ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దేశ ద్రోహులను సమర్థించటమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం కోసం సియాచిన్‌లో పహరాకాస్తూ మంచు తుపాను కారణంగా 25 అడుగుల లోతు మంచులో కూరుకుపోయిన వీర సైనికుడు హనుమంతప్ప ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే సరిగ్గా అదేరోజు రాత్రి ప్రతిష్టాత్మక జె.ఎన్.యు క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులు హిందుస్తాన్ ముర్దాబాద్, అఫ్జల్‌గురు జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. మన దేశంలో ఉగ్రవాద దాడులు నిర్వహిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా మహిళా విభాగం సభ్యురాలు ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టటం, జవాహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం, భారత ప్రెస్ క్లబ్‌లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి శిక్షితుడు అఫ్జల్ గురును పొగడుతూ హిందుస్తాన్ ముర్దాబాద్, భారత దేశాన్ని సర్వనాశనం చేస్తాం, అఫ్జల్ గురు లక్ష్యాన్ని సాధిస్తాం అంటూ భారత్ వ్యతిరేక నినాదాలు ఇచ్చిన వారిని సమర్థించటం దేశ ద్రోహం కాదా? వాక్ స్వాతంత్రం పేరుతో అఫ్జల్ గురును ప్రశంసలతో ఆకాశానికి ఎత్తుతూ అల్లా కరుణిస్తే భారత దేశం వంద ముక్కలు కావటం ఖాయమంటూ నినాదాలు ఇవ్వటం దేశ ద్రోహం కాదా? ఇషత్ జహాన్‌ను సమర్థించే వారు, అఫ్జల్ గురును సమర్థించే వారిపై పోలీసులు చర్య తీసుకోవడం తప్పా?
ప్రస్తుతం అమెరికా జైల్లో ముప్పై ఐదు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న పాక్-అమెరికన్ ఇస్లామిక్ ఉగ్రవాది, 2611 ముంబాయి దాడుల కేసులో నిందితుడు డేవిడ్ హెడ్లీ ముంబయి కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇస్తూ ఇషత్ జెహాన్ లష్కరే తయ్యబా ఉగ్రవాది అనేది వెల్లడించటం తెలసిందే. హెడ్లీ ఈ నిజాన్ని వెల్లడించనంత వరకు ఇషత్ జెహాన్‌ను కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఎన్.జి. ఓలు అమాయకురాలిగా చిత్రీకరించాయి. ముస్లింల ఓట్ల కోసం బి.జె.పిని తిట్టిపోశాయి. ఇషత్ జెహాన్, ఆమె స్నేహితుడు జావేద్ గులాం షేక్, ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఆమ్జద్ అలీ రాణా, జీషాన్ జోహార్‌లను గుజరాత్ పోలీసులు అహమ్మదాబాద్ సమీపంలో తప్పుడు ఎన్‌కౌంటర్ చేసి చంపారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ, బి.జె.పి సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీని హత్య చేసేందుకు ఇషత్ జహాన్ మిగతా ముగ్గురు కుట్ర చేశారన్నది గుజరాత్ పోలీసుల ఆరోపణ.
మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం ఇషత్ జెహాన్ ఎన్‌కౌంటర్‌పై సి.బి.ఐ దర్యాప్తు జరిపించింది. బి.జె.పి ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షాతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులను జైలుకు పంపించింది. పలువురు ఐ.బి, సి.బి.ఐ మాజీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. దేశ ద్రోహులను వేటాడే వారిని వేటాడటం ఘోరం కాదా? కాంగ్రెస్ అధినాయకత్వం 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగే లోగా బి.జె.పి సీనియర్ నాయకులను జైలుకు పంపించాలనే ఆలోచనతో ఇషత్ జెహాన్ ఎన్‌కౌంటర్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కుట్ర చేసిందంటూ అప్పట్లో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించిన సంచలన నిజాలతో నిజమవుతున్నాయి. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న లష్కరే తయ్యబా తీవ్రావాదులు ఇషత్ జహాన్ కోసం కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాల నాయకులు ఇంత గొడవ చేయటం ఘోరం. డేవిడ్ హెడ్లీ వెల్లడించిన నిజాల నేపథ్యంలో ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌పై గొడవ చేయటం తప్పేనని కాంగ్రెస్ ఇప్పుడు ఒప్పుకుంటుందా? చేసిన ఘోరమైన తప్పుకు దేశానికి క్షమాపణ చెప్పగలదా? ఇషత్ జహాన్ లష్యరే తయ్యబా ఉగ్రవాది అయినంత మాత్రాన తప్పుడు ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తారా అంటూ వాదిస్తున్న ఎన్.జి.ఓ నాయకులపై దేశ ద్రోహం కేసు పెట్టటం మంచిది. ఉగ్రవాదులని తెలిసిన తరవాత కూడా పోలీసులు చర్య తీసుకోకూడదా? దేశ ద్రోహులను దేశ ద్రోహులుగానే పరిగణించాలి తప్ప వారి మానవ హక్కుల గురించి మాట్లాడటం మంచిది కాదు.
ఇషత్ జహాన్‌ను సమర్థించిన వారే ఇప్పుడు పార్లమెంటుపై దాడికి కుట్ర చేసి ఉరికంబం ఎక్కిన అఫ్జల్ గురును సమర్థిస్తున్నారు. అఫ్జల్ గురు సంస్మరణార్థం సంతాప సభలు పెట్టి దేశ వ్యతిరేక నినాదాలు ఇస్తున్న వారిని వెనకేసుకు వస్తున్నారు. జె.ఎన్.యు, ప్రెస్ క్లబ్ అఫ్ ఇండియాలో అఫ్జల్‌గురు సంస్మరణార్థం ఏర్పాటు చేసిన రెండు వేరు, వేరు సభల్లో దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చిన వారిని కూడా కాంగ్రెస్, వామపక్షాలు వెనకేసుకు వస్తున్నాయి. అల్లా కరుణిస్తే భారత దేశం వంద ముక్కలవుతుందంటూ నినాదాలు ఇచ్చిన వారు దేశ ద్రోహులు అవుతారా? కాదా? అనేది కాంగ్రెస్, వామపక్షాల నాయకులు చెప్పాలి. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు పార్లమెంటుపై జరిపిన దాడిలో అఫ్జల్ గురు ప్రధాన పాత్ర నిర్వహించినందుకు ఉరి శిక్ష పడింది. దేశ ద్రోహ నేరతో ఉరికంబం ఎక్కిన వారి సంస్మరణార్థం జె.ఎన్.యు, ప్రెస్ క్లబ్‌లో సభలు నిర్వహించటం దేశ ద్రోహం కాదా? దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలా? వద్దా?
జె.ఎన్.యులో ఆఫ్జల్ గురు సంస్మరణార్థం సభ నిర్వహించి దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేయటాన్ని కాంగ్రెస్ వామపక్షాలు రాజకీయం చేయటం సిగ్గు చేటు. ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను తమ రాజకీయావసరాలకు వాడుకున్నట్లే ఇప్పుడు జె.ఎన్.యు అరెస్టులను కూడా రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. భారత వ్యతిరేక నినాదాలు ఇచ్చినందుకు అరెస్టు అయిన వారిని కాపాడేందుకు జె.ఎన్.యులోని విద్యార్థులందరిపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించటం సమర్థనీయం కాదు. మైనారిటీ ఓట్ల, రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని, దేశ భద్రతను పణంగా పెట్టే వారిని దేశ ప్రజలు క్షమించరనేది ఈ రాజకీయ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.