డైలీ సీరియల్

అమ్మానాన్నకు - 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా ఎంత హింస అనుభవించాను. దానిని ఎవరూ గుర్తించరెందుకు? ఒకవేళ నాకు ర్యాంకు రాకుంటే, అవును.. ర్యాంకు రాకుండా ఉంటే.. అపుడు నాకు ఇన్ని పొగడ్తలు ఉండేవి కావు. ఇంత గుర్తింపు ఉండేది కాదు.. నాలాంటివాళ్లు హాస్టల్లో మరో వందమంది ఉన్నారని ఒకసారి లెక్కలేసుకుని అనుకున్నా. వారిలో ఏ ఒక్కరికీ నాలా ర్యాంకు రాలేదు. కనీసం పది ర్యాంకుల్లో కూడా స్థానం లేదు. డేస్కాలర్స్‌కు ఇద్దరికి మాత్రమే ర్యాంకులు వచ్చాయి.
ఇపుడు ఆ వందమంది పరిస్థితి ఏమిటి? ఇన్నాళ్ల హింస, ఇక ఉండబోయే హింసా వాళ్లు భరించాల్సిందేనా? నాలాంటివాళ్లను ఒకరిద్దరిని చూసి వేలమంది పిల్లలను ఇలాంటి చదువుల కుంపట్లలోకి నెట్టుతున్నారే..
ఎంతమంది ఇందులోంచి బయటపడగలరు? ఈ కుంపట్లోంచి బయటపడేవాళ్లకంటే కాలిపోయే వాళ్లే ఎక్కువమంది..? ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు అమ్మా నాన్నలు పిల్లలను మార్కుల చదువుల కోసం పరుగులెత్తించి వాళ్లకు మానసికంగా దూరమైపోతున్నారు?
ఎంతసేపు ఆలోచించినా, చాలావాటికి సమాధానం చిక్కలేదు. నన్ను వెతుక్కుంటూ నాన్న వచ్చారు.
‘‘ఎందుకు ఇక్కడన్నావు.. మీ అమ్మ ఎంత కంగారు పడుతోందో.. రా ఇంటికి పోదాం’’ అన్నారు నాన్న.
ఆ మాటలు వినగానే నాకు నవ్వు వచ్చింది. రెండేళ్లు నాకు దూరంగా ఉన్న అమ్మ ఈ ఒక్క గంట నేను కనిపించకపోయేసరికి కంగారు పడుతోంది అంటే నవ్వు రాదా? నేను తప్పిపోయేదానికి చిన్నపిల్లాడినీ కాదు, ననె్నవరైనా ఏమైనా చేస్తారనేదానికి అమ్మాయినీ కాదు.. మరెందుకు అమ్మకు కంగారు?
నాన్న వెంట ఇంటికి వెళ్లాను. రాత్రి ఎనిమిది గంటలయింది. అమ్మ వంట చేసేసింది. నేను స్నానం చేసి రాగానే అందరం భోజనానికి కూర్చున్నాం. నాన్న అన్నం తింటూనే గలగల మాట్లాడుతున్నారు. మధ్యమధ్యలో అమ్మ కూడా నాన్నతో మాటలు కదుపుతోంది.
నాకు మాత్రం వాళ్లతో ఏమీ మాట్లాడాలనిపించలేదు. వౌనంగా ఉన్నాను. అన్నం కూడా తినాలనిపించలేదు. తినకపోతే బాగుండదని తిన్నాను.
అమ్మా నాన్న మాటల్లో, వాళ్ల ఉద్యోగాల్లోని ఇబ్బందులు సంతోషాలు సరదాలు, స్నేహితులు, బంధువులు.. ఇలాంటి విషయాలే ఎక్కువగా వున్నాయి. ఆ మాటలపట్ల నాకు ఆసక్తి లేదు.
నాకు నచ్చిన కూర ఏదో, నేను ఏవేవి ఇష్టంగా తింటానో అమ్మకు తెలీదు.. నాకు మాత్రమే తెలుసు.. తిండిలో నా ఇష్టా యిష్టాలను తెలుసుకునేటన్ని రోజులు నేను అమ్మా నాన్నతో లేను. నాకు మాత్రం.. ఎవరైనా నా ఇష్టం తెలుసుకుని నాకు వడ్డించాలని, వండిపెట్టాలని కోరిక.
‘‘ఏరా.. ఏమీ మాట్లాడటం లేదు...’’ అన్నారు నాన్న.
