డైలీ సీరియల్

అమ్మా నాన్నకు - 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకుమించి నాకెందుకో అమ్మ రూపం మరో రకంగా కనిపించదు.. ఒక్కసారి అమ్మ చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి. ‘‘నీ కంట్లో కన్నీళ్ళు రానంతవరకూ నువ్వు, నీ చుట్టూ సమాజం బాగున్నట్టే. నీ కంట్లో కన్నీళ్లు వచ్చాయంటే నువ్వో, నీ చుట్టూ ఉన్న సమాజమో బాగలేనట్టే. నీకు కన్నీళ్లు రప్పించే సమాజాన్ని నువ్వు బాగు చేయలేకపోవచ్చు. కానీ, నీలో కన్నీళ్లు రాకుండా నిన్ను నీవు బాగు చేసుకోవచ్చు. వీలయితే, నీకు శక్తి ఉంటే సమాజాన్ని కూడా బాగు చేయవచ్చు. అంతేకానీ ఏడుస్తూ మాత్రం కూర్చోకూడదు’’ అంది.
అమ్మ అంటే ఇవి తప్ప ఇంకేమీ గుర్తులేవు.. ఇంకేమీ దగ్గరతనం అనిపించలేదు.
నాకు ఫోన్ కాల్ రాకముందుకు, వచ్చిన తర్వాతకు తేడా నాలో లేదు. నాకు దుఃఖాన్ని కలిగించలేదు. చిన్నప్పటినుంచీ ఎపుడూ అమ్మకు నేను దగ్గరున్నానని? నాకెపుడు అమ్మ దగ్గరుందని?
నేను అమ్మ అంత్యక్రియలకు రానని చెప్పినందుకు నాన్న ఫోన్‌లో ఏడుస్తున్నారు. నాన్న ఏడుపు కూడా నాలో ఎలాంటి స్పందనా కలిగించలేదు.
ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది. వాళ్ల సానుభూతిని భరించలేకపోయాను.. అందుకని ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లాట్ వచ్చి నా వస్తువులు తీసేసుకుని హైదరాబాద్ వచ్చేశాను లాడ్జిలో ఒక రూమ్ తీసుకున్నాను. నా చిన్నప్పటినుంచీ నేను రాసి పెట్టుకున్న కాగితాల్లోంచి ముఖ్యమైన వాటిని ఇప్పటి ఆలోచనలతో ఒక క్రమంలో పేర్చాను.
నేనెందుకు ఇలా మారాను?
అమ్మ చనిపోయినా కూడా నాలో ఎందుకు దుఃఖం కలగడంలేదు?
ఇందులో నా తప్పెంత? అని ప్రశ్నించుకున్నాను.
నా తప్పుకంటే అమ్మా నాన్న తప్పు ఎక్కువ కనిపించింది.
పిల్లలను చదువు పేరిట జైలు లాంటి హాస్టల్లోకి స్కూళ్లలోకి పంపడం కాదు..
ముందు, పిల్లలు ఏం చదువుకోవాలి? వాళ్ళతో ఎలా మెలగాలి? అనే విషయాల్లో అమ్మా నాన్నలకు చదువు చెప్పాలనిపించింది.
యస్.. అదే చేయాలి.
దుఃఖం రావాల్సింది నాకు కాదు.. నాలాంటి యంత్రాలను తయారుచేస్తున్న అమ్మ నాన్నలకు.. ఇది ఇలాగే కొనసాగితే యంత్రాలు కూడా మిగలవేమో.. యంత్రాల్లా కాకుండా స్పందించే మనుషుల్లా పిల్లలను పెంచేలా అమ్మా నాన్నలకు చదువు చెప్పాలి. ఆ పని నేనే ప్రారంభిస్తా.. అపుడు నేనే వెతుక్కుంటూ వెళ్లి నాన్నను కలుస్తా.
అంతవరకూ అమ్మా నాన్నకు సెలవు..
చివరగా- జ్వరం వచ్చినపుడు ననె్నంతో ప్రేమగా చూసిన అమ్మ.. ఏడుపు దేనికీ పరిష్కారం కాదని ధైర్యం చెప్పిన అమ్మ..
నేను చివరిసారిగా ఇంటినుంచి వచ్చేస్తున్నపుడు ఎండిన జాజిచెట్టు పక్కన రంగు వెలసిన గోడకు ఆనుకుని చూస్తున్న అమ్మ.. రూపాలు నా హృదయంలో ముద్ర వేసుకున్నాయి. వాటిని నా జీవితాంతం చెరపకూడదనుకున్నాను. అందుకనే నేను రాకూడదనుకున్నా. నా ఆలోచనల్లో, హృదయంలో అమ్మ ఎప్పటికీ సజీవంగా ఉండాలి.
***
చేతిలో వున్న పుస్తకంపైన మోహన్ కళ్లనుంచి నీళ్లు పడుతున్నాయి. ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకున్నాడు. తన కొడుకును గుండెలకు హత్తుకున్నట్టు అనిపించింది.
అతని కళ్లు, హృదయం ఏదో గొప్ప విషయం తెలుసుకున్నామనే ఆనందంలో ఉన్నాయి. భార్య చనిపోయిన విషయం కూడా అతను మరచిపోయాడు.
అమ్మా నాన్నలకోసం ఏర్పాటు చేసే స్కూలుకు తనను కొడుకు తీసుకుపోయే క్షణాలను తలచుకుంటున్నాడు. అవి ఎంత తొందరగా వస్తాయా అని అప్పటినంచే ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
--అయిపోయంది--

-సుంకోజి దేవేంద్రాచారి