డైలీ సీరియల్

విలువల లోగిలి-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా ఆ సాయంత్రం ఆమె మదిలో చెరగని జ్ఞాపకంగా ఆమె జీవిత పుటలలో మిగిలిపోయింది.
సంధ్యా సమయంలో ఆ జంట తిరుగు ప్రయాణమయ్యారు.
***
ఇంటికి రాగానే ‘అత్తయ్యా!’ అంటూ ఆవిడను చుట్టేసింది.
‘‘ఇది చాలా అన్యాయం’’ అంది ఆవిడలో ఒదిగిపోతూ.
‘‘ఏదీ! నువ్వనుకున్నవన్నీ కార్యరూపంలోకి తీసుకురావటమా?’’ అంది హాస్యంగా.
‘‘అది కాదు. నాకు చెప్పకపోవటం’’
‘‘విశ్వా.. పని జరటం ముఖ్యం నా ఉద్దేశ్యంలో’’
‘‘నేనేం ఒప్పుకోను’’
‘‘పోనీ వాటన్నిటినీ కొట్టేసి మళ్లీ కడదామా?’’
‘‘పోండి అత్తయ్యా!’’
‘‘లేకపోతే ఏంటిరా! నీకు చెప్పకుండా దాయలేక మేమెంత బాధ అనుభవించామో నీకు తెలియదు. ఆ మాట నాలుక చివరిదాకా వచ్చెయ్యటం. మళ్లీ దాన్ని వెనక్కి పంపించటం. ఆ విషయం నీకు చెబితే అర్థం కాదు. అలా పదేండ్లు.. ఒక్కసారి ఆలోచించు. ఎంత కష్టమో!’’ లాలనగా అంటున్న ఆమెలో అమ్మ ప్రేమ కనిపిస్తుంటే మరేమీ మాట్లాడలేకపోయింది.
‘‘విశ్వా! ఇక నీకు చేతినిండా పని’’
‘‘అవునత్తయ్యా!’’ అంది ఆనందంగా.
‘‘ఆల్ ది బెస్ట్ కోడలా’’
అమ్మకీవిషయం ముందుగా చెప్పాలి అనుకొంటూ సుగుణ రూమ్‌వైపు ‘‘అమ్మా! అమ్మా!’’ అని పిలుస్తూ వెళ్లింది విశ్వ.
‘‘ఏంటే! అంత ఆనందం?’’ వెలిగిపోతున్న కూతురి ముఖాన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది సుగుణ.
చందూ తనని తీసుకువెళ్లటం దగ్గరనుంచీ ఇక్కడకు తను వచ్చేవరకూ జరిగిందంటూ పూస గుచ్చినట్టు చెప్పింది విశ్వ.
నమ్మబుద్ధికాని విషయాన్ని కూతురు నిజం అని నమ్మిస్తున్నట్లుగా చూస్తోంది సుగుణ.
‘‘నిజమమ్మా! సినిమాలో ఏదో సెట్టింగు చూసినట్టు అనిపించింది. ఇన్నాళ్ళూ భీమిలిని వదిలి వెళ్ళలేనేమో అనుకున్నా. ఇపుడు ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్లిపోదామా అనిపిస్తోంది.
‘‘వీళ్ళందరికీ నువ్వంటే ప్రాణం విశ్వా. నేను లేకపోతే నువ్వు ఒంటరిదానివయిపోతావని భయం ఉండేది. బెంగ ఉండేది. ఇపుడు.. అవి రెండూ పోయాయి. ఇక నాకేమయినా ఫర్వాలేదు’’ విశ్వ గబుక్కున ఆమె నోటిని మూసింది.
‘‘ఎందరున్నా అమ్మ అమ్మేనమ్మా. ఎప్పుడూ నువ్వు అలా అనుకోకు. నీకు తెలుసో తెలియదో నా ధైర్యం అంతా నువ్వే. అదెప్పుడూ మరిచిపోకు’’
‘‘అలా ఎప్పుడూ అనకు విశ్వా. ప్రాణాలు ఎప్పుడూ అశాశ్వతమే. ఈ క్షణం ఉంటాం, మరుక్షణం ఏవౌతామో మనకే తెలియదు. రాలిపోయే పువ్వులాంటి దాన్ని నేను. నేను నీ ధైర్యమేమిటి? ధైర్యం కనిపించినా, కనిపించకపోయినా ఉండే నీడలా ఎప్పుడూ నీ వెంటే ఉండాలి.. గుర్తుంచుకో. ఇంకెప్పుడూ అలా అనకు. ఇంకోసారి ఆ నీ నోటి వెంట వినడానికి నేను ఇష్టపడను’’
వౌనంగా సమాధానం లేనట్లు తల వంచుకుని కూర్చున్న విశ్వని చూస్తే మళ్లీ ఆవిడకే జాలేసింది.
