ధర్మసందేహాలు

గోత్రము, సూత్రము అననేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పురాణ పురుషులలో ఎవరు మంచి గురువులు?
- వి.రామానుజం, సూర్యాపేట
గురువుల విషయంలో ఇలా తారతమ్య విచారణ చేయడం పెద్దలకు సమ్మతమైన పద్ధతి కాదు. అందుకనే విప్రులు నిత్యమూ ఆచరించవలసిన బ్రహ్మయజ్ఞాంగమైన దేవర్షి పితృ తర్పణంలో ‘‘కృష్ణద్వైపాయనాదయో యే ఋషయఃతాన్ ఋషీన్ తర్పయామి’’అనే వాక్యం ద్వారా కృష్ణద్వైపాయనాదులైన మహర్షులంతా సద్గురువులే, నిత్య స్మరణీయులే, పూజనీయులే అని మనకు బోధింపబడుతోంది.
* విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం పారాయణ చేసిన తర్వాత ఫలశృతి చదవాలా? - సి. రఘుఠామ్, సూర్యాపేట
మంత్రోపదేశ పూర్వకంగా ఆయా సహస్రనామ స్తోత్రాల ఉపదేశం పొందినవారు వాటికి గల పూర్వపీఠికా, ఉత్తర పీఠికా, ఫలశృతి ఇత్యాదులను పఠించాలి. ఇతరులు కేవలం స్తోత్ర పారాయణ మాత్రమే చేయాలి అని మంత్ర శాస్తవ్రేత్తలు చెపుతున్నారు.
* గోత్రము- సూత్రము అనగానేమి? మహర్షులకు కూడా సూత్రా లుంటాయా? - గణపతి, రాజమండ్రి
గోత్రమంటే వంశోత్పాదకులైన ఆదిమహర్షులలో మొదటి మహర్షి పేరు. ఆ వంశవృక్షంలో ఇతర ప్రధాన ఋషులను గోత్రప్రవరులు అంటారు. ఉదాహరణకు కౌండిన్య గోత్రానికి కౌండిన్యుడు గోత్రఋషి. వాశిష్ఠుడు, మైత్రావరుణుడు అనేవారు ప్రవర ఋషులు. ఇక ధర్మశాస్త్ర నిర్ణయకర్తలలో ధర్మసూత్రకర్తలు అత్యంత ప్రాచీనులు. వీరు వేదశాఖలన్నిటిలోని ధర్మభేదాలను పరిశీలించి, పరిష్కరించి ధర్మసూత్ర గ్రంథాలను రచించారు. వీరిలో ఒక్కొక్క సూత్రకర్తను కొన్ని కుటుంబాలకు ప్రధాన సూత్రకర్తగా వ్యాస భగవానుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయానే్న ఇప్పటికీ విప్రులంతా పాటిస్తున్నారు. ఈ సూత్రకర్తనే సంగ్రహంగా సూత్రమని వ్యవహరిస్తుంటారు. ఆపస్థంభ, ఆశ్వలాయన, బోధాయనాదులు ప్రముఖ సూత్రకర్తలు.
* అక్రమమార్గాలలో ధన సంపాదన చేసి దానిలో కొంత భాగం దేవుడికి చందాకడితే ఆ పాపం పోతుందా? దానిని భగవంతుడు స్వీకరిస్తాడా? - అవదాసు సత్యనారాయణ, పెద్దాపురము
ఏ శాస్త్రాలూ ఈ విధంగా చేయమని చెప్పలేదు. కానీ అక్రమ ధనార్జన చేసినవారు దానిలో ఎంతోకొంత దైవార్పణ చేస్తుంటే దాన్ని నిరోధించడంలో కూడా ఔచిత్యం లేదు. ఇలాంటివన్నీ తామసిక దానాలలోకి వస్తాయి. ఇలాంటి దానాలు చేయగాచేయగా సాత్విక దానం చేసే భాగ్యం వారికి కలుగుతుంది. అపుడు వారి దానాన్ని భగవంతుడు పరిపూర్ణంగా స్వీకరిస్తాడు.
* సూర్యచంద్ర గ్రహణములు సంభవించినప్పుడు దేవాలయాలను మూసి ఉంచడానికి కారణమేమిటి? - శివాజీరావు, హైద్రాబాద్
ఆ సమయంలో కొన్ని అవాంఛిత విష కిరణాలు ప్రసరిస్తాయని ఈనాటి ఆధునిక వైజ్ఞానికులు కూడా అంగీకరిస్తున్నారు. ఆ కిరణాలలో కొన్ని ఆధ్యాత్మిక వ్యతిరేక కిరణాలు కూడా వున్నాయని మన మహర్షులకు తెలుసు. అందుకనే ఆ సమయంలో దేవతావిగ్రహాలను దర్భలతో ఆచ్ఛాదన చేసి, తలుపులు మూసి వుంచటం అనే ప్రక్రియను మహర్షులు రూపొందించారు. ఈరోజులలో విగ్రహాలను పూర్తిగా దర్భలతో ఆచ్ఛాన చేయలేక కొన్ని దర్భలను మాత్రమే ప్రధాన స్థానంలో వుంచి మిగిలిన నియమాలను పాటిస్తున్నారు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
ధర్మసందేహాలు

ఇంటి నెం. 11-13-279,
రోడ్ నెం. 8, అలకాపురి,
హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి