డైలీ సీరియల్

విలువల లోగిలి-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాస్ మాత్రం చెప్పినట్లుగానే తమ దగ్గిరే ఉండిపోయాడు. ఎంత చెప్పినా వెళ్ళనని మొండికేశాడు. సరేనని ఒప్పుకోక తప్పలేదు.
వాడి ఇప్పటి ప్రేమకే ఇంత ముచ్చటపడుతుంటే ముందు ముందు ఇంకెంత మురిసిపోతుందో?
***
ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచే అని నిరూపించుకున్నారు. వాళ్ళంతా సైకిల్ చెయిన్‌లా ఒక బంధంలో ముడిపడి బ్రతికారు. అందుకే ఎవ్వరూ ఎవరినీ వదులుకోదలచుకోలేదు.
సొంత అన్నదమ్ములు, అప్పాచెల్లెళ్ళకంటే ఎక్కువగా ఒకరి సమాచారం ఒకరికి అందించుకుంటున్నారు. దూరంగా వున్నా వాళ్ళందరి మనసులూ కలిసే!
వాళ్ళంతా కలిసి ఉండటమే కాదు, వాళ్ళతో అమ్మ విశ్వను, నాన్న సూర్యచంద్రను కలుపుకోవటమే విశేషం.
వాళ్ళ పుట్టినరోజు అయినా విశ్వ దగ్గిరే గడిపేవారు. ఆమె పుట్టినరోజు అయినా అక్కడే ఉండేవాళ్ళు.
వాళ్ళంతా సెటిల్ అయ్యాక ఒక ప్లాను వేసుకున్నారు. అమ్మకు తాము దూరంగా ఉన్నామన్న ఆలోచన రాకూడదనే వారి ఉద్దేశ్యం. అందుకుగాను తమకు పెళ్లిళ్ళు అయినా, పిల్లలు పుట్టిన ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజు అమ్మ దగ్గిర గడపాలని. అలా అందరూ చేస్తే మూడొందల అరవై రోజులు తమలో ఎవరో ఒకరు, ఒక్కోసారి ఇద్దరు విశ్వ దగ్గర ఉండొచ్చని, అలా విశ్వ ప్రేమను తామూ, తమ ప్రేమను విశ్వా పొందగలమని నిశ్చయించుకున్నారు.
అలా ఒకరు వెళుతుంటే మరొకరు వచ్చేవారు.
మొదట్లో ఇదేమిటో విశ్వకర్థమవలేదు. తర్వాత వాళ్ళే వివరించి చెప్పాక వీళ్ళంతా నా బిడ్డలే అనుకుంది.
***
‘‘చందూ! పిల్లలకి మనమంటే ఎంత అభిమానమో చూసావా?’’
‘‘అవును విశ్వా! సొంత పిల్లలే కన్నవాళ్ళను వదిలేసి వెళ్లిపోతున్న ఈ రోజుల్లో మనల్ని ఎవరో ఒకరు అంటిపెట్టుకుని ఉండాలన్న వారి తాపత్రయం చూస్తుంటే ముచ్చటవేస్తోంది.
‘‘వాళ్ళంతా మన దగ్గరికి రావటం బాగానే ఉంది. ఇపుడు మనల్ని వాళ్ళ దగ్గరకు రమ్మంటున్నారు’’
‘‘వెళదాం’’
‘‘మరి ఇక్కడ’’
‘‘అమ్మా నాన్న చూసుకుంటారు గదా. అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళ మాటలను వినాలి. వాళ్ల కోరికను తీర్చాలి’’
‘‘అవును.. ఏ ప్రేమయినా రెండు వైపుల నుంచే ఉంటేనే అందం’’
‘‘మనకులా’’
నవ్వుకున్నారు ఇద్దరూ.
చినుకులు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా పూలవర్షంలా కురిసాయి. ఆ చిరుజల్లులోనే తమ ఆవరణ అంతా కలియతిరిగారు జంటగా.
అలా ఎంతసేపు చేతులు కలిపి నడిచారో వారికే తెలియదు. కాళ్ళునొప్పి పుట్టాక ఇంట్లో వచ్చి పడ్డారు.
అమృత కంగారుగా వాళ్ళ చెంత చేరింది.
‘‘ఏమయ్యిందిరా’’ అంటూ.
‘‘ఏం కాలేదమ్మా! మీ కోడలుగారు వాకింగ్ చేశారు.. అంతే’’
‘‘తను పడే శ్రమకి మళ్లీ వాకింగ్ కావాలా ఏమిటి? ఏం అక్కర్లేదు’’
‘‘అమ్మ నీమీద ఈగను కూడా వాలనివ్వదు. ఒక్కోసారి మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు అసూయ వచ్చేస్తుంది’’
‘‘మరి మా అత్తయ్య కదా’’ అంటూ ఆవిడ వెనక చేరిపోయింది విశ్వ. వాళ్ళనలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది సూర్యచంద్రకు.
మళ్లీ మళ్లీ అదే భావన ఎప్పటిలానే.
వీళ్ళిద్దరూ ముందు జన్మలో తల్లీ కూతుళ్ళయి ఉంటారు అని కొత్తగా అనిపించింది.
వాళ్ళకు చెబితే వాళ్ళూ నవ్వుకున్నారు.
ఆరోజే వారికి ఇంకో కొత్త విషయం తెలిసింది.
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు ‘లోగిలి’లో చదివినవారంటే చాలు పెళ్లికి ఒప్పేసుకుంటున్నారట. ఎవరు? ఏమిటి? ఎలా ఉన్నారు ఏమీ అక్కర్లేదట.
పెళ్లిళ్ళ పేరయ్యలు డైరెక్టుగా ఇక్కడకు వచ్చేస వారి అడ్రసులు ఇమ్మని అడగటంతో అసలు విషయం తెలిసింది.
అది తమకెంతో ఆనందాన్నిచ్చే విషయం కదా! తాము అదే కదా కోరుకున్నది.
వారికి పుట్టబోయే సంతతి కూడా అంతకంటే గొప్పపేరు తెచ్చుకుంటుంటుంది.
ఆ రోజు ఆఫీసులో అందరికీ మూడు నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించాడు సూర్యచంద్ర.
విశ్వసౌధంలో అందరూ పండగ వాతావరణాన్ని చవిచూశారు. ఆ శుభవార్త విన్నాక వారంతా కూడా ఆ పండుగలో పాలుపంచుకున్నారు.
భారతదేశం వెలిగిపోతోంది అన్న మాటను నిజం చేసినట్లు.
***
సమాజం అంటే ఎవరోకాదు, మనమూ మన చుట్టూ ఉన్నవారే. అందరూ మనవాళ్ళే. అంతా బాగుండాలి. అందరూ మంచి వైపే పయనం సాగించాలి. ఇప్పుడున్న చెడును పారద్రోలాలంటే మనం ఏం చెయ్యలి అని ఆలోచించినపుడు విలువలను విస్మరించటమే కారణమనిపించింది. దానిని అధిగమించటానికే ‘లోగిలి’కి శ్రీకారం చుట్టడం, ఆ లోటును భర్తీ చేయటం జరిగిపోయింది. దానికి తమ కుటుంబం అంతా శ్రమించింది. చివరకు శ్రమకు తగ్గ ఫలితం అందుకుంది అని చెప్పటానికి నిన్నటి సంఘటనే తార్కాణం. తమ వంతు కృషి తాము చేసామన్న సంతృప్తి తమకు మిగిలింది.
ప్రతి కుటుంబంలో మార్పు తీసుకురావటనికి ఒక చిన్నారిని తమకు సాయంగా మలుచుకుని తద్వారా ఊరు, రాష్ట్రం, దేశాభివృద్ధికి పునాది వేయగలిగాం.
తాము కోరుకున్న రామరాజ్యాన్ని నెలకొల్పగలిగాం. ఇపుడు దేశంలో ఎక్కడా అరాచికాలు లేవు. అత్యాచారాలు లేవు. అఘాయిత్యాలకు అంతకన్నా ఆస్కారం లేదు. ఉన్నదంతా శాంతిమార్గమే అనుకుంది ఆ జంట తృప్తిగా.
***
ఫస్ట్ బ్యాచ్‌లో ఎవరికి పెళ్లి ఊరిలో నిశ్చయమైనా పెళ్లి మాత్రం విశ్వనాథం ఆవరణలోనే. అమృత హృదయ నిలయం లోగిలిలోనే అనే మరో నిర్ణయం తీసేసుకున్నారు వారంతా కలిసి.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206