‘‘ఏం లేదు నాన్నా.. నిద్ర వస్తోంది’’ అన్నాను.
‘‘మీ కాలేజీలో ఈ టైమ్‌కే పడుకునే వాళ్లా.. అర్థరాత్రిదాకా మేలుకుంటారుగా..’’ అన్నారు నాన్న.
‘‘అక్కడంటే చదువుకోవాలి కాబట్టి మేలుకుని ఉంటాం. ఇపుడెందుకు మేలుకోవాలి?’’
‘‘మేం మాట్లాడతూ ఉన్నాం కదా.. చాలా రోజులయింది, మనం మన ఇంట్లో కలసి భోం చేసి.. మాకయితే నిద్ర రావడంలేదు.. చాలా హుషారుగా ఉన్నాం.. ఏవైనా మీ కాలేజీ విశేషాలుంటే చెప్పు’’ అన్నారు నాన్న.
‘‘మా కాలేజీలో విశేషాలేమీ లేవు’’ అన్నాను ముక్తసరిగా.
‘‘అదేంటి నాన్నా.. రెండేళ్లు చదివితే ఎలాంటి విశేషాలూ లేవా?’’ ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.
‘‘లేవమ్మా.. ఏముంటాయి.. మాకు చదువు, తిండి, నిద్ర.. ఇవి తప్ప వేరే ఏమీ ఉండవు.. తెల్లవారు జామున లేచిందగ్గరనుంచి రాత్రి పనె్నండు దాకా వాయిగొట్టేస్తారు.. పడకమీదకు చేరామంటే ఒళ్లు తెలీనంత నిద్ర పట్టేస్తుంది.. మళ్లా తెల్లవారు జామున నిద్రలేవడం.. మామూలే.. మాకేమీ విశేషాలు లేవు’’ అన్నాను.
నాకు అమ్మా నాన్నతో మాట్లాడాలనిపించడం లేదు. వాళ్లకు నచ్చినపుడు మాట్లాడేదానికి, వాళ్లకు నచ్చనపుడు మాట్లాడకుండా ఉండేదానికి నేనేమన్నా యంత్రాన్నా?
ఆకలి వేసినపుడు తినాలి.. నిద్ర వచ్చినపుడు పడుకోవాలి. చాలామంది నిద్ర వచ్చినపుడు తింటుంటారు. ఆకలి వేసినపుడు పడుకుంటూ వుంటారు.. ఇలా చేయడం వలన ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువ.
నేను తిన్న వెంటనే నా బెడ్‌పైకి వెళ్లాను. కాసేపట్లోనే నిద్రపట్టేసింది. నిద్రలో కల. ‘నన్ను అమ్మా నాన్న, కరస్పాండెంట్‌లు ముందుకు తోస్తున్నారు. కాస్త దూరంలో బంగారు పూలున్నాయి.. వాటిమధ్యలో పుప్పొడి బదులు వజ్రాలు మెరుస్తున్నాయి. దూరానికి కూడా అవి తళతళమంటున్నాయి.. నన్ను వెళ్లి వాటిని తీసుకురమ్మని చెబుతున్నారు. నేను పోనంటున్నా వదలడంలేదు. ఇక నాకు తప్పడంలేదు.
మెల్లగా ముందుకు అడుగులేశాను.. ఒక్కో అడుగు వేశాను. బంగారు పూలు దగ్గరగా కనిపించాయి కానీ నేను పోవడం మొదలుపెట్టాక అవి దూరంగా పోతున్నాయనిపించింది.. నాలాంటివాళ్ళు ఇంకా కొందరు వాటివేపు పోతున్నారు.
మధ్యలో నా కాలు ఒకటి మాయమైపోయింది. భయపడ్డాను. ముందుకే పోతున్నాను. ఈసారి ఒక చేయి మాయమై పోయింది. ఇంకాస్త దూరం వెళ్లాక చెవులు, నోరు, ముక్కు, కాలు, పొట్ట, తల.. ఇలా ఒక్కక్కటే అదృశ్యమైపోయాయి. చివరకు ఒక్క గుండె, ఒక్క చేయి మాత్రమే మిగిలాయి. నాతోపాటు వస్తున్న వాళ్లలో అవి కూడా మిగలలేదు. మధ్యలోనే వాళ్లంతా అదృశ్యమైపోయారు.
- ఇంకా ఉంది

-సుంకోజి దేవేంద్రాచారి