డైలీ సీరియల్

పచ్చబొట్టు--25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం చెప్పాలో ఒక్క నిముషం అర్థం కాలేదు. అమ్మా, నాన్నగారు వాళ్ళందరినీ తమ కన్నబిడ్డల్లా చూసుకునేవారు. వాళ్ళు కష్టాలలో ఉంటే చెప్పకుండానే గ్రహించి సహాయం చేసేవారు. ఇపుడు తను దాచినా రేపు బయటపడుతుంది. చెప్పకపోతే తర్వాత తెలిసి మనసులో బాధపడతారు. ఈ పరామర్శలకు భయపడే ఈ విషయాన్ని ఇన్నాళ్ళూ దాచింది. అవి ఓదార్పునివ్వటానికి బదులు పుండును కెలికినంత బాధ కలిగిస్తాయి. అందుకే వాటిని అవాయిడ్ చెయ్యాలనిపిస్తోంది.
తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అంత ఆలోచనలో పడిపోయాడేమిటో అనే్వష్, అర్థం కాలేదు రైటర్‌గారికి.
అపుడు అమ్మా నాన్న పోయిన సంగతి చెప్పాడు అనే్వష్.
నిశే్చష్టుయ్యారు అందరూ.
నెమ్మదిగా విషయమంతా అడిగి తెలుసుకున్నారు.
‘‘ఇంతలో ఇంత జరిగిందా? మాకెవ్వరికీ తెలియదు. మేం ఎంత ఓదార్చినా ఆ దుఃఖం తీరేది కాదు. తట్టుకోవడానికి ప్రయత్నించండి’’ అన్నాడు రైటర్.
అప్పటిదాకా వాళ్ళ సంభాషణను నిశ్శబ్దంగా వింటున్న ‘వీరయ్య’ కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ దంపతులను తలచుకోగానే. శివ పార్వతులులా ఉండేవారు. దేముడు మంచివాళ్ళనే తీసుకెళ్లిపోతాడు. చిన్న వయసులోనే పెద్దవాళ్లను చేసేవాడు’’ అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక కళ్ళను కర్చ్ఫీతో వత్తుకుంటున్నాడు.
గంభీరంగా వెళ్లి సీట్లో కూర్చున్నాడు.
ఆ సీటులో కూర్చుంటే అతనికి తల్లి, చెల్లి, తండ్రి ఎవరూ గుర్తురారు. కర్తవ్యదీక్ష, అంకితభావం- ఇవి రెండే అతని ఊహలో మెదిలేవి.
ఇపుడు అతను ఆలోచించేది పచ్చబొట్టు గురించే.
తానూ ఒక చెడ్డవాడైతే తనకూ పచ్చబొట్టు పొడిచేవారు. అపుడు ఈజీగా పట్టుకొనేవాడేమో! అతని ఆలోచనకి అతనికే నవ్వువచ్చింది.
ఈ ఊర్లో పచ్చబొట్టు పొడిచే వారెవరైనా ఉన్నారా అని ఎంక్వయిరీ చేస్తే వాళ్ళు దొరికారు కానీ నేర్చుకోవాలని వచ్చినవాళ్ళు ఎవరూ తగలటంలేదు. అదే పెద్ద ప్రాబ్లమ్.
పచ్చబొట్టు ఈ విద్యను ఇప్పట్లో నేర్చుకోలేదు. ఎప్పుడో నేర్చుకొని ఉంటుంది. అది ఇప్పుడు వాడుకుంటోంది. అన్ని ఊర్లనుంచీ అన్ని పోలీసు స్టేషన్లనుంచీ వచ్చిన విషయాన్ని బట్టి ఇది గ్రహించాడు.
