డైలీ సీరియల్

విలువల లోగిలి-82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ ధనవంతురాలు అని తెలుసుగానీ ఇంత అని తెలియదు. ఏమి బిల్డింగ్స్ అవి.. రాజభవనాలలా ఉన్నాయి.
ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులను ఉచితంగా చెప్పించటం అంటే మాటలా?
అసలా పూలతోటలు ఏమిటి? ఆ పొలాలు ఏమిటి? మైగాడ్.. కళ్ళు తిరిగిపోతున్నాయి.
విశ్వక్క తమింట్లో ఎంత సాధారణంగా ఉంది?
కాస్త వుంటే గొప్పలు ప్రదర్శించే ఈ లోకంలో విశ్వక్క తప్పు పుట్టింది అనుకున్నాడు ఫణి.
వైజాగ్‌లో చూడతగ్గవన్నీ తనే దగ్గరుండి చూపించింది విశ్వ. వెళ్ళేటప్పుడు అతనికి మంచి డ్రెస్సుకొచ్చింది.
ఇంట్లోవాళ్ళకు కూడా ఏవేవో గిఫ్ట్స్ పాక్ చేసి ఇచ్చింది.
అందరినీ పేరు పేరునా అడిగినట్లుగా చెప్పమంది.
చివరకు వాళ్ళ పక్కింటి వాళ్ళందరినీ కూడా!
ఫణి ఆ అభిమానానికి మురిసిపోయాడు.
ఆ రోజు ఈ ప్రేమకే తను వెన్నలా కరిగిపోయాడు.
అలా మారకుంటే తను ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. అంతా ఈ అక్క మహిమే.
‘‘్ఫణీ! ఏంటి ఆలా చూస్తున్నావ్’’
‘‘ఏంలేదక్కా! నీవల్లేగా నేను మనిషిగా మారాను అని గుర్తుకు తెచ్చుకుంటున్నాను’’.
‘‘సర్లే! ఆ విషయాన్ని ఎన్నిసార్లు చెబుతావు? నీ బస్సుకి టైమ్ అవుతోంది. ఆలీ తీసుకువెళ్లి నిన్ను బస్టాండ్‌లో దింపేస్తాడు. నాకు చిన్న పని తగిలింది. లేదంటే నేనే నీకు సెండాఫ్ ఇచ్చేదాన్ని’’.
‘‘్ఫర్వాలేదక్క. ఇప్పటిదాకా నువ్వు చేసినదే ఎక్కువ. ఒక్కసారి వీలు చూసుకుని మా ఇంటికి రా అక్కా!’’
‘‘అలాగే! మీ పెళ్లిళ్ళు ఉన్నాయిగా. తప్పక వస్తాను’’ అంటూ ఫణిని సాగనంపింది.
ఆలీని పిలిచి ఫణీని జాగ్రత్తగా బస్సు ఎక్కించి రమ్మని చెప్పింది.
***
విశ్వ దిగులుగా కూర్చుంది.
చందూ ఆమె చెంత చేరాడు.
‘‘పిల్లలు గొప్పవాళ్లు అవుతుంటే తల్లి ఆనందపడాలి కానీ ఇలా డీలాపడతారా చెప్పు’’ అన్నాడు అనునయంగా.
ఆ రోజు ఫస్ట్ బ్యాచ్ మెడిసిన్ చదువుతున్న వాళ్ళంతా వెళ్లిపోతున్నారు.
మొన్న ఇంజనీరంగ్ పిల్లలు వెళితేనే సగం నీరసపడిపోయింది. మిగతా వాళ్ళున్నారులే అనే ధైర్యంతో దానిని పోగొట్టుకుంది.
ఇపుడు అంతా ఖాళీ అయిపోతున్నట్లుంది.
‘‘విశ్వా! వాళ్ళు వెళ్లిపోతే స్కూలు పిల్లలు లేరా.. సొంత వాళ్ళయితే ఒకరు, ఇద్దరు.. మనకు ఎందరో!
పాతవాళ్ళు వెళుతుంటారు.. కొత్తవాళ్ళు వస్తూ ఉంటారు. మనం నదిలా సాగిపోతూ ఉండాలి.. అంతే. అందరూ నిన్ను ధైర్యవంతురాలివి అనుకుంటారు. నువ్వెంత బేలవో నాకు మాత్రమే తెలుసు.
వాళ్ళందరికీ నవ్వుతూ వీడ్కోలు పలుకు.
