మెయన్ ఫీచర్

అధికారం కోసం అనైతిక మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్ పరిణామాలు చివరకు ఏ విధంగా ముగుస్తాయన్నది అట్లుం చి, అన్ని పార్టీలు కలిసి దేశ ప్రజలకు ఒక మాట ఇస్తే బాగుంటుంది. ఇకనుంచి తాము ఎట్టి పరిస్థితుల్లో, ఏ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపిల ఫిరాయింపుల కోసం ప్రయత్నించబోమని, ఒకవేళ కేంద్రంలో అధికారం నెరపుతున్నట్లయితే ఆర్టికిల్ 356ను నిజమైన రాజ్యాంగ స్ఫూర్తితో తప్ప ఉపయోగించబోమని, ఇతర పార్టీల ప్రభుత్వాలను యుక్తుల ద్వారా పడగొట్టమని వారంతా దేశానికి హామీ ఇవ్వాలి. అందుకు శాశ్వతంగా కట్టుబడాలి. ప్రస్తుతం అధికారంలో గల బిజెపి, నిన్నటి వరకు అధికారం నెరపిన కాంగ్రెస్‌తో సహా ప్రతి ఒక్కరూ ఈ పనిచేసి అందుకు బద్ధులు కావాలి. దేశ ప్రజలకు వారి ప్రకటన పట్ల విశ్వాసం కలగాలంటే మరొక పని చేయాలి. ఇంతవరకు తాము ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకు, ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఆర్టికిల్ 356ను దుర్వినియోగ పరచేందుకు చేసిన ప్రయత్నాలన్నింటికి క్షమాపణలు చెప్పాలి. నిర్ద్వంద్వంగా, బేషరతుగా చెప్పాలి.
అధికార ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వివిధ చట్టాలను, నైతిక విలువలనూ భ్రష్టు పట్టించడంలో మన రాజకీయ పార్టీలన్నీ దోషులే. ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఇతరపార్టీల ప్రభుత్వాలను కూలదోయడం, ఆర్టికిల్ 356ను దుర్వినియోగ పరచడం అనే మూడు విధాలైన నేరాలకు అందరూ పాల్పడిన వారే. వీరిలో ‘ఒరిజినల్ సిన్నర్’ కాంగ్రెస్ కావడం, అందువల్ల బాధితులైన వారు తాము ధికారానికి వచ్చినప్పుడు తిరిగి అదేపని చేయడం వంటి చరిత్ర అంతరికీ తెలిసిందే. దానినక్కడ వివరించి చెప్పుకోవలసిన అవసరం లేదు. అందరూ తమ అధికార ప్రయోజనాల కోసం అనైతికతకు పాల్పడిన వారేనని మాత్రం గుర్తిస్తే సరిపోతుంది.
ఇటువంటివి మునుముందు చేయబోమని అందరూ కలిసి దేశానికి నోటిమాటగా హామీ ఇచ్చినందువల్ల, ప్రయోజనమేమిటనే సందేహం కలగవచ్చు. కావలసింది కట్టుదిట్టమైన చట్టాలని భావించవచ్చు. ఒక విధంగా నిజమే అయినా, అందువల్ల ఉపయోగం లేకుండా పోతున్నదన్నది కూడా మనకు అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. చట్టాలు చేసి ప్రజలను భ్రమపెడుతున్నది వీరే, వాటిని రకరకాల ఎత్తుగడలతో వమ్ము చేస్తున్నది కూడా వీరే. మన నాయకుల ధాటికి ఇంతవరకు ఏ చట్టం, నిబంధన కూడా నిలవలేదు. అందువల్ల వారిపై ప్రజలకు వత్తిడి తెచ్చి వారి మాటనే నమ్ముకోవలసిన పరిస్థితి ఉన్నట్లు తోస్తున్నది. పౌరులకు తీవ్ర నిస్పృహ కలిగినప్పుడు చేసేది అదే.
