డైలీ సీరియల్

కోరికకు తగిన ఆకారం..నారసింహరూపం ( ప్రహ్లాదుడు - 15)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతటా నిండి ఉన్న సర్వేశ్వరుడు హిరణ్యకశిపుని ఆగడాలు మితిమీరాయి ఇక జాగు చేయక మట్టుపెట్టాలన్న ఉత్సాహంతో ఆ స్తంభంలోనే నారసింహరూపంలో ఉన్నాడు. ఆ స్తంభమూ ఎన్నో వేల యేండ్ల తపస్సు చేసినానేమో ఇంతకు పూర్వం ఆ పరంధాముడు నన్నావేశించి ఉన్నాడు.
ఈ హిరణ్యకశిపుని వల్ల నాకు మోక్షం వస్తోంది నేడు. ఆహా! అనుకొంటూ ఎప్పుడెప్పుడు పగులుదామా పెళ్లలు పెళ్లలుగా విడిపోదామా అని ఆ స్తంభం ఎదురుచూస్తున్నది. ఎప్పుడైతే ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు చరిచాడో వెంటే అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వనులవంటి ధ్వనులు దిక్కులు పిక్కటిల్లునట్లు , బ్రహ్మాండభాండం గుండెలవసి ఒక్కసారిగా ఫెఠేలున పగిలినట్లు స్తంభం చిన్నాభిన్నమైపోయింది. అందులోంచి దేదీప్యమానమైన దివ్యతేజస్సు తో హిరణ్య కశిపుని సభామంటపం అంతా నిండిపోయింది. కళ్లు మిరమిట్లు గొలిపే కాంతిని తట్టుకోలేక అక్కడ జనం అంతా ఒక్కసారిగా కళ్లు మూసుకొని ఏమి జరుగుతోందో తెలియక వారికి తెలియకుండానే కళ్లు తెరిచారు. పొడవుగా తెల్లని ఆకారంలో పట్టు పీతాంబరాలుధరించి నడుం చుట్టూ ధగధగా మెరిసే మణులు పొదిగిన వడ్డాణం కదలుతుండగా ఏనుగు తొండాలవంటి తొడలను కదలిస్తూ అడుగులు ముందుకు బడ్డాయి. ఆ పాదాలు సన్నని కేసరాలతో నిండి అపుడే వికసిస్తున్న తామరపూవువలె ఎర్రగా ఉన్నాయి. వాటిపైన బంగారపు నూపురాలు గలగలా శబ్దం చేస్తూన్నాయి. ఆ నారసింహ రూపంలో ఉన్న ఆ నారాయణుని వక్షస్థలం పైన మణులు, కెంపులు పొదిగిన హారాలు అడుగుల లయబద్ధంగా కదులుతున్నాయి. కౌస్త్భు మణిమాల ముందుకు వెనకకు ఊగుతూ స్వామి కోపాన్ని చెబుతున్నట్లు ఉంది. ఆ వక్షస్థలానికి ఇరువైపులా ఉన్న భుజాలకు భుజకీర్తులు, కంకణాలు మెరిసిపోతున్నాయి. మెడలో హారాలను తాకుతూ వేగంగా ఊగుతున్న చెవుల మకరకుండలాల్లో పొదిగిన పుష్యరాగాలపై మెడలో ఉన్న కెంపుల హారపు రంగు ప్రతిఫలించిన ఆ కాంతి కూడా స్వామి ఆగ్రహాన్ని చెబుతున్నదా అన్నట్లు తెల్లని పుష్యరాగాలు ఎరుపెక్కి కనిపిస్తున్నాయి. స్వామి కెమ్మావి రాగరంజితమై కోపావేశంతో చలించిపోతోంది. మేఘాల మధ్య మెరిసిపోయే మెరుపులాగా స్వామి కోరలు తళతళామెరుస్తున్నాయి.
వజ్రాల కాంతులనుమించిన కాంతిని వెదజల్లే గోళ్లతో రాక్షసేశ్వరుని హృదయకుహురాన్ని స్వామి చీల్చి వేశాడు. కఠోర రక్తనాళాలను తుత్తునియలుగా తుంచి పెరికి పారేశాడు. నిశాచరుని కండరాలను ముక్కలు ముక్కలుగా తన గోళ్లతోనే ఖండించివేసేశాడు. వాని పేవులను లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకొన్నాడు.
అత్యుత్సాహంతో రాక్షసుని నెత్తుటిని ప్రవహింపచేసిన నారసింహస్వామి వక్షస్థలం చేతులు గోళ్లు అన్నీ రాక్షసుని రక్తంతో తడిసిపోయి మోదుగుపూలను మించిన ఎర్రని కాంతిని వెదజల్లుతున్నాయి.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి