డైలీ సీరియల్

విలువల లోగిలి-79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లేదు.. లేదు.. ఇదుగో ఇప్పుడే వెళ్లిపోతున్నాను. పావుగంటలో రెడీ అయిపోయి నీ ముందుంటాను. ఓ.కె’’ అంటూ బాత్రూమ్‌లో దూరాడు.
‘‘అమ్మయ్య ఒక పని అయింది’’ అనుకుంది విశ్వ.
అత్తయ్య పక్కన లేకపోతే తనకు ఒక చెయ్యి లేనట్లే వుంది. ‘హ్యాండీకాప్‌డా నువ్వు’ అంది అంతరంగం పరిహాసంగా.
అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటారు, అసలు అత్తగార్లకు కోడళ్ళు అలా ఉండాలి. ఇక్కడ రివర్సు, ఆవిడే తనకి సహరిస్తారు.
అంతా మంచివాళ్ళ మధ్య తన జీవితాన్ని నడిపిస్తున్నాడు ఆ భగవంతుడు. ఆయనకు సర్వదా తను ఋణపడి ఉండాలి అనుకుంది.
చందూ రెడీ అయిపోయాక ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడేవున్న గంగతో కొబ్బరిబోండాలు కొట్టి నీళ్ళు రెడీ చేసావా? అత్తయ్యవాళ్ళు రాగానే ఇవ్వాలి అని చెప్పానుగా’’.
‘‘ఇవిగో కొబ్బరినీళ్ళు. అవిగో గ్లాసులు.. అంతా రెడీ అమ్మగారూ.. అయ్యగారు రావటమే ఆలస్యం’’ అంది గంగ తాను సిద్ధమేనన్నట్లు.
అది తెలిసినట్లే కారు వచ్చి ఆగటం అత్తయ్య, మామయ్య దిగటం ఒకేసారి జరిగిపోయాయి.
‘‘అత్తయ్యా, మామయ్యా! ఎలా ఉన్నారు?’’
‘‘బాగున్నాం తల్లీ’’అంది అమృత.
‘‘నేనేం బాగోలేదు. మీ అత్తయ్య నన్ను సరిగా తిండి తిననీయలేదు. చూడు ఎలా చిక్కిపోయానో’’ అన్నాడు విశ్వతో తన పొట్టను చూపిస్తూ నరేంద్రనాధ్.
‘‘మీ కోడలు దగ్గరకు వచ్చేసారుగా.. ఇక మీకు బాగా పెడుతుందిలెండి’’ అంది అమృత నవ్వుతూ.
‘‘అంతేకదా!’’ అంది విశ్వ మామగారిని సపోర్టు చేస్తూ.
‘‘ఏరా చందూ! ఎలా ఉన్నావు? విశ్వను బాగా చూసుకున్నావా?’’
‘‘అదే అనుకుంటున్నా. నన్నడుగుతున్నారేమిటి? తమరి ముద్దుల కోడలు విశ్వ గురించి కదా అడగాలని. ఇంతలో అడిగేసావ్’’ అన్నాడు చందూ ఇది తనకు మామూలే అన్నట్టు
విశ్వ నవ్వుకుంటూ వాళ్ళిద్దరికీ కొబ్బరినీళ్ళు అందించింది.
టిఫిన్లు తింటూ తీర్థయాత్రల విశేషాలు చెప్పుకున్నారు.
తర్వాత విశ్వ, సూర్యచంద్ర తమ కార్యకలాపాలు చూసుకుంటానికి వెళ్లిపోయారు.
***
మరో నాలుగు కేలండర్లు గోడకు వ్రేలాడి తమ దృష్టినంతా అందరిపైనా కేంద్రీకరించి చివరకు బుట్టదాఖలయ్యే తమదైన అదృష్ట దురదృష్టాలకు చింతిస్తూ వీడ్కోలు పలికాయి.
ఇంజనీరింగ్ చివరి సంవత్సరం వాళ్ళు వెళ్లిపోతున్నపుడు మాత్రం విశ్వకు దుఃఖం ఆగలేదు. ఆ విద్యార్థినీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకంటే తమ దగ్గిరే ఎక్కువ గడిపారు. అలాంటిది విడిపోతుంటే ఎంత శోకం?
వాళ్ళు వెళ్ళేముందు వారి తల్లిదండ్రులందరినీ పిలిపించి ‘పాదపూజ’ చేయించింది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అనే మొదటి పాఠం వారికి గుర్తుండిపోయేలా. అదే రోజు తమ గురువులను ఆహ్వానించి వారికి పాదపూజ చేసి ఆచార్యదేవోభవకి అర్థం ఇదే అని తెలియజెప్పారు విశ్వ, సూర్యచంద్రలు.