వాస్తవానికి అదనపు చట్టాలతో నిమిత్తం లేకుండా మొదటి నుంచి రాజ్యాంగంలో గల 356వ నిబంధన ఒక్కటి చాలు, మన పార్టీలు, నాయకత్వాలు, నీతిగా వ్యవహరించదలచుకుంటే. రాజ్యాంగాన్ని తయా రు చేసిన వారిలో వీరంతా ఉన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడవలేని పరిస్థితి ఏర్పడితేనో, లేక అత్యయిక పరిస్థితి ముందుకు వస్తేనో తప్ప సదరు ప్రభుత్వాన్ని రద్దు పరచకూడదని ఆ నిబంధన స్పష్టంగా చెప్తున్నది. అందులోని అక్షరాలలో గాని, స్ఫూర్తిలోగాని అస్పష్టత లేదు. దానిని విడదీసి ఈ సాంకేతికార్థంతో పాటు రాజకీయ అర్థాన్ని కూడా చెప్పుకోవడం కష్టం కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాం గ బద్ధంగా నడవలేక పోవడం అనే దానిలో మెజారిటీని కోల్పోవడం అనే రాజకీయ స్థితి ఒకటి. అది సహజమైన రీతిలో జరగవచ్చు, అసహజంగా సృష్టించవచ్చు కూడా. అధికార పక్షంలో, లేదా కూటమిలో నిజంగానే తీవ్రమైన సిద్ధాంతపరమైన, విధానపర విభేదాలు ఏర్పడితే అది ఒక సహజక్రమం అవుతుంది. కాని జరుగుతున్నది ఆ పేరిట కృత్రిమంగా విభేదాలను, చీలికలను సృష్టించడం. చీల దలచుకున్న వారిది, చీలిక సృష్టించ దలచుకున్న వారిది కూడా అధికార దాహమే.
మన రాజకీయాలలో ఒకసారి ఈ అధికార దాహస్థితి ఒకసారి పరిమితులను దాటి పెచ్చరిల్లిన తరువాత రాజ్యాంగ నిబంధనలు, వాటి స్ఫూర్తి నిరర్ధకంగా మారిపోయాయి. వాటికి రకరకాల వక్రభాష్యాలు చెప్పగల మేధావి న్యాయకోవిదులు మనకు చాలామంది ఉన్నారు. అన్ని సార్లూ కాకపోయినా ఒక్కోసారి అందుకు ఆమోద ముద్రలు వేసే న్యాయమూర్తి దేవతలూ ఉన్నారు. సిగ్గులేని వారికి తమ సిగ్గులేని తనమే ఒక స్థితిలో సిగ్గు కలిగించినట్టు, మన నాయకులు ఒక దశలో ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. తేవడానిక తెచ్చి ప్రజలనుంచి ప్రశంసలైతే పొందారు కాని, అంతమాత్రాన సహజ స్వభావమైన అధికారదాహం అంతరించదుగదా. కనుక, రాజ్యాంగాన్ని వక్రీకరించినట్లే క్రమంగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా తెలివిగా భంగపరచడం మొదలు పెట్టారు. తమ చర్యలలో ఎంతో సృజనాత్మకత చూపారు. వాటిని సమర్థిస్తూ చేసిన తెలివైన వాదనలతో మనకు మతి పోగొట్టారు. పాత చట్టంలోని కొన్ని లోపాలను సవరిస్తున్నామంటూ కొత్త చట్టం తెచ్చారు. దానిని సైతం సరికొత్త పద్ధతులలో భ్రష్టు పట్టించారు. నిజానికి వారి ఉద్దేశమే భ్రష్టు పట్టించడం. చట్టాలు, సవరణలు ప్రజలకు భ్రమలు కలిగించేందుకు మాత్రమే. ఎందుకంటే మన రాజకీయ జాతికి అధికార దాహం సత్యం, మిగిలినవన్నీ మిథ్యమాత్రమే. లేనట్లయితే రాజ్యాంగంలోని తొలి నిబంధనల రూపం, అంతగా అవసరమైతే తొలి ఫిరాయింపుల నిరోధక చట్టం, బొమ్మైకేసులో సుప్రీంకోర్టు తీర్పు సరిపోయి ఉండేవి. 356వ అధికరణ దుర్వినియోగంపై జస్టిస్ సర్కారియా చేసిన వ్యాఖ్యలు వీరిని దారిన పెట్టి ఉండేవి.కాని ఇవన్నీ కొరగానివిగా మారి అదే స్థితి మళ్లీమళ్లీ తలెత్తుతున్నదంటే అధికార దాహం అంతగా వారి మూలాల్లోకి, రక్తంలోకి, నాడుల్లోకి, ఊపిరిలోకి చేరి విడదీయరానిదిగా మారిపోయిందన్నమాట.
ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో, దేశం స్వతంత్రమై దశాబ్దాలు గడిచేకొద్దీ ప్రజాస్వామిక వ్యవస్థ మెరుగుపడటానికి బదులు ఈవిధంగా క్షీణించడానికి మూలాలెక్కడ ఉన్నట్టు? పాప చేతిని చీమ కుట్టడానికి గల కారణాలను, లేదా చేప ఎండక పోవడానికి గల కారణాలను అనే్వషించుకుంటూ పోతే సత్యాలు వెలికి వచ్చినట్టు, ప్రస్తుతం మనం చర్చిస్తున్న సమస్యకు న్యాయబద్ధంగా, సమర్థంగా జరగకపోవడంలో కనిపిస్తాయి. ఆ విధంగా జరగనందువల్లనే పాలకులకు, ప్రజలకు మధ్య దూరాలు ఏర్పడడం మొదలైంది. దూరాలు ఏర్పడటం, పాలకుల అధికారానికి ముప్పు తెచ్చింది. ముప్పు రావడంతో అధికారాన్ని కాపాడుకునేందుకు ఉపాయాలు పన్నవలసి వచ్చింది. ఆ ఉపాయాలను అమలు చేసే క్రమంలో అనేకం భంగపడిపోయాయి. అట్లా భంగపడిన వాటిలో సాక్షాత్తు రాజ్యాంగం ఒకటి. చట్టాలు ఒకటి. నైతిక విలువలు ఒకటి. అంతిమంగా ప్రజాస్వామ్యం ఒకటి.
