డైలీ సీరియల్

వామనుడు - 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవా! మహానుభావ! సమస్త్భువనాలను నీ కడుపులో దాచుకున్నావు. ఈ లోకాలకు ఆది అంతమూ నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కడతేరటానికి కారణం నీవే. సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని చేజార్చుకుని ఎంతో కాలంలో దేవతలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వారిని కాపాడడానికి నీవే దిక్కు. నీవే నిన్ను సృజియించుకుంటావని , నీవే మా పుత్రుడిగా పుడతావని మేము వేనవేల ఆశలతో ఎదురుచూస్తున్నాం. ఇక జాగుచేయక మాకు కోరిక నెరవేర్చు స్వామీ. నీ రాకకై అదితి తోపాటు నేను నాతోపాటు సజ్జనులు సాధువులంతా ఎదురుచూస్తున్నారు స్వామీ త్వరపడి మా కనుల ముందు నీ దివ్యరూపాన్ని సాక్షాత్కరింపచేయు తండ్రీ! ’’అని వేడుకున్నాడు.
ఆ సమయంలోనే బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువు ఆవిర్భావానికై వేడుకున్నారు. శ్రావణ ద్వాదశి, శ్రవణా నక్షత్రం, అభిజిత్తులగ్నం , పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమ మార్తాండుడై వెలిగే సమయం, గ్రహాలు, నక్షత్రాలూ చంద్రుడూ ఉచ్చదశలో ఉండగా అదితి గర్భం నుంచి మహావిష్ణువు వామనాకారంలో జన్మించాడు.
ఆ క్షణంలో వామనుడు నాలుగు చేతులు, ఆ చేతుల్లో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ ధరించి ఉన్నాడు. గోరోజనంరంగు వస్తమ్రూతోను, మకర కుండలాలతోను, మెరిసే చెక్కిళ్లతోను, ఎదపై శ్రీవత్సాన్ని కలిగి ఉన్నాడు. లక్ష్మితోకూడి ఉండాల్సిన వక్షస్థలంపైన అందమైన వనమాల రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, బాహుపురులూ, కిరీటమూ , హారాలు, కాలిఅందెలు, కంఠాన కౌస్త్భుమణితో మెరిసి పోతూ అదితి కశ్యపులకు దర్శనమిచ్చాడు.
అలా వామనుడు పుట్టీపుట్టగానే దిక్కులన్నీ మహావెలుగును ప్రసరింపచేశాయి. సప్తసముద్రాలు నిర్మలంగా మారాయి. భూమి పొంగి పులకరించింది. సిద్ధులూ, నాగులూ, సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ, కనుల తడితో ఆనందించారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాయిద్యాలు మోగిస్తూ ఆటలు ఆడి పాటలు పాడారు. ఆకాశంలో దేవతలంతా దివ్యదుందుభులను మోగించారు. పుష్ప వృష్టి కురిపించారు. పూల చెట్లన్నీ పూలను విరజిమ్మాయి.
ఆ చతుర్భుజుడైన మహావిష్ణువు వామనుడై కనిపించేసిరికి అదితి ఆశ్చర్యానందాలకు గురైంది. ఎంతటి విచిత్రం! ఈ మహానుభావుడు పదినెలలూ నా గర్భాన ఉన్నాడంటేనే చిత్రాతి చిత్రంగా ఉందికదా అనుకొని తిరిగి తల్లియై చేతులు చాచింది. ‘‘నా బంగారుకొండా! నా చిన్ని నాయనా’’ అని మాతృహృదయంతో విశే్వశ్వరుని పిలిచింది. ఆమె పిలుపుకు కరిగిపోయి తన రూపాన్ని వదిలి వేసి చిన్ని శిశువువోలె మారిపోయాడు ఆ మురారి. అదితి చేతుల్లో ఇమిడిపోయాడు. ఆ తల్లి స్తన్యానిస్తూ ‘‘తండ్రీ! నా పాలిదేవుడా! చిన్నారి తనయుడా!’’ అంటూ ముద్దులుగుడిచింది. ‘‘నా వంశానికే అలంకారమైన వాడా! నా పెన్నిధీ! నన్ను నాబిడ్డలను కాపాడే వానివి నీవే కదా’’ అని ముద్దులు పెట్టుకుంది.
అంతలోనే ఆ వామనుడు మరలా బ్రహ్మచారిగా మారిపోయాడు. పొట్టిబాలుడై వడుగు చేయదగిని వయస్సు కలవానిగా మారిపోయాడు. ఆ కొడుకును చూసి అదితి కశ్యపులు ఆనందంతో మైమరిచిపోయారు. అక్కడున్న వారంతా ఆహా ఏమి భాగ్యమో వీరిది. పరమేశ్వరుడినే బిడ్డడుగా పొందారు అని అనుకొన్నారు.
తాపసులంతా వచ్చి అదితికశ్యపుల కుమారుడిని దీవించారు. కావాల్సిన కార్యాన్ని చేయడానికి తొందరపడమని కశ్యపుని హెచ్చరించారు. వామనునికి ఇక ఉపనయన దీక్ష ఇవ్వాలని పెద్దలంతా నిర్ణయించారు. వడుగు మహోత్సవం అంగరంగవైభోగంగా జరిపించడానికి దేవతలంతా వచ్చారు.
మునీంద్రులు కశ్యపునికి తోడుగా నిలిచారు. ఉపనయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వామనునికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి జన్నిదాన్ని, కశ్యపుడు ముంజ దర్భల మొలత్రాడును, అదితి కౌపీనాన్ని భూదేవి నల్లని జింక చర్మాన్నీ, చంద్రుడు దండాన్ని , ఆకాశం గొడుగునూ, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్త ఋషులు పవిత్రమైన దర్భలను బహూకరించారు.
కుబేరుడు వచ్చి భిక్షాపాత్రను వామనునికి ఇచ్చాడు. జగన్మాత పార్వతీ దేవి ప్రసన్నమై ‘‘అక్షయం’’ అంటూ ఆ బ్రహ్మచారికి భిక్ష పెట్టింది.
దేవతలూ, బ్రాహ్మణులు, తాపసులు, మునీంద్రులూ అందరూ వామనుని మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటూ దీవించారు. సంప్రదాయాన్ని అనుసరించి వేదమంత్రాలను చదువుతూ జ్వాలయానంగా వెలుగుతున్న అగ్నిహోత్రంతో ఉత్సాహంగా బ్రహ్మచారి హోమం చేశాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804