తను అలా మాట్లాడి ఉండకూడదేమో. ఎప్పటికైనా చెప్పాల్సిన విషయం అని చెప్పేసింది కానీ అది తన మూడ్‌ని చెడగొడుతుందనుకోలేదు. ‘‘సరే.. ఇవన్నీ వదిలెయ్. నీ విశ్వసౌధాన్ని ఎప్పుడు చూపిస్తావు? అది నాకు చెప్పు’’ అంది.
‘‘నాకయితే అక్కడవన్నీ చూశాక వెంటనే వచ్చి నిన్ను తీసుకువెళ్లి చూపించాలనిపించింది’’
‘‘నువ్వు చెబుతుంటే ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది నాకు కూడా’’
‘‘చందూతో చెప్పి రేపే తీసుకువెళ్తాను’’ అంది ఉత్సాహంగా.
పిచ్చిపిల్ల అనుకుంది మనసులో ఆవిడ.
ఆ రాత్రి తెల్లవారింది కానీ సుగుణ మాత్రం కనులు తెరవలేదు. నిద్రలోనే ఆమె జీవితం పరిసమాప్తమయిపోయింది. నీ పాత్ర అయిపోయింది వచ్చెయ్యమని ఎవరో పిలిచినట్లే వెళ్లిపోయింది.
‘‘అమ్మా! ఇంకా లేవలేదా?’’ అని అడగటానికి వెళ్లిన విశ్వ, ఆమెలో చలనం లేకపోవటం గమనించి కంగారు ‘చందూ! చందూ!’ అని అరిచింది.
‘‘ఏమైంది విశ్వా!’’ అంటూ పరుగెత్తుకొని వచ్చాడు చందూ.
‘‘అమ్మ.. అమ్మ పలకటంలేదు.. చూడు చందూ..’’
‘‘నువ్వేం కంగారుపడకు విశ్వా.. అంటూ వెళ్లి అర్జంట్‌గా రమ్మని ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేశాడు.
ఆయన రావటం ‘ఆవిడ ఇక లేరని’ చెప్పటంతో విశ్వ అక్కడే కుప్పకూలిపోయింది.
వెంటనే విశ్వను హాస్పిటల్‌లో చేర్పించారు.
తల్లి చనిపోవటాన్ని తట్టుకోలేకపోవటమే ఈ స్పృహ తప్పటానికి కారణం. కంగారు లేదు. మీరేం భయపడవద్దు. జరగవలసిన కార్యక్రమం గురించి మీరు చూసుకోండి’’ అని వెళ్లిపోయారాయన.
వెంటనే భువనత్తయ్యకి ఫోను చేసి ఈ విషయం చెప్పాడు.
‘‘అదేమిటిరా! పెద్ద వయసూ కాదు, అనారోగ్యమూ లేదు. పొద్దునే్న ఇలాంటి వార్త చెప్పావు. ఒక అరగంటలో అంతా బయలుదేరుతాం’’ అని ఫోను పెట్టేసిందావిడ.
చుట్టుప్రక్కల అందరికీ నిముషాల్లో చేరిపోయింది.
‘‘అయ్యో! ఎంత మంచిది సుగుణ? ఎవరినీ నొప్పించేది కాదు. మళ్లీ వస్తుందనే అనుకున్నామే. ఇలా జరిగిందేం?’’ అని ఒకరంటే‘‘ఎవరింట్లో ఏ సాయం కావాలన్నా పిలవకుండానే ముందుకు వచ్చేది’’ అని మరొకరు.
‘‘విశ్వకు వాళ్ళమ్మంటే ప్రాణం. ఎలా వుందో ఏమిటో’’ అని ఇంకొకరు.
ఎవరికి తోచిన రీతిలో వారు విచారాన్ని, ఆమె మంచితనాన్ని వ్యక్తం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు గుమికూడి.
కొందరు లోపలికి వచ్చి భువనను, కాత్యాయనిని పలకరించి వెళ్ళారు. మరికొందరు సరోజినిని పలకరించారు.
అందరూ అలా గుమిగూడి ఉండగానే కారులో ఆ కుటుంబం అంతా వెళ్లిపోవటం జరిగిపోయింది.

- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206