ఆ విధంగా అధికారం కోసం అన్నింటిని భంగపాటుకు గురి చేయడమే ఒక ధర్మం గా మారింది. వ్యవస్థ భంగపడి, వారు వీరని గాక అందరూ ఆ ఊబిలో, దాని సృష్టి లో, నిర్వహణలో, అందువల్ల లభించే కష్టసుఖాలలో భాగంగా మారిపోయినప్పుడు ఇక మాట్లాడేదేమున్నది? పాపమేది, పాపి ఎవరు? పాపం నుంచి నిష్కృతి ఏది, ఆర్తత్రాణ పరాయణుడెవడు? అదే గుంపునుంచి మనకు మధ్యమధ్య వినిపించే హాహాకారాలు, నీతి బోధనలు, సూచనలు, శాపనార్థాలు, ప్రతిజ్ఞలు అన్నీ ఒక మహానాటకం. వారంతా ఒకరికొకరు తీసిపోని మహానటులు. ‘ఒక్కొక్కడూ మహా హంతకుడు’ అని ఒక కవి మరొక సందర్భంలో ఆవేదన చెందినటువంటిదే ఈ పరిస్థితి కూడా. చేప ఎండకపోవటానికి గల కారణాలను వెతుకుతూ మూలాలకు చేరాయి గనుక, గొంగడిలో తింటూ వెంట్రుకలు ఏరరాదనే సామెత ఎంత అర్థవంతమైనదో, అనుభవపూర్వకమైనదో మనకు తెలిసి రావాలి. అందువల్ల, సమస్యకు గల ఏకైక పరిష్కారం మూలాలు మారడం. మార్చుకోవడం. అది జరగకుండా ఎన్ని చట్టాలు చేసుకున్నా పరిస్థితి ఇదేవిధంగా ఉంటుం ది. సమస్య కొత్త రూపాలలో తలెత్తుతుంది. మరొక మాటలో చెప్పాలంటే అధికారదాహ పీడితులు కొత్త విధానాలుగా తమ కార్యాన్ని నెరవేర్చుకుంటూనే ఉం టారు. ప్రజలు చేయవలసింది పార్టీలు ఏవైనా సరే వౌలికంగా ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగానికి, చట్టాలకు బద్ధమైన పరిపాలన సాగించాలని వత్తిడి చేయడం. అది జరిగితే కర్ర వంకరలను వేడి దీర్చినట్టు రకరకాల అవలక్షణాలనేకం సర్దుకుంటాయి వాంటతట అవే.
ఉత్తరాఖండ్ కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ కె.ఎం. జోసెఫ్, వి.కె. బిష్త్ ఆ కేసు విచారణ సాగిన మూడు రోజుల తర్వాత ఈ నెల 21న తీర్పు చెప్పిన రోజున కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయ పరిణామాల క్రమంలో కొందరు కాంగ్రెస్ సభ్యుల ‘తిరుగుబాటు’’, వారి ‘బహిష్కరణ’, సభలో బలాబలాల పరీక్ష, స్పీకర్ పాత్ర, గవర్నర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్టప్రతి పాత్ర వంటి వివరాలు ఏమిటి? వాటిలోని చట్టబద్ధతను, న్యాయాన్యాయా లు ఏమిటి? అనే మీమాంసలు ఎట్లున్నా వాటన్నింటిని ‘‘ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, రూల్ ఆఫ్ లా’’ అనే విస్తృత సందర్భంలో భాగంగా పరిశీలించవలసి ఉం టుందని ప్రకటించారు వారు. ఆ మేరకు అదే మూలస్థితి. అంతకన్న ముందుకు వెళ్లి వారు పైన అనుకున్నట్లు పరిపాలనలోకి వెళ్లలేదు గనుక, ఇంతవరకు పరిమితమై ఆలోచించినట్లయితే, మన వివిధ పార్టీల నాయకత్వాలకు కనీసం ఈ పరిమిత స్పృహ అయినా లేకపోవడం దేశానికి ఒక శాపంగా మారింది. ఆ మాటను 1989 నాటి బొమ్మై కేసు తర్వాత వారికి తిరిగి అంత బలంగా గుర్తు చేసినందుకు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలపాలి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)