డైలీ సీరియల్

బంగారుకల - 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తిమ్మరుసు అయిష్టంగా ఒప్పుకున్నట్లు రాజుకు తెలుసు. తిమ్మరుసు ఒప్పుకున్నట్లే నటించి కుతంత్రంతో పట్ట్భాషేకాన్ని ఆపేసినట్లు సృష్టిస్తే’’
‘‘అవును ఆ ముసలి మంత్రి అలాంటివాడే! జనం నమ్ముతారు కూడా! కానీ ఎలా? ఆ యువరాజుని హత్య చేసి ఆ నేరం తిమ్మరుసుమీద వేస్తే ఒక దెబ్బకి రెండు పిట్టలు’’ వీరేంద్రుడు ఉత్సాహంగా చెప్పాడు. కంటకుడు నివ్వెరపోయాడు. అతనెంత దుర్మార్గుడైనా హత్య చేసే ఆలోచన లేదు. అందునా యువరాజుని.
‘‘అలా వద్దు. ఏదో ఒకటి చేసి పట్ట్భాషేకం ఆపేద్దాం’’ కంటకుడు వారించాడు.
‘‘అవును. ఏదో ఒకటి చేయాలి.. అవును’’ అంటూ దగ్గరిగా వస్తూనే ఛురికతో కంటకుడ్ని ఓ పోటు పోడిచాడు.
‘‘ఇదే చేసేది, నాకే సలహాలు చెప్పేవాళ్ళు నాకెందుకు జగన్నాథ!’’ పెద్దగా నవ్వి, వీరేంద్రుడు భృత్యుల్ని పిలిచాడు.
‘‘ఈ శవాన్ని తుంగభద్రలోకి విసిరేయండి’’ హుంకరించాడు.
***
పుత్రశోకాన్ని తప్పించటమెవ్వరితరం! గండమనాయకుడు విషణ్ణ వదనంతో తిమ్మరుసు ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు.
విచారించకండి గండమనాయకా! మీ కుమారుడు కంటకుడు మాయం కావటం గురించి నాకు వీరేంద్రుని మీద అనుమానంగా వుంది’’ తిమ్మరుసు గండమనాయకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘ఆ వీరేంద్రునితో సాంగత్యం వద్దని ఎన్నోమార్లు చెప్పి చూశాను మహామంత్రీ! అతను ఎప్పుడూ పగబట్టిన తాచులా కన్పిస్తాడు. చివరకు నా కుమారుడినే బలి తీసుకున్నాడు’’ గండమనాయకుని కంఠం రుద్ధమైంది.
‘‘మీ శోకానికి కొంతవరకు మేమూ బాధ్యులమే! వీరేంద్రుని ఆనాడే పంపేసి ఉంటే ఈనాడు విజయనగరానికీ కలత వచ్చేది కాదు’’ పశ్చాత్తాపడ్డారు తిమ్మరుసు.
‘‘ఇప్పటికయినా మించిపోయింది లేదు. ఆ దుర్మార్గుడ్ని కత్తికో కండగా’’ గండమనాయకుడి ఆవేశాన్ని వారించారు మంత్రి.
‘‘అందుకు తగినవాడే! ఇప్పుడు మన కర్తవ్యం యువరాజుని రక్షించుకోవటం’’ ఉపదేశించారు.
‘‘యువరాజునా?’’ ఆశ్చర్యపోయాడు గండమనాయకుడు.
‘‘యువరాజుకు పట్ట్భాషేకం అంటే మేము కాదంటామనీ, తద్వారా మాకూ, రాయలవారికీ మధ్య చిచ్చు పెట్టాలనీ వీరేంద్రుని పన్నాగం. పట్ట్భాషేకానికి మేము సమ్మతి తెలపటంతో ఈ సమస్య సమసిపోయింది. ఇప్పుడు వీరేంద్రుడు మమ్ములను రాయలవారి దృష్టిలో ఎలా నీచునిగా చూపించాలా అని ఆలోచిస్తాడు. అది నెరవేరటానికి వాడికున్న ఆయుధం యువరాజు. ఆ పసివాడి ప్రాణానికి వీరేంద్రుడు ముప్పు తలపెడతాడని నాకు తోస్తున్నది. మీరు కాపలా కట్టుదిట్టం చేయండి అహర్నిశలు యువరాజు భద్రత మీద దృష్టి పెట్టండి. వీరేంద్రుని సంగతి ఇంక అటో ఇటో తేల్చేసే సమయం వచ్చేసింది. శత్రుశేషం ఉంచటమే మేము చేసిన పొరపాటు’’ తిమ్మరుసు మాటలతో గండమనాయకుడు కార్యోన్ముఖుడయ్యాడు.
