్ర్తీ కొడుకుకు - దొంగచాటుగా ఇంటికి వచ్చిన వాడికి స్వాగతం చెప్పలేడు. అతడు ఇవ్వచూపిన డబ్బును స్వీకరించలేడు. మార్క్స్‌ను అర్థం చేసుకున్న మనిషి ఆయన. భారతదేశంలో నవ సమాజ స్థాపన సాధ్యంకాదని ఆయన సకారణంగా వివరించిన విషయం తెలుసుకున్నాడు. పూర్వపు ఉన్నతి పోగొట్టుకుని యిప్పుడు బతుకుతెరువు కోసం అతి హీనం అని అందరూ అనుకునే ‘తిలదానం’ తీసుకోవడానికి జంకనివాడు- నిత్య గాయత్రీ మంత్రజపం, యజ్ఞ లంపటం అంతా యధావిధిగా నిర్వహించేవాడు.
నక్సలైట్ కొడుకు ‘రఘురాం’కు కొడుకు పుట్టాడు అదీ మూలా నక్షత్రంలో. దీనికి గొప్ప శాంతి జరిపితే తప్ప, తండ్రో తాతో యింకెవరయినా చనిపోవడం ఖాయం అని శ్రీ శాస్ర్తీకి నిఖార్సుగా తెలుసు. అయితే రుూ శాంతి జరపటానికి బోలెడు డబ్బు కావాలి, తోటి బ్రాహ్మల సహకారం కావాలి. తిండికి ఎత్తుకుంటున్న మనిషి, నవగ్రహ పూజలు- మూల శాంతులు చేయగలగడం- చేయాలని సాహసించడం- అందరికీ ఎగతాళిగా, వేళాకోళంగా, అసాధ్యం అయిన కార్యక్రమంగానే గోచరం అవుతుంది. అదీ ఆ శాంతి కార్యక్రమం అతి త్వరలో - రెండు రోజుల్లోనే జరపాలి. అవధాని అనే ఆయన శాస్ర్తీగారి పాండిత్య గరిమకు, ఎస్ట్రనామికల్ విజ్ఞానానికి అచ్చెరువుపడి యిందుకు సహకరించ ప్రయత్నిస్తాడు. ‘అందరు పంచాంగకర్తలు రాసిన దానికంటే, వేళ్లతో లెక్కించి స్వతహాగా చెప్పగల మేధావి సుబ్బయ్య! తను గాని తన శిష్యులుగానీ ముహూర్తాల దగ్గరనుంచి తద్దినాల వరకు వాటిపైనే ఆధారపడతారు. అవి తప్పయితే! కేవలం నోటి లెక్కలతో గ్రహస్థితులు కచ్చితంగా చెప్పగలిగాడంటే ఆయన మహాపురుషుడు!’ అని తీర్మానించుకుంటాడు అవధాని.
కోడలును జ్వరపడ్డ పసివాడితో ఆస్పత్రికి వైద్యం కోసం పంపి, ఈ వృద్ధుడు పద్మాససం వేసుకుని యజ్ఞక్రతువు కొనసాగిస్తాడు. రఘురాం భార్యకు అంత్య సందేశం పంపాడు ఒక ఉత్తరం ద్వారా. ‘తను లొంగిపోతున్నాననీ, ప్రభుత్వం ఇచ్చే బహుమానం రమేశ్ అనే స్నేహితుడు తీసుకుని కుటుంబానికి అందిస్తాడనీ, దానితోనయినా సుఖంగా బతకండి. నా బిడ్డకు మంచి భవిష్యత్తు నివ్వు. నాన్న ఛాందసుడు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకో. ఎన్‌కౌంటర్‌లో మరణించకుండా వుంటే మళ్లీ కలుద్దాం’- అనేదే ఆ సందేశం.
‘మూలా నక్షత్రం వెళ్లిపోయింది. పిల్లవాడిని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. బాబును తీసుకుని తల్లి ఇంటికి వచ్చేసరికి బ్రహ్మమూర్తులయిన సుబ్రహ్మణ్య శాస్ర్తీగారి భౌతికకాయానికి ఘనంగా నివాళులు అందిస్తున్న, అర్పిస్తున్న అవధానీ ఆయన బృందం ఎదురవుతుంది. ‘క్రతువు పూర్తిచేస్తూనే యోగంతో ప్రాణాలు విడిచిన’ వృద్ధ బ్రాహ్మణుడు ఆయన. ఆమెకు డబ్బు అందించాల్సిన ‘రమేశ్’ ఎన్నాళ్లకు రాడు. ‘అతను ఎప్పటికీ రాడని ఆమెకు తెలియదు. డబ్బు పాపిష్ఠిది కదా మరి!’ అన్న వాక్యాలతో కథ అంతం అవుతుంది.
మారుతున్న సామాజిక స్థితిగతులనీ, ఎంతమాత్రం మారని కుతంత్రాల మానసిక పరిస్థితిని- సమాంతరంగా- సాదృశంగా చూపించే కథ. కొంతమందినయినా ఆలోచింపచేయగలిగితే, నవ సమాజ నిర్మాణం అంత కష్టసాధ్యం కాదు. ఆలోచించడం అనే సందర్భాన్ని మనిషి మర్చిపోయి చాలాకాలం అయింది కదా!