ఏ కాలేజీకయినా క్యాంపస్‌లో కొందరే సెలక్టు అవుతారు. కానీ లోగిలి విద్యార్థుల పంథానే వేరు అని నిరూపించారు. ఈ విషయంలో కంపెనీలే పోటీబడ్డాయి. ఫలితం మొత్తం మూడు వందలమందీ వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించి మూడవ సంవత్సరంలోనే విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఇప్పుడంతా మరో రెండు, మూడు నెలలో ఆ ఆ కంపెనీలలో చేరటానికి సంసిద్ధవౌతున్నారు.
ఈ పదహారు సంవత్సరాలలో ఒక్క వివాదంకూడా చోటుచేసుకోలేదు. రాగింగ్ ఆ దరిదాపులకు చేరలేదు. స్నేహమే తప్ప ప్రేమకు తావివ్వలేదు. క్రమశిక్షణకు అర్థంలా నిలిచారు. నేర్చుకున్న ప్రతి అంశాన్నీ ఆచరణ యోగ్యం చేయటానికి ప్రయత్నించారు. విలువలకే విలువనిస్తూ సంస్కారానికి పెద్దపీటవేసారు. లోగిలి అనేది ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.
ఈ అంశాలే చివరి రోజున వారి కన్నీటి ప్రవాహానికి ఆనకట్టగా నిలిచింది. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. భవిష్యత్తులో కూడా తమంతా ఒకే తల్లి బిడ్డల్లా కష్టసుఖాలు పంచుకోవాలని నిశ్చయించుకున్నారు. మరి వారంతా లోగిలి బిడ్డలేగా!
విశ్వ మబ్బుల్లా మసక తెరలు క్రమ్ముతున్న కళ్ళ లోగిళ్ళలోంచి యువ ప్రవాహంలా తరలి వెళుతున్న విద్యార్థినీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అమృత హృదయ నిలయం గేటుదాకా వెళ్లి సాగనంపి వచ్చింది. వారు వెళ్లిపోతూ తామిద్దరి కాళ్ళకు కన్నీటితో పాదాభిషేకం చేయటం గుర్తువస్తే చాలు మనసు ద్రవించిపోతోంది. ఎన్నాళ్ళ బంధం? వీరిని కనలేదు.. అంతే.. కానీ వారి లాలన, పాలన అంతా తన చెంతే. మూడు వందలమందికి ఒకేసారి వీడ్కోలు పలకటం అంటే మాటలా? హృదయాన్ని రాయి చేసుకోవాలంటే తన తరమా?
వీళ్ళంతా తన దగ్గిరే ఉండిపోతే అనే స్వార్థపు ఆలోచన తన మనసు గుమ్మాన్నికూడా తాకరాదని విశ్వ విశ్వప్రయత్నం చేస్తోంది.
‘‘నీకు నేనున్నాను కదమ్మా!’’ అంటూ చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు చందూ ఆమె హృదయాన్ని చదివినట్లే.
‘‘అంతే!’’ వెళ్లి అతని ఎదపై వాలిపోయింది.
ధైర్యం చెబుతున్నట్టుగా అతని చేతులు ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాయి.
అప్పటిదాకా అక్కడే వున్న అమృత, నరేంద్రనాధ్‌లు వాళ్ళకి ఏకాంతాన్ని కల్పించాలని వారిని వదిలేసి లోపలికి వెళ్లిపోయారు. వారితోపాటూ గంగ, శివ, ఆలీ కూడా!
అందరిలో ఒకే దుఃఖం. అంతా ఒక కుటుంబంలా పెరిగారు. ఒక మనిషి దూరమైతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది ఒక్కసారి ఇంతమంది వీడ్కోలు చెబితే ఎవరికైనా తట్టుకోవటం కష్టమే.
కాకపోతే కష్టమనేది ఎప్పుడూ తెలియకుండా వచ్చి చుట్టుముడుతుంది. కానీ ఈ కష్టం ముందుగా తెలిసిందే. కాబట్టే ముందునుంచే దానికి సంసిద్ధమయి ఉండడంవలనే ఈ మాత్రమన్నా సాధ్యపడింది. లేకపోతే ఈ సాధ్యం అసాధ్యమే అయ్యేది వారందరికీ.
వీరి వెనుక దుఃఖిత హృదయాలు మరిన్ని ఉన్నాయి. అదే విశ్వసౌధంలో వున్నవారు. వారంతా కూడా వీరిని ఆత్మీయులుగా చూసుకొనేవారు. కాస్త సమయం దొరికితే వారంతా వీరి దగ్గర చేరిపోయి ఆత్మీయతను పంచేవారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206