***
అన్నపూర్ణాదేవి చాలా ఆందోళన పడుతోంది. మూడు రోజులుగా తిరుమలరాయలు మూసిన కన్ను తెరవటంలేదు. రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. రోగ నిర్థారణ కాలేదు. మందులు పనిచేస్తున్నట్లు కన్పించవు.
‘‘జగన్నాథ స్వామీ! నా బిడ్డని కాపాడు. నీ దర్శనం చేసుకుంటాను’’ ఆమె ఇష్టదైవాన్ని ప్రార్థిస్తోంది.
‘‘జగన్నాథ! జగన్నాథ! జగన్నాథుడేం చేస్తాడమ్మా! అసలు వారు వేరే ఉన్నారు’’.
‘‘వీరేంద్రా! ఆపు నీ వాచాలత. నీ మాటలే నాకు చేటుతెచ్చాయి’’ ఆవేదనతో అంది రాణి.
‘‘ఉన్నమాటంటే ఎందుకమ్మా అంత కోపం. ఇది మామూలు జ్వరం కాదు. విషజ్వరం. ఎవరో కావాలని తెప్పించింది’’.
‘‘ఎవరికా అవసరం వుంది. నాలుగు నాళ్ళలో పట్ట్భాషేకం చేసుకుంటున్న నా చిట్టి తండ్రికి కీడుచేయ తలపెట్టిన కఠిన చిత్తులెవరుంటారు’’ ఆమె కంఠం రుద్ధమైంది.
‘‘ఇంకెవరు ఆ.. తి.. జగన్నాథ!’’ అంతలో శ్రీకృష్ణదేవరాయలవారు వేంచేస్తున్నారనే వార్త రావడంతో వీరేంద్రు తప్పుకున్నాడు.
అతనేం చెప్పదలిచాడో ఆమెకు అవగతమయింది.
కళ్ళనీళ్లతో మ్రాన్పడి యువరాజు దగ్గర కూర్చుండిపోయింది. కృష్ణదేవరాయలు విచ్చేశారు. కుమారుని అపస్మారక స్థితి ఆయన మనసును కలచివేస్తుంది.
‘‘ఇదేమి విధిలీల దేవీ! కుమారునికి పట్ట్భాషేకమని అనుకున్నామో లేదో! ఇటువంటి అనారోగ్యం. రాజవైద్యులకు అంతుబట్టని వింతరోగం’’ రాయలు వ్యాకులపడ్డాడు.
‘‘నాకు అంతా అగమ్యగోచరంగా వుంది ప్రభూ! మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి. మా మందిరంలో మకు తెలీకుండా ఏదో కుట్ర! రాజవైద్యులను మార్పు చేస్తే మంచిదేమో’’ తల్లి హృదయంతో అన్నది.
‘‘మీ అనుమానం ఎవరిమీద?’’ రాయలు కుమారుని శయ్య చెంత చేరారు.
‘‘లేదు లేదు’’ తడబడింది.
‘‘నాయనా తిరుమలరాయా! మాకేసి ఓసారి చూడు తండ్రీ’’ కృష్ణరాయలు కుమారుని స్పృశిస్తూ పదే పదే పిలిచారు. కుమారుడు కళ్ళు తెరువనే లేదు. అన్నపూర్ణాదేవి రోదిస్తున్నది.
‘‘ఎవరక్కడ? రాజవైద్యుల్ని వెంటనే రమ్మనండి’’ బిగ్గరగా ఆదేశించిన రాయలు తల పట్టుకొని అక్కడే కూలబడిపోయారు. కుమారుని చల్లబడ్డ శరీరం ఆయన గుండెల్ని బద్దలు చేసింది. భావి విజయనగర సామ్రాట్టు మరణంతో కృష్ణరాయల తేజం మందగిస్తున్నట్టుగా మందిరంలో దీపాలు మలుగుతున్నాయి.
***
ఇంకాఉంది

-చిల్లర భవానీదేవి