అసలు ఈ పచ్చబొట్టు వేరే ఊరిలో ఉండి ఇక్కడనుంచీ కూడా ప్రారంభించి ఉండవచ్చు. అలా జరిగితే తను ఇక్కడ ఎంక్వయిరీ చేసినా లాభం ఉండదు. అదే జరుగుతోంది. అయినా కానిస్టేబుల్స్‌ని పచ్చబొట్టు వేసేవాళ్ళను ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పాడు.
తను చదవని పేపర్లు అన్నీ తెప్పించుకొని చదివాడు.
తను రాని రోజుల్లో మరొకరికి పచ్చబొట్టు పడింది.
ఎవరా అని వివరాలు చదవటం ప్రారంభించాడు.
హెచ్చరిక - 5
హలో! ఫ్రెండ్స్!
గుడ్‌మార్నింగ్!
ఈ సమాజాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ప్రతీ విషయంలో స్ర్తి అంటే చులకన. ఆమెకో నీతి, మగవారికో నీతి. భార్య చనిపోయిన పదో రోజున భర్త పెళ్లికొడుకయితే హర్షిస్తుంది. అదే భార్య బయటకు వస్తే చాలు ఎన్నో నిందలు వేస్తుంది. ఆమె పెళ్లి చేసుకుంటే అవహేళన చెయ్యటానికి సిద్ధం. ఎందుకలా?
భారతదేశం అంటే ఏకపత్ని అని ఒకనాడు గర్వంగా చెప్పుకొనేవారు. మరి ఇప్పుడు ఒక్కొక్కరికి రెండేసి కుటుంబాలు. కొందరికి మూడు కూడా, సిగ్గుచేటు. మన దేశం, మన సంస్కృతి మరిచిపోయి విదేశీయులలా ప్రవర్తిస్తే ఇక మన గొప్పతనం ఏముంది?
ఇది ఇలాగే కొనసాగితే ఆడవారు కూడా మగవారిలా తయారయ్యే అవకాశమూ లేకపోలేదు. దానిని అడ్డుకోవాలనే కృష్ణమూర్తికి మచ్చ వేశాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరికీ పచ్చబొట్టు పడే అవకాశముందని తెలియజేయటానికే ఈ యత్నం. ఈ ప్రయత్నాన్ని మీరంతా హర్షిస్తారనే నా భావన.
ఉంటా.
మీ
పచ్చబొట్టు
అడ్రస్: ఆర్.కృష్ణమూర్తి, లోడీ గార్డెన్స్, క్యూ క్వార్టర్ నెం.555, ఢిల్లీ.
***
అబ్బో! పచ్చబొట్టు చేతులు ఢిల్లీ వరకూ ప్రాకాయే! అనే్వష్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. పచ్చబొట్టు మళ్లీ ఉత్తరం రాయలేదు. తన ఉత్తరం ఎలా మాయమయింది? తన ఇంట్లో జరిగిందే తను కనిపెట్టకలేపోతే ఇక బయటివి ఎలా కనుక్కోగలుగుతాడు? ముందు అక్కడినుంచే ప్రారంభించాలి.
తమ ఇంటి తాళాలు తండ్రి దగ్గిర ఒకటి, విద్య దగ్గిర ఒకటి తన దగ్గిర ఒకటి ఉంటుంది. తాళంతో రెండు ఇస్తే ముగ్గురికీ ఇబ్బంది ఉండకూడదని తనే మరొకటి దగ్గిరుండి చేయించాడు. అలాంటిది పచ్చబొట్టు ఒకటి సంపాదించి ఉంటుందా?
గుడి దగ్గిర తాళం తయారుచేసిన అతని దగ్గిరకు వెంటనే బయలుదేరాడు. ‘‘ఇంటికి తీసుకువెళ్ళి ఎవరైనా తాళం చేయించుకుంటారా?’’ అని అడిగారు.
