డైలీ సీరియల్

పచ్చబొట్టు--17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే ప్రతీ వాళ్ళకూ చులకనే. రోడ్డుమీద నడుస్తుంటే మెడ తాకుతారు, స్కూటర్ మీద వెళుతుంటే చున్నీ మెడకు బిగిస్తారు, ఏదో అత్త కూతురయినట్లు. బస్సుల్లో శరీరాన్ని తడిమి తృప్తిపడే సన్నాసులు, కాస్త చనువుగా మాట్లాడితే ఈ మనిషి లూజ్ అని మీద మీదకు వచ్చే ముదురులు, ఓవర్‌టైమ్ పేరు చెప్పి ఆడవారి భుజాలమీద చేతులు వేసే ఆడంగులు, కూటి కోసం బజారును పడ్డ ఆడవాళ్ళ పాట్లకు ముగింపు గీతం ఈనాడే!
సదా మీ వెంటే.. మీ
పచ్చబొట్టు
అడ్రస్:వి.మన్మధ్, కాటేజీ నెం.4, రామ్‌బగీచ.. తిరుమల
***
పచ్చబొట్టు వార్తలు వచ్చినదగ్గిరనుంచీ ప్రతివాళ్లూ పేపరు చదువుతున్నారు. పేపర్లు కొనే స్థోమత లేనివారు కూడా పేపర్లు కొనుక్కుంటున్నారు. పేపరు రేట్లు కూడా పెంచేసారు. కొందరు వార్తలకోసం గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. ప్రజలలో ఇంత చైతన్యాన్ని చరిత్రలో ఇంతవరకూ ఎవరూ సృష్టించలేదు. ఎవరినోట విన్నా అదే మాట. పచ్చబొట్టు.. మా పచ్చబొట్టు.. మా పచ్చబొట్టు అనే. ఈ రోజు తిరుపతి.. రేపు ఏ వూరో?
ఎక్కడ ఎవరికి ఏ నిముషాన పచ్చబొట్టు పడుతుందో? అమాయకులు, మంచివాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. చెడ్డవారు తమ చెడ్డతనం ఎలా బయటపడుతుందో అని దుప్పటి ముఖంనిండా కప్పుకొని, కిటికీ రెక్కలు వేసుకొని, తలుపులకు లోపల తాళాలు వేసుకొని తమదయిన చర్యలు తాము తీసుకుంటున్నారు. అయినా పచ్చబొట్టు మరో అడ్వెంచర్ వైపు తన పయనాన్ని సాగిస్తోంది. అది ఏ ప్రదేశమో వేచి చూడాల్సిందే!
***
అనే్వష్ ఈసారి ముందు జాగ్రత్తపడ్డాడు. పత్రికాఫీసులో పనిచేస్తున్న తన స్నేహితుడికి ముందుగానే విషయం చెప్పి పచ్చబొట్టు వార్త రాగానే న్యూస్ అందించమన్నాడు. అతను 12 గంటలకే హెచ్చరిక మెసేజ్ అందించాడు. ఇలాంటిదేదో ఉంటుందని ముందే సూట్‌కేసు సర్ది ఉంచుకున్నాడు. ఆమెను తప్పకుండా తిరుపతిలో పట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయంటే ఆమె వేరేచోటికి ఎలా వెళ్లగలదు? ఈలోపే తను గమ్యస్థానం చేరాలి. ఆమె డెఫనెట్‌గా కాలినడకనే తిరుపతి చేరుతుంది. తను ఎంత తొందరగా చేరితే అంత మంచిది. ఇంత దగ్గిర్లో పచ్చబొట్టు తన పని పెట్టుకోవటం ఒకరకంగా తనకు మేలు చేసినట్లే!
చెల్లికి విషయం చెప్పి, తండ్రికి మాత్రం ఫ్రెండ్ మేరేజ్‌కి వెళుతున్నానని బయలుదేరాడు. నాన్నగారి ముందు ఏమీ కనిపెట్టలేనివాడిలా నిలబడటం అతనికి నచ్చటంలేదు. అందుకే అబద్ధం చెప్పని తను మొదటిసారి అబద్ధం చెప్పాడు.
