డైలీ సీరియల్

భక్తికే అగ్రతాంబూలం( ప్రహ్లాదుడు -16)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు స్వామిని చూచేవారికి భయం కలిగింది. లోకభయంకరుడైన రాక్షసుని తుదికాలం వచ్చిందని తెలుసుకొన్న దేవతలు, దానవులు,విద్యాదరులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, పణులు, చారణులు, యక్షులు, కినె్నరులు, పన్నగులు, ప్రజాపతులు, వైతాళికులు,విష్ణు సేవకులు, గరుడులు, నారదాదులు, త్రిమూర్తులూ, త్రిమాతలు.. సర్వలోకం ఇక్కడే వచ్చిందానన్నట్లు ఆకాశమంతా వీరితో నిండిపోయింది.. నరరూపము, మృగరూపం రెండూ రూపాలు ఒకటిగా చేసుకొని రాత్రీ పగలు కానీ సంధ్యాసమయంలో గృహానికి ఆవల లోపలా కాకుండా ద్వార మధ్యంలో ఆకాశమూ భూమి కానటువంటి తన ఊరువుల పైన ప్రాణసహితాలూ ప్రాణరహితాలూ ఆని గోళ్లతో రక్కి బ్రహ్మ దగ్గర పొందిన వరాలకు అనుగుణంగానే ఆ రాక్షసరాజును నరసింహస్వామి వధించి వేశాడు. లోకకళ్యాణం జరిగిందని దేవదుందుభులు మోగాయి. ఆకాశంనుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధరులు, నారద తుంబురులు వీణాగానం చేశారు.
ఆహా! స్వామికి వీలుకానిది ఏముంది? ఎంత తెలివితోను కోరికలు కోరినా కోరికే స్వామి అయిన స్వామికి తెలివే స్వామి అయిన స్వామికి వీడొక లెక్కనా.. ఎంత మదించి ఎంతమందిని బాధపెట్టినా చివరకు ఒక్క లిప్తకాలంలోనే భగవంతుని చేతిలో సంహరించబడ్డాడు కదా అని ఎవరికి వారు అనుకొంటున్నారు.
హిరణ్యకశిపుని శరీరాన్ని పక్కకుతోసివేసి ఉగ్ర నారసింహుడు ముందుకు అడుగులు వేసాడు. ఆయన దగ్గరకు పోవడానికి దేవతలంతా భయపడి వెనక్కు అడుగులువేశారు. అంతే సంతోషంతో ఉన్న దేవగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. స్వామి చెంతకు వెళదామను లక్ష్మీదేవి అనుకొంది. ఒక్క అడుగు వేయబోయి మరలా వెనక్కు అడుగువేసింది. అమ్మో ఇపుడు ఇంత కోపంతో ఉన్న స్వామి చెంతకు నేను వెళ్లలేను అనుకొంది. ఎవరికి వారు అందరూ ఉగ్రరూపంతో ఉన్న స్వామి చెంతకు చేరలేక చేరకుండా ఉండలేక సతమతమైపోతున్నారు. దీనినంతా విధాత అయిన బ్రహ్మ గ్రహించాడు. ఈసమయంలో స్వామిని శాంతింప చేసేవారు ఎవరా అని ఆలోచించాడు. ప్రహ్లాదుడు ఒక్కడే స్వామి చెంతకు చేరగలడు. ఉగ్రనరసింహుడని ఆహ్లాదపరచగలడు ఆనందపరచగలడని అనుకొని ప్రహ్లాదుని స్వామి చెంతకు పంపించాడు.
ప్రహ్లాదుడు స్వామి చెంతకు అడుగులు వేసాడు. దండ ప్రణామాలు చేశాడు. చేతులు జోడించాడు. ఎన్నో చెప్పాలనుకొన్నాడు కాని ప్రహ్లాదుని పెదవులు అదరిపోతున్నాయి కానీ మాట ఒక్కటి కూడా వెలుపలికి రావడం లేదు. అంతలో తన చెంతకు వస్తున్న చిన్నారి బాలుడిని నారసింహుడు చూశాడు.
చిరునవ్వు నవ్వాడు. ‘నాయనా ఇలా రా’ అంటూ తానే అడుగు ముందుకువేసి చేతులు చాపి ప్రహ్లాదుని తన అంకపీఠంలో కూర్చోబెట్టుకొన్నాడు. స్వామి కరకమలాలు తాకినంతనే ప్రహ్లాదునిలో జ్ఞానం ఆవిర్భవించింది. దేహం ఆనందంతో తుళ్లి పడింది. ఒళ్లంతా గగుర్పొడించింది. సంతోషంతో ఆనందభాష్పాలు కారిపోసాగాయి. కంఠం రుద్ధమైంది. స్వామీ అని ఎలుగెత్తి పిలవాలనుకొన్న పిలుపు ప్రహ్లాదుని కంఠంలోనే ఆగిపోయింది. స్వామి మరింతగా ప్రహ్లాదుని దగ్గరకు తీసుకొని తల నెమిరాడు. ఆత్మజ్ఞానం ఉదయించిన ప్రహ్లాదుడు స్వామిని వేనోళ్లతో కీర్తించాడు.
స్వామి నా కోసమే నీవు ఈ రూపాన్ని సృజియించుకున్నావు భక్తులను కాపాడటానికి నీవు దేనినైనా చేయగల సమర్థునివి. నారసింహా! నిన్ను చేరటానికి తపస్సులు, ఉపవాసాలకన్నా నిన్ను నమ్మి నీపై అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకుని భక్త్భివాన్ని మనసున నాటుకుంటే చాలు స్వామి. నీవు భక్తులను వాత్సల్యంతో కాపాడుతావు అంటూ ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతించాడు.
మెల్లమెల్లగా సర్వ దేవతలు స్వామి చెంతకు వచ్చారు. స్వామి వైభవాన్ని అందరూ కీర్తించారు. దేవతలంతా ప్రహ్లాదుని దీవించి ఈ దానవకులాన్ని నీవు ధర్మమార్గంలో నడిపించు రారాజువుగా కీర్తిపొందుతావు అని దీవించారు. నారసింహుని దయామృతాన్ని గ్రోలిన ప్రహ్లాదుని దానవకులమంతా పొగిడి వాని బాటలో నడవడానికి అందరూ జైజై నాదాలను పలికారు. జై నారసింహా! జై ప్రహ్లాదా అనే నినాదాలు మిన్ను ముట్టాయి.
- ఇంకాఉంది