‘‘వెళతానండీ! బీరువా తాళాలు పోతే నన్ను తీసుకెళ్లి చేయించుకుంటారండీ. నమ్మకమైన వాళ్ళే అలా తీసుకువెళ్తారండీ. నేను చాలా ఏళ్లనుంచీ ఇక్కడ ఉన్నానని అలాంటివాటికి ఊర్లో ననే్న ప్రత్యేకంగా తీసుకువెళ్తారండీ’’ అన్నాడు.
‘‘మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావా?’’ ఆ మేడమీద చూపించాడు!
‘‘అబ్బే! రాలేదండీ’’ అనేసాడు.
సినిమాలలోలా పని అమ్మాయి ద్వారా తాళం గుర్తు తీయించి అయినా చేసి ఉండాలి. రేపు అడగాలి. ఈ దెబ్బతో పచ్చబొట్టు సంగతి తెలిసిపోతుంది.
ఇంకా ఈ ఊళ్ళో తాళాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అని అడిగి నోట్ చేసుకున్నాడు.
మరునాడు వీళ్ళందరి దగ్గిరకు కానిస్టేబుల్స్‌ని పంపించి విచారణ చెయ్యాలనుకున్నాడు. ఇక్కడ కాకపోతే ఎక్కడో ఈ పని చేసే ఉండాలి. ఆమె అన్నా రావాలి. ఉత్తరం ఎవరి ద్వారానైనా వెళ్లాలి. ఉత్తరానికి కాళ్ళు లేవు కాబట్టి ఆమే వచ్చి ఉండాలి.
పచ్చబొట్టు తన గదిలోకి వచ్చిందా? ఎంత ధైర్యం? ఎన్ని గుండెలు?
‘‘ఒకటే గుండె. అది కూడా అనే్వష్‌కిచ్చేసాను’’ అని ప్రక్కన నిలబడి పచ్చబొట్టు చెవిలో గుసగుసలాడినట్టే అనిపించింది.
చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అంతా తన భ్రమ
కొన్నాళ్ళు పోతే ఏది నిజమో ఏది భ్రమో తెలియని పరిస్థితులలో పడిపోతానేమో!
ఎప్పుడో అనుకున్నది ఇప్పుడే జరిగితే! అదే కదా జీవితం!
***
ఎందుకో లేవగానే మత్తుగా హాయిగా అనిపించింది అనే్వష్‌కు. అదెందుకో మాత్రం కారణం తెలియదు. మామూలుగా ఉన్న పరిసరాలు కూడా ప్రేమలో పడితే అందంగా కనిపిస్తాయట. తనకీ అదేనా? ఏమో!
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. పోలీస్ ఆఫీసరునై కొన్ని కొన్ని ఇలా కనిపెట్టలేకపోవడం నచ్చదు. అలాగని ‘ప్రేమే’ అని ఒప్పుకోవటం కూడా కష్టమే!
‘పసిడి’ని తాళం గురించి అడగాలంటే మనసొప్పటంలేదు. వాళ్ళ అమ్మ కూడా తమింట్లో పనిచేసింది. ఎంతో నమ్మకమైన మనుషులు. తాళాలు ఇచ్చినా ఏమీ పోవని అమ్మ చెప్పటం చాలాసార్లు విన్నాడు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.
ఇంతలో పసిడి రానే వచ్చింది.
‘‘అనే్వష్‌బాబూ! క్రిందనుంచీ వస్తుంటే ఎవరో మీకీ కవరు ఇమ్మన్నారు’’ అంటూ గులాబీ రంగు కవరు ఇచ్చింది.
అది చూడగానే పచ్చబొట్టుదని తెలిసిపోయింది.
‘‘ఎవరు ఇచ్చారు? వాళ్ళని చూసావా?’’
‘‘చిన్నబాబు ఇచ్చాడు. స్కూలు డ్రెస్సులో ఉన్నాడు’’
‘‘ఏ రంగు? చూస్తే గుర్తుపట్టగలవా?’’ ప్రశ్నలమీద ప్రశ్నలు.

-సశేషం

--యలమర్తి అనూరాధ 9247260206