బండిమీదే బయలుదేరాడు. బస్సులయితే వెయిటింగ్‌లో సమయం వృధా అయిపోతుందని, చలిగాలి చంపేస్తున్నా స్పీడు పెంచేస్తున్నాడు. పచ్చబొట్టు తనకు దొరికిపోయినట్లే అనిపిస్తోంది.
పచ్చబొట్టు తనకు ఉత్తరం రాసిన దగ్గరనుంచీ తనలో తెలియని భావాలు. రాకూడని ఆలోచనలు. మధురమైన అనుభూతులు. పోలీసు వృత్తిని అంకితభావంతో అందుకున్న తను పెళ్లి ఊసు ఎత్తకూడదనుకున్నాడు. కానీ తన మనసును తను అదుపులో పెట్టలేకపోతున్నాడు. హృదయం తన మాట వినటంలేదు. అది లబ్‌డబ్ అనటం మానేసి పచ్చబొట్టు, పచ్చబొట్టు అంటోంది. అది తప్పుగా అనిపించటంలేదు అతనికి విచిత్రంగా.
ఒక పోలీసు అఫీసర్.. చట్టాన్ని తప్పించుకొని సాహసాలు చేస్తున్న ఓ దొంగని ప్రేమించటమే. మన ఆలోచనల్లా అతని ఆలోచనలు లేవే! అతను వలపుగదిలో చేరి పచ్చబొట్టుతో పాటలు పాడేసుకుంటున్నాడు. అతని గది అతనిష్టం. మనమెవరం ఆపటానికి. ప్రయత్నిస్తే దొంగలను లాఠీతో బాదినట్లు బాదేస్తాడేమో? ఎందుకొచ్చిన తిప్పలు. మనం బయటనుంచే ఆ పాటలు విందాం. ఇపుడు మనం టీవీని అలాగే చూస్తున్నాం కదా!
హీరోకి బట్టలున్నా షర్ట్ విప్పి మళ్లీ వేసుకుంటూ ఉంటాడు. అది అతని మగతనం. హీరోయిన్‌కి అసలు బట్ట ఎంత తక్కువ ఉంచుదామా అన్న డైరెక్టర్ తపన కనిపిస్తూనే ఉంటుంది. కట్టుకున్న కాస్త బట్ట కూడా అప్పుడప్పుడూ తప్పించటం, నడుము ఊపుల దగ్గిరనుంచీ గుండె లోతులు దాకా ఎందుకు చూస్తున్నాంరా భగవంతుడా అని బాధపడటం. ఇదంతా ఎందుకు అని చాలామంది టీవీ పెట్టుకొని చక్కగా పనులు చేసుకుంటూ వింటున్నారు. ఇంకొన్నాళ్ళు పోతే ఆ వినటం కూడా మానేస్తారేమో! ఎక్కడో లబ్ డబ్ లబ్ డబ్ అంటూ పాట వస్తోంది. అనే్వష్‌కి వీటితో ఏం సంబంధం లేదు. మనల్ని అసలు పట్టించుకోవటంలేదు. ప్రేమలో పడితే అంతేనండీ! లోకమంతా ఖాళీస్థంగా, తామిద్దరే ఉన్నట్లు ప్రేమికులు భావించుకుంటారు. ఇంతకీ పచ్చబొట్టును అనే్వష్ ఎలా ఊహించుకుంటన్నాడో? అతను పోలీసు ఆఫీసర్ అయిపోయాడు, ఏ చిత్రకారుడో అయితే చక్కటి రూపాన్ని ప్రసాదించేవాడు పచ్చబొట్టుకి. అతను ఊహల్లోనే ఉన్నాడు. అసలు తను ప్రేమలో పడ్డానని తెలుసుకోవటానికే చాలా టైమ్ పట్టింది. ఇప్పుడంతా కవర్ చేసుకుంటున్నాడేమో! మనం అతని వెంట ఉన్నామని తెలిస్తే బాధపడ్తాడు. నెమ్మదిగా తప్పుకుందాం.