నువ్వే డీలాపడితే వాళ్ళేమయిపోతారు చెప్పు..
ఎక్కడికి వెళ్లిపోతారు?
మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు మనల్ని చూడటానికి.
అవునా? కాదా?
‘‘అవును’’ అంది ఏడుపు ముఖంతోనే.
‘‘ఉండు. కెమెరా తెచ్చి ఫొటో తీసి చూపిస్తాను’’
‘‘ఎవరికి?’’
‘‘ఇంకెవరికి? వాళ్ళందరికీ’’
‘‘వద్దు.. వద్దు.. వాళ్ళు ఇంకా బాధపడతారు’’
నిజంగా చందూ ఫొటో తీసి చూపించేస్తాడేమో అని భయపడింది.
‘‘ఏమిటి? బయలుదేరుదామా? వాళ్ళంతా నీకోసమే ఎదురుచూస్తున్నారు’’.
‘‘వచ్చేస్తున్నాను. ఒక్కసారి ముఖం కడుక్కుని వచ్చేస్తాను’’ అని లోపలికి వెళ్లింది విశ్వ.
చందూ అక్కడే ఆమెను తీసుకువెళ్లటానికి ఉన్నాడు.
వస్తున్న విశ్వను చూసి విస్తుపోయాడు.
ఇందాకటి విశ్వకు ఇప్పటి విశ్వకు పోలికే లేదు.
క్రీమ్ కలర్ కాటన్ చీరలో శాంతమూర్తిలా ఉంది విశ్వ.
కాసేపటి క్రితం చిన్నపిల్లలా.. ఇపుడూ.. హుందాగా....
ఆడవారు తమని ఎలా కావాలాంటే అలా మలుచుకోగలరు.
ఆ శక్తి మగవాళ్ళకు ఉండదు.
అందుకే మహిళా! నీకు జోహార్లు అనుకున్నాడు మనసులో.
‘‘పద చందూ!’’ అంది మామూలుగా.
అసలు అంతకుముందు ఏమీ జరగనట్లే.
స్టేజీ మీదకు వెళ్లి తనే వాళ్లకు ముందుగా వీడ్కోలు పలికింది.
వారంతా మూగగా రోదిస్తున్నారు.
వీరంతా రేపటినుంచీ ప్రాణప్రథాతలు.
వారందరినీ గర్వంగా చూసుకుంది విశ్వ ఒక్క నిముషం.
‘‘మేము మిమ్మల్ని మరిచిపోము అమ్మా!
మళ్లీ మీ దగ్గరికే వస్తాం. ఇది తాత్కాలిక వీడ్కోలు నాన్నా!’’
అందరూ అలా రాసి ఉన్న ప్లైకార్డ్స్‌ని ఎత్తి పట్టుకున్నారు.
వాళ్లందరిని దగ్గరికి తీసుకోవాలనిపించింది విశ్వకు ఆ క్షణంలో. వారి మనసులో భావాను ఇలా అక్షర రూపంలో వెలికితెచ్చారు. మరి మాటలు రాని పరిస్థితి.
అందరూ ముందుగానే విశ్వ దగ్గిర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
వాళ్ళకి విశ్వ అంటే ఎంత ప్రేమ వుందో తెలుపుతూ వాళ్ళంతా కలిసి ఒక్కో పేజీ పంచుకుని రంగుల ప్రేమ హరివిల్లును ఆమెకు సమర్పించారు.
వాళ్ళు వెళ్లిపోయినా వాళ్లందరి జ్ఞాపకంగా అది అనుక్షణం ఆమె కళ్ళముందే!
టీపాయ్ మీద ఫ్లవర్‌వాజ్‌లా.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని గుర్తుతెచ్చుకునేలా.
వారి జ్ఞాపకాలను నెమరువేసుకునేలా.
***

వెళ్లిన వాళ్ళంతా కళ్ళముందు లేకున్నా నెట్‌లో దర్శనమిస్తూనే ఉంటారు. రోజూ ఒక గంట వాళ్ళతోనే కాలక్షేపం విశ్వకు.
ఎప్పటి విషయాలు అప్పుడు ఆమెతో పంచుకుంటూనే ఉన్నారు. అందరితో అనుబంధం ఉన్నా ఈ ఫస్ట్ బేచ్ వాళ్ళతో ప్రత్యేక అనుబంధం ముడివేసుకుపోయింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206