నిముష నిముషానికి ఆకాశం రంగులు మార్చినట్లు అనే్వష్ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాయి. అవి అలా.. అలా.. ప్రయాణం చేసి ఊహల్లోంచి వాస్తవంలోకి తీసుకువచ్చాయి.
ఆర్థిక ఇబ్బందులున్నాయంటే ఆమె ప్రయాణం ఎలా చేస్తుంది? అసలామెది ఏ ఊరు? ముందు మెట్లు నడిచే దిగుతుంది. తను వెళ్ళేటప్పటికే దిగిపోతుందా? ఈ రోజు కాస్త అనుమానమున్న ఎవరినీ వదలకూడదు. అక్కడనుంచీ బస్సులో ఎలా వెళ్లగలదు? అసలే బస్సు ఛార్జీలు భయంకరంగా పెరిగాయి. రైలులో వెళుతుందా? ప్యాసింజర్ అయితే తక్కువ మనీతో క్షేమంగా చేరవచ్చు. టికెట్టు కొనకపోయినా ఎవరూ పట్టించుకోరు. డబ్బులు కావాల్సిన పుడు మాత్రం టీసీలు చెక్ చేస్తుంటారు. టిక్కెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతారు. పచ్చబొట్టు టిక్కెట్టు లేకుండా ప్రయాణించటమా? తను ఒకరికి నీతులు చెబుతూ అవినీతి పాల్పడుతుందా? నెవ్వర్. పచ్చబొట్టంటే నిప్పు. ప్రాణాలయినా వదులుతుంది కానీ నీతి తప్పదు. తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది అనే్వష్‌కి. అంతా పచ్చబొట్టు గురించి తెలిసినట్లే మాట్లాడేసుకుంటున్నాడు.
అవును. పచ్చబొట్టును తాను మది తలుపులు మూసేసి గడియ పెట్టినా తీసుకొని మరీ వచ్చేస్తోంది. చట్టాలు తెలిసిన తను ఆమెను ప్రేమించటమేమిటి? చరిత్రలు క్షుణ్ణంగా చదివాడు. సబ్జెక్ట్ తనకి కరతలామలకం. కానీ ప్రియురాలిని ఎలాగైనా కలుసుకోవాలని తపన. కర్తవ్యం నీడలా వెంటాడుతోంది. ఆమె తనకు చిక్కకముందే తను ఆమెను పట్టుకోవాలి. ఆమెనెలాగైనా పట్టుకొని చట్టబద్ధంగా ఎలాంటి శిక్ష పడకుండా కాపాడాలని ఆవేదనతో, ఆర్తి నిండిన హృదయంతో అతను ప్రయాణిస్తున్నాడు.
ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా బండి నడుపుకుంటూ వచ్చి రామ్‌బగీచ ముందు ఆగాడు. స్టాండ్ వేసి క్వార్టర్స్ వెనక్కి పరుగెత్తాడు. పచ్చబొట్టు అప్పటికే మన్మధ్ బుగ్గమీద ప్రత్యక్షం. చుట్టూ చూసాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. మళ్లీ కిటికీలోకి చూసాడు. ఆ జంట హాయిగా నిద్రపోతోంది. లేచాక కదా వాళ్ళ తిప్పలు. ఇక్కడ ఎంక్వయిరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు పచ్చబొట్టు సంగతి చూడాలి. మళ్లీ బండి స్టార్ట్ చేసి కాలినడక దారివైపు వేగంగా పోనిచ్చాడు. మధ్యలో దాహమేసినా, కాసేపు ఆగాలనిపించినా బండిని ఆపలేదు. ఆ ఒక్క నిమిషం తనకెంతో విలువైనదనుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు. తను చేసిన ఈ పని ఇక్కడివారు ప్రయత్నిస్తే తప్పక పట్టుకొనేవాడు. కానీ పాదరసంలా పట్టుచిక్కక జారిపోతుందే పచ్చబొట్టు.
-సశేషం

-యలమర్తి అనూరాధ సెల్:9247260206